ఆస్తుల నమోదు గడువులోపు కష్టమే!

ABN , First Publish Date - 2020-10-03T10:39:38+05:30 IST

ము నిసిపాలిటీలు, పంచాయతీల్లో వ్యవసాయేతర ఆస్తుల నమో దు ప్రక్రియ సిబ్బందికి సవాల్‌గా మారింది.

ఆస్తుల నమోదు గడువులోపు కష్టమే!

నల్లగొండ, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ము నిసిపాలిటీలు, పంచాయతీల్లో వ్యవసాయేతర ఆస్తుల నమో దు ప్రక్రియ సిబ్బందికి సవాల్‌గా మారింది. ఈ నెల 2వ తేదీ వరకు పంచాయతీలకు, 12వరకు మునిసిపాలిటీలకు గడువుతో విధించడంతో సర్వే సిబ్బంది ఒత్తిడిలో ఉన్నారు. రోజురోజుకూ అదనపు సమాచారం అడుగుతుండటం, గడు వు మాత్రం పెంచకపోవడంతో తప్పులు తప్పవంటూ వారు నిర్వేదం వ్యక్తం చేస్తున్నారు. పాత ఇళ్ల నమోదు పక్కనపెట్టి కొత్త ఇళ్లపై దృష్టిపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడగా,పంచాయతీ ల్లో గడువు శుక్రవారంతో ముగిసింది. ఇంకా 5శాతం పని పెండింగ్‌లోనే ఉంది. ఇక పట్టణాల్లో సర్వే సిబ్బందికి పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. వాటికి సమాధానాలు లేకపోగా,వీటిని తరువాత చూద్దామంటూ పక్కనపెడుతున్నారు.


     సర్వే సిబ్బంది ఇబ్బందులు, సందేహాలివి..

ఎన్‌ఆర్‌ఐ (నాన్‌ రెసిడెంట్‌ ఇండియన్‌) ఇళ్లలో కిరాయిదారులు ఉంటున్నారు. సమాచారం కోసం ఆ ఇళ్లకు పలుమార్లు వెళ్లాల్సి వస్తోంది. ఎన్‌ఆర్‌ఐలకు ఆ దేశాల్లోనే సభ్యత్వం ఉంటుండటంతో ఆఽధార్‌ కార్డు ఉండదు. ఈ తరహా ఆస్తుల నమోదు చేయలేకపోతున్నారు.


ఆస్తి యజమాని మృతి చెంది, వారసుల పేరున మార్పిడి జరగనప్పుడు ఎలా నమోదు చేయాలో సర్వే సిబ్బందికి తెలియడం లేదు. ఈ తరహా కేసుల్లో చాలా మంది దగ్గర ఆస్తికి సంబంధించిన ఒరిజనల్‌ డాక్యుమెంట్లు లేవు. నేటికీ మృతిచెందిన యజమాని పేరుతోనే నల్లా, కరెంటు బిల్లులు చెల్లిస్తున్నారు. 


ఆధార్‌, సెల్‌, బ్యాంక్‌ అకౌంట్‌ వివరాలు ఇస్తే హ్యాకింగ్‌ సమస్య ఎదురైతే ఎవరు బాధ్యులని యజమానులు ప్రశ్నిస్తుండటంతో సిబ్బంది తల పట్టుకుంటున్నారు.


అన్ని వివరాలు ఇస్తే పన్నుల భారం పెరుగుతుందనే అభద్రత ఎక్కువ మందిలో ఉండటంతో చాలా మంది పూర్తి సమాచారం చెప్పడంలేదు.


ఇతర జిల్లాలకు చెందిన వారు ఇక్కడ ఆస్తులు కొనుగో లుచేసి ఉంటే వారి వివరాలు సేకరించడం ఇబ్బందిగా ఉంది.


ఇంటి యజమాని ఫొటో ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాలి. ఎన్‌ఆర్‌ఐ, ఇతర జిల్లాల్లో ఉన్న యజమానుల విషయం లో ఫొటో అప్‌లోడ్‌ ప్రక్రియకు ఆటంకం ఏర్పడుతోంది. పంచాయతీలతో పోలిస్తే మునిసిపాలిటీలోసేకరించాల్సిన సమాచారం ఎక్కువగా ఉంది. ఈనెల12లోపు సర్వే పూర్తి చేయలేమని సిబ్బంది అభిప్రాయపడుతున్నారు.


పల్లెల్లో సాంకేతిక సమస్యలు

పల్లెల్లో సర్వే శుక్రవారంతో పూర్తయింది. అయితే ఇంకా 5 శాతం పెండింగ్‌లో ఉంది. సేకరించిన సమాచారాన్ని కంప్యూటర్‌లో నమోదు చేశాక పంచాయతీరాజ్‌ శాఖ కొత్త యాప్‌ తీసుకొచ్చింది. అందులో అదనంగా పట్టాదార్‌ పాస్‌బుక్‌, జనఽఽధన్‌ ఖాతా, ఉపాధి హామీ జాబ్‌ కార్డు వివరాలు జోడించాల్సి వచ్చింది. దీంతో సిబ్బంది మళ్లీ సర్వేచేసినంత పని. దీంతో వారిపై ఒత్తిడి పెరిగింది. ఇక వివరాల నమోదు ఈ నెల 2 చివరి తేదీ కాగా, సర్వర్‌పై ఒత్తిడి పెరిగి సైట్‌ ఓపెన్‌ కాలేదు. అంతేగాక గ్రామల్లో వివరాలు సేకరించి యాప్‌లో నమోదు చేసే క్రమంలో సిగ్నల్‌ అందుబాటులో ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో సిబ్బంది సమాచారాన్ని రాసుకొని సిగ్నల్‌ ఉన్న ప్రాంతాలకు వెళ్లి నమోదు చేయాల్సి వచ్చింది.


తొందరపడితే తప్పులు తప్పవు..నిరంజన్‌, తెలంగాణ పంచాయతీరాజ్‌ సెక్రటరీల సంఘం జిల్లా అధ్యక్షుడు

తొందరపడి, హడావుడిగా ఆస్తుల నమోదు చేస్తే తరువాత ఇబ్బందులు, తప్పులు తప్పవు. సాంకేతిక ఇబ్బందులు, క్షేత్రస్థాయిలో వచ్చే సమస్యలను పైఅధికారులు పరిగణలోకి తీసుకొని గడువు పెంచాలి. మంత్రి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సైతం గడువు పెంచాలని సర్పంచులు కోరారు. గ్రామకంఠం ఇతర భూములు, పది గుంటల్లో ఇల్లు కట్టుకున్న వారందరికీ లీగల్‌గా పాస్‌బుక్‌ వస్తుంది. వాటిపై రుణాలు పొందడం, ఇతర సౌకర్యాలు అందుతాయన్న భరోసా గ్రామీణ ప్రజల్లో ఉండటంతో వివరాల నమోదులో ఎలాంటి వ్యతిరేకత ఎదురుకాలేదు.

Updated Date - 2020-10-03T10:39:38+05:30 IST