బడులు డిజిటల్ బాట
ABN , First Publish Date - 2020-09-01T09:05:54+05:30 IST
కరోనాతో మూతపడిన బడులు ఇటీవల తెరుచుకోగా, కేవలం ఉపాధ్యాయుల హాజరుకే ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇంతకాలం విద్యకు దూరమైన

నేటి నుంచి ఆన్‌లైన్ తరగతులు
ఉమ్మడి జిల్లాలో 2.67లక్షల మంది విద్యార్థులు
మూడు నుంచి పదోతరగతి వరకు పాఠాలు
డీడీ యాదగిరి, టీ-శాట్‌లో ప్రసారాలు
ఏర్పాట్లు పూర్తి చేసిన విద్యాశాఖ
నల్లగొండ, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి)/భూదాన్‌పోచంపల్లి: కరోనాతో మూతపడిన బడులు ఇటీవల తెరుచుకోగా, కేవలం ఉపాధ్యాయుల హాజరుకే ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇంతకాలం విద్యకు దూరమైన విద్యార్థులు నష్టపోకుండా ఉండేందుకు ప్రత్యామ్నాయంగా ఆన్‌లైన్ పాఠాలకు శ్రీకారంచుట్టి డిజిటల్ తరగతుల వైపు అడుగులు వేసింది. సెప్టెంబరు 1వ తేదీ నుంచి విద్యార్థులు ఇంటివద్దే ఉండి పాఠాలను వీక్షించనుండగా, అందుకు సంబంధించిన ఏర్పాట్లను విద్యాశాఖ పూర్తిచేసింది. అయితే ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతోపాటు ప్రజాప్రతినిధులు సైతం సహకరిస్తేనే ఆన్‌లైన్ తరగతులు విజయవంతం కానున్నాయి.
కరోనాతో వరుస సెలవులు రావడంతో 25శాతం మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు బంధువుల ఇళ్లల్లో ఉండగా, గ్రామీణ ప్రాంతానికి చెందిన విద్యార్థులు వ్యవసాయ పనుల్లో సాయం చేస్తున్నారు. తల్లిదండ్రులు పనులకు వెళ్తుండగా, మరికొందరు విద్యార్థులు ఇళ్లవద్దే ఉంటూ తమ్ముడు, చెల్లెళ్ల బాగోగులు చూసుకుంటున్నారు. కరోనా ప్రభావం ప్రస్తుత విద్యాసంవత్సరంపై పడగా, ఇంతకాలం చదివిన చదువును సైతం విద్యార్థులు మరిచిపోయే పరిస్థితి ఏర్పడింది. దీంతో వారు నష్టపోకుండా ఉండేందుకు ప్రభుత్వం ఆన్‌లైన్ పాఠాలకు శ్రీకారం చుట్టింది.
పూర్తయిన కసరత్తు
ఆన్‌లైన్ తరగతుల నిర్వహణ కోసం విద్యాశాఖ మొదటి 14 రోజులు బోధించనున్న పాఠాలు, వాటి సమయం, ప్రసారం చేసే ఛానళ్ల వివరాలతో షెడ్యూల్‌ను విడుదల చేసింది. డీడీ యాదగిరి, టీశాట్-నిపుణ, విద్యలో తరగతులు, సబ్జెక్టుల వారీగా బోధన చేయనున్నారు. దీనికి సంబంధించిన కసరత్తు ఇప్పటికే పూర్తయింది. ఉపాధ్యాయులు ఇప్పటికే విద్యార్థుల ఫోన్ నెంబర్లు సేకరించి వారితో, తల్లిదండ్రులతో మాట్లాడి ఆన్‌లైన్ తరగతులపై అవగాహన కల్పించారు.
