సీఎం పర్యటన సాగిందిలా..

ABN , First Publish Date - 2020-06-23T09:51:44+05:30 IST

సీఎం కేసీఆర్‌ సూర్యాపేటకు రాక సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

సీఎం పర్యటన సాగిందిలా..

సూర్యాపేట (కలెక్టరేట్‌): సీఎం కేసీఆర్‌ సూర్యాపేటకు రాక సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కల్నల్‌ సంతోష్‌బాబు నివాస ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. సీఎం వచ్చి వెళ్లే వరకు కొత్తబస్టాండ్‌ నుంచి శంకర్‌విలాస్‌ సెంటర్‌ వరకు దుకాణాలు బంద్‌ చేయించారు. ఎంజీ రోడ్డుకు ఇరువైపులా వీధుల వద్ద బారీకేడ్లు ఏర్పాటు చేశారు. కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి, ఎస్పీ భాస్కరన్‌ పర్యటనను పర్యవేక్షించారు. ఆస్పత్రులకు వచ్చిన వారు కొంత ఇబ్బందులకు గురయ్యారు.

 

ఎర్రవెల్లి టూ సూర్యాపేట

సీఎం కేసీఆర్‌ పర్యటన సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా మీదుగా సాగింది. ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌ నుంచి మధ్యాహ్నం 1.35 గంటలకు బయలుదేరిన ఆయన తుర్కపల్లి, భువనగిరి, వలిగొండ, రామన్నపేట మీదుగా 3:39 నిమిషాలకు సూర్యాపేటకు చేరుకున్నారు. సంతోష్‌బాబు కుటుంబ సభ్యులను పరామర్శించిన  తర్వాత సాయంత్రం 4:11 గంటలకు అక్కడి నుంచి బయలుదేరారు. సాయంత్రం 5.35 గంటలకు భువనగిరి చేరుకున్నారు. చిట్యాల, రామన్నపేట, వలిగొండ, భువనగిరి, తుర్కపల్లి మీదుగా ఆయన కాన్వాయ్‌ ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌కు వైపుగా వెళ్లింది. రాచకొండ భువనగిరి జోన్‌ డీసీపీ నారాయణరెడ్డి బందోబస్తు పర్యవేక్షించారు. చిట్యాల ప్రాంతంలో బందోబస్తును ఐజీ స్టీఫెన్‌ రవీంద్ర పర్యవేక్షించారు. రోడ్డు మార్గంలో పెద్దఎత్తున ప్రజలు రహదారికి ఇరువైపులా బారులుతీరారు. సీఎం కారులో నుంచే ప్రజలకు అభివాదం చేశారు. 


కష్టాల్లో ఉన్నా.. ఆదుకోండి

సూర్యాపేటలో కల్నల్‌ సంతోష్‌బాబు కుటుంబ సభ్యులను పరామర్శించిన సీఎం కేసీఆర్‌ తిరిగి వెళ్తున్న సమయంలో పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద కేతేపల్లి మండల కేంద్రానికి చెందిన మట్టి రమేష్‌ అనే యువకుడు ప్లకార్డు పట్టుకొని నిల్చున్నాడు. ‘కేసీఆర్‌ గారు.. నేను కష్టాల్లో ఉన్నాను.. ఆదుకోండి’ అని రాసి ఉన్న ప్లకార్డు పట్టుకొని కాన్వాయ్‌ వద్దకు వెళ్లే ప్రయత్నం చేశాడు. పోలీసులు అతనిని అడ్డుకున్నారు. సూర్యాపేటలో ఆటో నడుపుతూ అద్దె ఇంట్లో నివాసముంటున్నానని, కరోనా వైరస్‌ కారణంగా ఉపాధి లేక ఆర్థిక ఇబ్బందులు కలిగాయని పేర్కొన్నాడు. నాలుగు నెలలుగా ఇంటి అద్దెకూడా చెల్లించలేదని ఆదుకోవాలని వేడుకున్నాడు. 

Read more