ఇసుక తరలింపుపై వాగ్వాదం

ABN , First Publish Date - 2020-03-18T11:48:08+05:30 IST

బిక్కేరు వాగునుంచి ఇసుక తీయొద్దంటూ కొంతమంది, ట్రాక్టర్లు నడపొద్దు, ఎడ్లబండ్లతోనే తీయాలని అనంతారం

ఇసుక తరలింపుపై వాగ్వాదం

తిరుమలగిరి, మార్చి17: బిక్కేరు వాగునుంచి ఇసుక తీయొద్దంటూ కొంతమంది, ట్రాక్టర్లు నడపొద్దు, ఎడ్లబండ్లతోనే తీయాలని అనంతారం  గ్రామస్థులు  మంగళవారం అధికారులతో వాగ్వాదానికి దిగారు. మండలంలో పల్లెప్రగతి పనులకు అనంతారం బిక్కేరు వాగు నుంచి ఇసుకు తరలించడానికి రెవెన్యూ అధికారులు అనుమతి  ఇచ్చారు. ఇసుక తీసుకెళ్లడానికి ట్రాక్టర్లు బిక్కేరువాగు వద్దకు చేరుకోగానే గ్రామస్థులు అడ్డగించారు.


వాగు నుంచి ఇసుక తీయనీయమని వాగు వద్ద భైఠాయించారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్‌ హరిశ్చంద్ర ప్రసాద్‌, ఎస్‌ఐ డానియోల్‌కుమార్‌ సిబ్బందితో  అక్కడికి చేరుకున్నారు. గ్రామస్థులకు నచ్చజెప్పేందుకు యత్నించారు. ఇసుకను ట్రాక్టర్లతో కాకుండా ఎడ్లబండ్లతోనే తరలించాలని, లేకుంటే ఇసుక తీయనీయమని అధికారులతో వాగ్వాదానికి దిగారు. ప్రభుత్వ పనుల కోసం ఇసుక వాడుతున్నారని అధికారులు చెప్పారు. ఆటంకం కలిగించొద్దని గ్రామస్తులకు నచ్చజెప్పేప్రయత్నం చేశారు. సుమారు రెండు గంటల పాటు వాగు వద్ద ఆందోళన కొనసాగింది.  అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో స్వల్పఉద్రిక్తత చోటుచేసుకుంది. 


విధులకు ఆటంకం కలిగించిన వారిపై కేసు 

విధులకు ఆటంకం కలిగించిన  వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. ప్రభుత్వ పనులకోసం బిక్కేరు వాగునుంచి ఇసుకకు అనుమతిస్తే అనంతారం గ్రామానికి చెందిన కొంతమంది వాగువద్ద ట్రాక్టర్లను అడ్డుకున్నారని తెలిపారు. అధికారులు వెళ్లి నచ్చజెప్పినా అడ్డుకోడం సరికాదని చెప్పారు. తహసీల్దార్‌ ఫిర్యాదు మేరకు గ్రామానికి చెందిన 12మందిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.


Updated Date - 2020-03-18T11:48:08+05:30 IST