ఇంట్లో టీవీ ఉందా, ఉంటే కార్యక్రమాలను ప్రసారం చేసే నెట్‌వర్క్ ఏంటిది, టీవీ లేకుంటే స్మార్ ఫోన్ ఉందా, దానికి ఇంటర్‌నెట్ కనెక్షన్ ఉందా అనే సమాచారాన్ని ఉపాధ్యాయులు సేకరించారు. టీవీతోపాటు, మొబైల్ ఫోన్‌కు ఇంటర్‌నెట్ కనెక్షన్ లేకుంటే ఇంటి చుట్టుపక్కల వారి టీవీల్లో తరగతులను వీక్షించేలా ఉపాధ్యాయులు ప్రత్యామ్నాయం చూపారు. ఇంటి చుట్టుపక్కల టీవీ లేని వారుసైతం ఉంటే, ఆ గ్రామంలో ఇతర విద్యార్థులతో గ్రూప్‌గా చేయడంతోపాటు, సర్పంచ్ సహకారంతో కమ్యునిటీ టీవీ ఏర్పాటుచేసేలా చర్యలు తీసుకున్నారు.
అంతేగాకుండా కేబుల్ టీవీ నెట్‌వర్క్ ఆపరేటర్లతో మాట్లాడి డీడీ-యాదగిరి, టీశాట్ ఛానళ్లు ప్రసారం చేసేలా చర్యలు తీసుకున్నారు. మొత్తానికి ఏ ఒక్క విద్యార్థి ఆన్‌లైన్ పాఠాలకు దూరంగా ఉండకుండా పటిష్ట ఏర్పాట్లను విద్యాశాఖ పూర్తిచేసింది.
నేటి నుంచి ఆన్‌లైన్ బోధన
ఉమ్మడి జిల్లాలో 3,306 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, 13,968 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలతోపాటు కేజీబీవీ, మోడల్‌స్కూళ్లు, కేంద్రీయ విద్యాలయాల్లో మొత్తం 2,67,961లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. వీరికి ఆన్‌లైన్‌లో తరగతులు ప్రారంభం కానున్నాయి.
మూడో తరగతి నుంచి పదో తరగతి తొలిదశలో 14రోజులకు సంబంధించిన పాఠాల షెడ్యూల్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు తరగతుల వారీగా అరగంట పాటు ఆన్‌లైన్ పాఠాలు రానున్నాయి. డీడీ-యాదగిరి ఛానల్‌లో మూడు, నాలుగు, ఐదు, ఎనిమిది, తొమ్మిది, పదో తరగతి పాఠాలు ప్రసారం కానున్నాయి. ఆరు, ఏడో తరగతి పాఠాలు టీశాట్ ఛానల్‌లో మధ్యాహ్నం 12 నుంచి 2.30గంటల వరకు ప్రసారం కానున్నాయి. అదేవిధంగా డీడీ-యాదగిరిలో పాఠాలు చూడలేకపోయిన వారు మరుసటి రోజు టీశాట్‌లో ఉదయం 10 నుంచి సాయంత్ర 5గంటల వరకు వీక్షించే వెసులుబాటును కల్పించారు.
మొదటి తరగతి ఇంకా అడ్మిషన్లు కాకపోవడం, రెండో తరగతి విద్యార్థులకు ఆన్‌లైన్ పాఠాలను అందుకునే సామర్థ్యం ఉండదనే అంచనాతో మూడో తరగతి నుంచే ఆన్‌లైన్ పాఠాలను అందుబాటులోకి తెచ్చారు. విద్యార్థులకు అందుబాటులో ఉన్న మొబైల్‌ఫోన్ల వాట్సప్ గ్రూపులకు ఉపాధ్యాయులు విషయాల వారీగా వర్కింగ్ షీట్లు ఇచ్చి హోంవర్క్ చేయించనున్నారు. విద్యార్థులతోపాటు, ఉపాధ్యాయులు సైతం పాఠాలను వీక్షించి పిల్లలకు ఏవైనా సందేహాలు ఉంటే ఫోన్‌లోనే తీర్చనున్నారు.
అంతా కలిస్తేనే
ఆన్‌లైన్ బోధన ప్రభుత్వ ఉపాధ్యాయులకు సవాల్‌గా మారనుంది. గ్రామీణ ప్రాంతాల్లో నిరక్షరాస్యత, పేదరికం, వలస కూలీలు ఉండటంతో వారికి ఆన్‌లైన్ తరగతులపై అవగాహన కల్పించడం కొంత ఇబ్బందే. అంతేగాక మారుమూల ప్రాంతాల్లో సిగ్నిల్ సమస్య ఉంది. ప్రసారాల సమయంలో విద్యుత్ సమస్య లేకుండా చూసుకోవాల్సి ఉంటుంది. అంతేగాక ఆన్‌లైన్ తరగతులను వీక్షిస్తున్నారా లేదా అనేది పర్యవేక్షించాల్సి ఉంటుంది.
