నేను రాను బిడ్డో సర్కారు దవాఖానాకు

ABN , First Publish Date - 2020-12-19T05:43:34+05:30 IST

అందుబాటులో లేని వైద్యులు, పనిచేయని వైద్య పరికరాలు. ఫలితంగా చికిత్సకోసం వచ్చే రోగులకు నానా తంటాలు.

నేను రాను బిడ్డో సర్కారు దవాఖానాకు
సమస్యలకు నెలవుగా మారిన ప్రభుత్వ ఆసుపత్రి

అందుబాటులో లేని డాక్టర్లు, పనిచేయని పరికరాలు 

సుస్థి చేసిందని వస్తే పస్తులుండాల్సిందే 

అన్నం పెట్టరు, నీరు దొరకదు, అడిగితే దుర్భాషలాడుతారు 

ఇదీ నకిరేకల్‌ ప్రభుత్వ ఆసుపత్రి దుస్థితి

నకిరేకల్‌, డిసెంబరు 18: అందుబాటులో లేని వైద్యులు, పనిచేయని వైద్య పరికరాలు. ఫలితంగా చికిత్సకోసం వచ్చే రోగులకు నానా తంటాలు. ఎక్కడ చూసినా అపరిశుభ్రత, దుర్వాసనతో కంపుకొడుతున్న ఆసుపత్రి పరిసరాలు. వెరసి రోగం వచ్చిందని ఆస్పత్రికి వస్తే కొత్త రోగం అంటుకునే పరిస్థితి ఏర్పడిందని నియోజకవర్గ ప్రజలు అంటున్నారు. నకిరేకల్‌లో 40 ఏళ్ల క్రితం 30 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. నకిరేకల్‌తోపాటు చుట్టు పక్కల మండలాలు శాలిగౌరారం, కేతేపల్లి, కట్టంగూరు నుంచి రోగులు నిత్యం ఇక్కడికి వస్తున్నప్పటికీ మెరుగైన వైద్యం లేక ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు. కనీసం తాగునీటి సదుపాయం కూడా లేకపోవడంతో బయటినుంచి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 


ఆసుపత్రిలో పరికరాల కొరత 

ఆసుపత్రిలో ఆధునిక పరికరాలు లేకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఎక్స్‌రే, ఈసీజీ, గ్లూకోమీటర్‌, అంబులెన్స్‌ సౌకర్యంలేదు. గతంలో ఎంపీగా ఉన్న బూర నర్సయ్యగౌడ్‌ నిధులతో ఏర్పాటు చేసిన అంబులెన్స్‌ కనుమరుగై పోయింది. జాతీయ రహదారి వెంట ఉన్న ఆసుపత్రిల్లో రక్త నిల్వలు లేకపోవడంతో రోడ్డుపై ప్రమాదానికి గురైన రోగులు సకాలంలో ఆసుపత్రికి వచ్చినా రక్తం అందక ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కొకొల్లలు. 40 ఏళ్ల క్రితం 30 పడకల ఆసుపత్రిగా ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు పరిస్థితిలో మార్పు రాలేదంటున్నారు ఇక్కడి ప్రజలు. 


వైద్యం అందక ఇతర ప్రాంతాలకు 

నకిరేకల్‌ పక్క మండలాలైన శాలిగౌరారం, కేతేపల్లి, కట్టంగూరు నుంచి నిత్యం రోగులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. మెరుగైన వైద్యం లేక ఇతర ప్రాంతాలకు వెళుతున్నారు. ఆరోగ్యశ్రీకి సంబంఽధించి అన్ని రకాల వైద్యసేవలు అందడంలేదు. కేవలం ఒక్క ఎముకలకు సంబంధించిన వైద్యం మాత్రమే చేస్తున్నారు. అప్పుడే పుట్టిన పిల్లలకు చేయాల్సిన ఫొటోఽథెరపి యూనిట్లు దుమ్ముపట్టడంతో ప్రైవేట్‌ ఆసుపత్రులకు వెళ్లాల్సి వస్తోంది. నార్మల్‌ డెలివరీ కోసం వచ్చే వారిని మాత్రమే జాయిన్‌ చేసుకుంటున్నారు తప్ప, పెద్ద ఆపరేషన్‌ అవసరమున్న వారిని తిరిగి పంపేస్తున్నారు. దీంతో దిక్కుతోచక ప్రైవేట్‌ ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వస్తోంది. పాము, కుక్క కాటుతోపాటు, కాలిన గాయాలైన వారికి చికిత్స అందించడం లేదు. 


డ్యూటీ డుమ్మా.. జీతం పక్కా 

డ్యూటీకి రాకున్నా వైద్యులకు జీతం మాత్రం పక్కాగా అందుతుంది. దంత వైద్యుడు మయూరి మోహన్‌ ఎనిమిది నెలలుగా విధులకు హాజరుకాకున్నా నెలకు రూ.90వేలు మాత్రం తీసుకుంటూనే ఉన్నారు. రెండేళ్లుగా కంటి వైద్యుడి పోస్ట్‌ ఖాళీగానే ఉంది.  డాక్టర్లు విధులకు సక్రమంగా హాజరుకాకున్నా జీతాలు తీసుకుంటూ రోగులకు వైద్యం అందడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. నకిరేకల్‌ ఆసుపత్రిలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న శ్రీనాథ్‌నాయుడు, ఆర్థోపిడీషియన్‌ డాక్టర్‌ రమణారెడ్డి స్థానికంగా ప్రైవేట్‌ ఆసుపత్రిని ఏర్పాటు చేసుకుని ప్రభుత్వ ఆసుపత్రికి వస్తున్న రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.  


రోగులకు మిగిలింది పస్తులే

నకిరేకల్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన రోగులు నిత్యం పస్తులుంటున్నారు. ఆపరేషన్‌ అయిన బాలింతలు, వివిధ రోగాలతో చేరిన రోగులకు భోజనం సరఫరా చేయడంలేదు. వారం రోజుల్లో ఏదో ఒక పూట చాలీచాలని అన్నం, ఉడికీ ఉడకని కూరలు పెడుతూ మమా అనిపిస్తున్నారు. ఉదయం పూట పెట్టే అల్పాహారం కోసం వంటగది వద్దకు పరుగులు పెట్టాల్సిన దుస్థితి. కొద్దో గొప్పో అల్పాహారం పెడుతూ పెట్టింది తినాలని వంట నిర్వాహకురాలు బాలింతలపై మండిపడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.  నకిరేకల్‌ ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ మెంబర్‌గా ఉన్న ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య దృష్టి పెట్టాలని నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు. 


నాలుగు రోజులకు ఒక్కపూటే : గాదరి వసంత, కొర్లపహాడ్‌ 

నా కుమార్తె ప్రసవం కోసం నాలుగు రోజుల క్రితం వచ్చాం. ఆసుపత్రిలో చేరిన నాటి నుంచి ఒక్క పూట మాత్రమే అన్నం పెట్టారు. అదికూడా చాలీచాలని అన్నం, కూరతో వడ్డించారు. ఆసుపత్రిలో పట్టించుకునే వారే లేరు. నాలుగు రోజులుగా ఉదయం పూట అల్పాహారం ఇచ్చి మధ్యాహ్నం, రాత్రి పూట అన్నం పెట్టకపోవడంతో బయటి నుంచి తెచ్చుకుంటున్నాము. 

Updated Date - 2020-12-19T05:43:34+05:30 IST