వర్షంతో అర్వపల్లి అతలాకుతలం

ABN , First Publish Date - 2020-09-14T11:15:05+05:30 IST

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో శనివారం రాత్రి భారీ వర్షం కురిసింది. సూర్యాపేట జిల్లా అర్వపల్లి, తిరుమలగిరి, నాగారం, నల్లగొండ జిల్లా వేములపల్లి, కేతేపల్లి, యాదాద్రి జిల్లాలో భూదాన్‌పోచంపల్లి, అడ్డగూడూ రు తదితర ప్రాంతాల్లో

వర్షంతో అర్వపల్లి అతలాకుతలం

అర్వపల్లి, తిరుమలగిరి/రూరల్‌, నాగారం, కేతేపల్లి, వేములపల్లి, భూదాన్‌పోచంపల్లి, అడ్డగూడూరు, యాదాద్రి రూరల్‌, నడిగూడెం, గుండాల, తిప్పర్తి, సెప్టెంబరు 13: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో శనివారం రాత్రి భారీ వర్షం కురిసింది. సూర్యాపేట జిల్లా అర్వపల్లి, తిరుమలగిరి, నాగారం, నల్లగొండ జిల్లా వేములపల్లి, కేతేపల్లి, యాదాద్రి జిల్లాలో భూదాన్‌పోచంపల్లి, అడ్డగూడూ రు తదితర ప్రాంతాల్లో అధిక వర్షపాతం నమోదైంది. కుండపోత వర్షంతో అర్వపల్లి అతలాకుతలమైంది. ఆదివారం రాత్రి ఒంటిగంట నుంచి ఉదయం 4 గంటల వరకు భారీ వర్షం కురవగా, మండల కేంద్రంలో 200 ఇళ్లలోకి వరద చేరింది. ఓ సిమెంట్‌ గోడౌన్‌లోని 400బస్తాల సిమెంట్‌ తడిసిముద్దయి రూ.3లక్షల నష్టం వాటిల్లింది. మరో ఎరువుల దుకాణంలో నడుములోతు నీరు చేరి బస్తాలు తడిచాయి. ఓ సెలూన్‌ దుకాణం వరదలో కొట్టుకుపోయింది. కస్తూర్బా పాఠశాల, పశువైద్యశాల, పోస్టాఫీస్‌, యోగానందలక్ష్మీనర్సింహ్మస్వామి ఆలయ ఆవరణలో వరద భారీగా నిలిచింది. కొమ్మాల, తిమ్మాపురం, కోడూరు, కాసర్లపాడు, అర్వపల్లి, జాజిరెడ్డిగూడెం తీగల చెరువులు అలుగుపోయడంతో వెయ్యి ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. తిరుమలగిరి మండలంలో 3గంటలకుపైగా జోరు వాన కురిసింది. అనంతారం గ్రామం వద్ద బిక్కేరు వాగు బ్రిడ్జిని తాకుతూ ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎంగపాలెం వాగు ఉప్పొంగడంతో తిరుమలగిరి, నందాపురం, తాటిపాముల మధ్య రాకపోకలు నిలిచాయి. స్థానిక పీహెచ్‌సీ, పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో వరద చేరింది. గుండెపురి, జలాల్‌పురం, మామిడాల, వెలిశాల బండ్లపెల్లి చెర్వులు, ఎస్సారెస్పీ కాల్వలు పొంగి ప్రవహిస్తున్నాయి. 