వర్క్‌షీట్లు ఇచ్చి అవి పూర్తయ్యేలా చూడాల్సి బాధ్యత ఉపాధ్యాయులపై ఉంది. అయితే ఆన్‌లైన్ బోధన కేవలం ఉపాధ్యాయులతోనే సంపూర్తి కాదు. దీంట్లో తల్లిదండ్రుల పాత్ర కీలకం. వారితోపాటు, సమాజం భాగస్వామ్యం అయితేనే ఫలితాలు వస్తాయి. గ్రామాల సర్పంచులు, విద్యావంతులైన యువకులు ముందుకొచ్చి బాధ్యత తీసుకుంటే ప్రభుత్వ ఆశయం నెరవేరుతుంది.
హెల్ప్ డెస్క్, సబ్జక్ట్ ఎక్స్‌పర్ట్ టీంలు ఏర్పాటు చేశాం
భిక్షపతి, నల్లగొండ డీఈవో
ఆన్‌లైన్ క్లాసుల ప్రసారాలకు సంబంధించిన ఎలాంటి ఇబ్బందులు ఉన్నా పరిష్కరించేందుకు డీఈవో కార్యాలయంలో 9121212513 అనే నెంబరుతో హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేశాం. సబ్జెక్ట్‌పర సందేహాలు తీర్చేందుక సీనియర్ టీచర్లతో ఒక బృందాన్ని ఏర్పాటు చేశాం. కేబుల్ ఆపరేటర్లు డీడీ-యాదగిరి, టీశాట్ ఛానళ్లు ముందువరుసలో ఇచ్చేలా జాగ్రత్తలు తీసుకోవాలని కోరాం. విద్యాశాఖ డైరక్టర్, కలెక్టర్ ఆకస్మికంగా ఆన్‌లైన్ క్లాసుల్లోకి వచ్చి పురోగతిని సమీక్షిస్తామని ఇప్పటికే చెప్పారు. ఎంఈవోలు, సీఆర్‌పీలు బోధనాతీరును పర్యవేక్షిస్తుంటారు.
అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సి
అలుగుబెల్లి నర్సిరెడ్డి, టీచర్స్ ఎమ్మెల్సీ
కరోనా వేళ ప్రత్యామ్నయ బోధనా విధానాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తేవడం అభినందనీయం. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెరిగే అవకాశం ఉంటుంది. ఆన్‌లైన్‌లో బోఽధన జరుగుతున్నందున 50శాతం మంది ఉపాఽధ్యాయులు పాఠశాలకు హాజరైతే సరిపోతుంది. ప్రభుత్వం ఆ దిశగా ఆదేశాలు ఇవ్వాలి. స్వీపర్, స్కావెంజర్ల కోసం పంచాయతీ, మునిసిపాలిటీ సిబ్బంది సహకరించడం లేదు. ఈ సిబ్బందిని విద్యాశాఖ నుంచే ఇచ్చి స్కూల్ గ్రాంట్లు విడుదల చేయాలి.
సామాజిక బాధత్యగా ప్రసారాలు
ఏచూరి భాస్కర్, ఎంఎ్‌సఓల రాష్ట్ర ప్రధాన కార్యదర్మి
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఆన్‌లైన్‌లో పాఠాలు బోధించాలని ప్రభుత్వం నిర్ణయించడం అభినందనీయం. అందులో ఎంఎ్‌సవోలు, కేబుల్ ఆపరేటర్‌లదే కీలక భూమిక. సామాజిక బాధ్యతలో భాగంగా కుగ్రామం వరకు కేబుల్ ప్రసారాలను తీసుకెళుతున్నాం. యాదగిరి, టీశాట్ ఛానళ్ల ప్రసారాల్లో ఎటువంటి అంతరాయం లేకుండా నిరంతరం సాగేందుకు ఏర్పాట్లు చేశాం.