నాగారం మండల కేంద్రంతోపాటు, పలు గ్రామాల్లో భారీ వర్షం నమోదైంది. నాగారం, ఈటూరు, పసునూరు, కొత్తపల్లి చెరువులు అలుగుపోస్తున్నాయి. తుం గతుర్తి మండలంలో కేశవపురం-అన్నారం బంధంవాగు దాటుతుండగా, వరద ఉధృతికి ఓ వృద్ధుడు గల్లంతయ్యాడు. నడిగూడెం మండలంలో 44.2మి.మీ వర్షపాతం నమోదైంది. చాకిరాల కాల్వర్టుపై నుంచి నీరు ప్రవహిస్తుండగా, రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. రామాపురం, చాకిరాల, రత్నవరంలో వరి పం టలు నీటమునిగాయి. రామాపురంలో ఓ ఇల్లు కూలింది. కేతేపల్లి మండలంలోని పలు గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. వేములపల్లి మండలంలో 55.6మి.మీ వర్షపాతం నమోదైంది. ఆమనగల్లు ఊరచెరువుకు నల్లవాగు నుంచి భారీగా వరద వచ్చి మత్తడి పొంగింది. దీంతో లక్ష్మీదేవిగూడెం బంధానికి వరద పోటెత్తి భీమారం-సూర్యాపేట రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మూసీ ప్రాజెక్ట్‌కు నుంచి నీరు విడుదల చేయడంతో రావులపెంట శివారులోని ఇసుక రీచ్‌ వద్ద వరద ప్రవాహానికి ట్రాక్ట ర్‌ కొట్టుకుపోయింది. పాలేరువాగు, శెట్టిపాలెం సమీపంలోని చిత్రపరకవాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. మాడ్గులపల్లి మం డలంలోని కుక్కడం, తోపుచర్ల చెరువులు అలుగు పోస్తున్నాయి. కల్వలపాలెం సమీపంలో పాలేరువాగుకు ఉధృతికి రోడ్డు ధ్వంసమై రాకపోకలు నిలిచాయి. తిప్పర్తి మండలంలో భారీ వర్షానికి చెరువులు అలుగుపోస్తున్నాయి. పజ్జూరు చెరువు ప్రవాహానికి చేపలు ఎదురెక్కుతుండటంతో గ్రామస్థులంతా భారీగా తరలివచ్చి వాటిని పట్టారు.


రెండురోజులుగా రాత్రిపూట కురిసిన భారీ వర్షాలకు భూదాన్‌పోచంపల్లి మూసీ ఆయకట్టు జలదిగ్బంధంగా మారింది. మూసీ ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పిలాయిపల్లి కాల్వ ఆయకట్టులోని మైసమ్మకత్వా వద్ధ వరద ఉధృతికి పోచంపల్లి-కొత్తగూడెం రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. ఎక్స్‌కేవేటర్‌ సాయంతో నీటిని తోడేయడంతో పాక్షికంగా రాకపోకలు సాగాయి. పిలాయిపల్లి ఆయకట్టు కాల్వకు జీరో పాయింట్‌ నుంచి 6 కిలోమీటర్ల దూరంలో గండి పడి పంటలకు నష్టం వాటిల్లింది. భూదాన్‌పోచంపల్లి, రేవణపల్లి చెరువులు అలుగుపోస్తున్నాయి. పిలాయిపల్లి, పెద్దరావులపల్లి లోలెవల్‌ బ్రిడ్జిల వద్ద మూసీ ఉధృతంగా ప్రవహిస్తోంది. మైసమ్మకత్వ వద్ద గుర్రపుడెక్క ఆకుతో మూసీ వరద రోడ్డుపైకి చేరుతోంది. పరిస్థితిని తెలుసుకున్న ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అధికారులతో సమీక్షించారు. ఇక్కడ శాశ్వత బ్రిడ్జి నిర్మాణానికి నివేదిక రూపొందించాలని ఆదేశించారు. చౌటుప్పల్‌ ఆర్డీవో సూరజ్‌కుమార్‌, అధికారులు, ప్రజాప్రతినిధులు అక్కడికి చేరుకొని పరిస్థితిని చక్కదిద్దారు. పర్రె కాల్వకు వరద ఉధృతి పెరిగింది. మెహర్‌నగర్‌ గ్రామంలో ఇళ్లలోకి వరద చేరింది. మండలంలో 40హెక్టార్లలో వరి పంటకు నష్టం వాటిల్లినట్టు అధికారులు అంచనా వేశారు. అడ్డగూడూరు మండలకేంద్రంతోపాటు పలు గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. ధర్మారం, కోటమర్తి గ్రామాల చెరువులు అలుగుపోస్తున్నాయి. బిక్కేరు, మూసీ ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. గుండాల మండలంలోని తుర్కలషాపురంలో రెండు పెంకుటిళ్లు కూలిపోయాయి. యాదగిరిగుట్ట మండలంలోని సైదాపురం చెరువు నిండి అలుగు పోయగా, మహిళలు చెరువు వద్ద పూజలు చేశారు.

Updated Date - 2020-09-14T11:15:05+05:30 IST