సమస్యల పరిష్కారానికి ఉపాధ్యాయుల పోరుబాట
ABN , First Publish Date - 2020-12-17T06:01:16+05:30 IST
సమస్యలపై ఎన్ని వినతులు, విజ్ఞప్తులు చేసినా ఏడేళ్లుగా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడం, జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రక్రియకు దూరం పెడుతూ చిన్నచూపు చూస్తున్న సర్కారుపై సమరశంఖం పూరించాలని 35 ఉపాధ్యాయ సంఘాలు నిర్ణయించాయి.

నేడు సామూహిక నిరాహార దీక్షలు
29న హైదరాబాద్‌లో మహా ధర్నా
31 తరువాత ఉద్యోగులతో పీఆర్‌సీ పోరు
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, నల్లగొండ)
సమస్యలపై ఎన్ని వినతులు, విజ్ఞప్తులు చేసినా ఏడేళ్లుగా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడం, జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రక్రియకు దూరం పెడుతూ చిన్నచూపు చూస్తున్న సర్కారుపై సమరశంఖం పూరించాలని 35 ఉపాధ్యాయ సంఘాలు నిర్ణయించాయి. ఏ రాష్ట్రంలో లేనంత ఎక్కువ వేతనాలు ఉపాధ్యాయులకు ఉండేలా చేస్తామని, మూడు రోజుల్లో రెండు కమ్మల్లో సర్వీసు నిబంధనలు రూపొందించి పదోన్నతులు కల్పిస్తామని సీఎం ఇచ్చిన హామీల అమలుకు ఉపాధ్యాయులు దశల వారీ పోరాటానికి పూనుకున్నారు. భోజన విరామంలో నల్లబ్యాడ్జీలతో ఇప్పటికే నిరసన తెలపగా, రెండో దశ ఈ నెల 17న ఉమ్మడి జిల్లాలోని కలెక్టరేట్ల ఎదుట నిరాహార దీక్షలు చేపట్టనున్నారు. ఇక మూడో దశ ఉద్యమంలో భాగంగా హైదరాబాద్‌లో ఈనెల 29న మహాధర్నా, ఈ నెల 31వ తేదీ వరకు పీఆర్‌సీపై ఎలాంటి ప్రకటన రాకపోతే ప్రభుత్వ ఉద్యోగులతో కలిసి ఆందోళనను ఉధృతం చేయనున్నారు.
విద్యారంగంలో ఏళ్లుగా సమస్యలు పేరుకోగా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వ, మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు ఏడేళ్లుగా నిలిచిన పదోన్నతులను వెంటనే చేపట్టాలని, సాధారణ, అంతర్ రాష్ట్ర, జిల్లాల బదిలీ ప్రక్రియ ప్రారంభించాలని, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలనే నాలుగు ప్రధాన డిమాండ్లతో ఉపాధ్యాయ సంఘాలు దశల వారీ ఆందోళనలు ప్రారంభించాయి. 2018 జూన్ 2 నుంచి ఐఆర్ ఇస్తానని,మూడు నెలల్లో పీఆర్‌సీ నివేదిక తెప్పించుకొని అమలు చేస్తామని, కాంట్రాక్టు పేరుతో ఉన్న వెట్టి చాకిరీని రద్దు చేసి అందరినీ రెగ్యులర్ చేస్తామని సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను సైతం నెరవేర్చాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు. ఒకే పనికి వేర్వేరు కేడర్లు, వేతనాలున్న పండిట్, పీఈటీలను ఉన్నతీకరిస్తామని ప్రకటించిన సీఎం అందుకు భిన్నంగా ప్రభుత్వ విద్యా వ్యవస్థపై సమాజంలో వ్యతిరేకత పెంచేలా ప్రకటనలు గుప్పించడంపై ఉపాధ్యాయులు ఆగ్రహంగా ఉన్నారు. గురుకులాల ఉపాధ్యాయులకు కనీసం ఆరోగ్యశ్రీ, హెల్త్‌కార్డులు, మెడికల్ రీయింబర్స్‌మెంట్ సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యలు పరిష్కరించేంతవరకు ప్రభుత్వంపై పోరు చేసేందుకు ఉపాధ్యాయ సంఘాలు నిర్ణయించాయి.
ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోని సమస్యలు
విద్యారంగంలో సమస్యలు అపరిష్కృతంగా ఉండటంతో ప్రభుత్వ, మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాల విభజన జరిగినా బదిలీలు లేక సొంత జిల్లాల్లో పనిచేసే పరిస్థితి లేకుండాపోయింది. ఏడేళ్లుగా పదోన్నతులు లేకపోవడంతో అర్హత ఉన్నా ఎటువంటి ప్రయోజనాలు పొందకుండానే ఉద్యోగవిరమణ పొందుతున్నారు. ఈ సమస్యల పరిష్కారానికి ఈనెల 9, 10 తేదీల్లో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో భోజన విరామంలో నల్ల బ్యాడ్జీలు, జెండాలతో నిరసన నిర్వహించారు. కాగా, గురువారం ఉమ్మడి జిల్లాలోని కలెక్టరేట్ల ఎదుట ఉదయం 10 నుంచి 4గంటల వరకు సామూహిక నిరాహార దీక్ష చేపట్టనున్నారు. ఈ దీక్షల్లో ఉమ్మడి జిల్లాలో వెయ్యిమందికి పైగా ఉపాధ్యాయులు కూర్చోనున్నారు. ఇక ఈనెల 29న హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్, ధర్నాచౌక్‌లో వేలాది మందితో మహాధర్నా నిర్వహించనున్నారు. ఈ ధర్నాలో ఉమ్మడి జిల్లా నుంచి ఆరువేల మంది పాల్గొనేలా ఆయా సంఘాల మండల ప్రతినిధులకు బాధ్యతలు అప్పగించారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వాల్‌పోస్టర్ల ఆవిష్కరణ
సమస్యల పరిష్కారం కోసం ఉపాధ్యాయులు గురువారం నిర్వహించనున్న నిరాహార దీక్షలు, 29న హైదరాబాద్‌లో చేపట్టనున్న మహాధర్నాను విజయవంతం చేయాలని కోరుతూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా యూఎ్‌సపీసీ, జాక్టో నాయకులు బుధవారం వాల్‌పోస్టర్లను విడుదల చేశారు. నల్లగొండ, యాదాద్రి, సూర్యాపేట జిల్లాల్లోని మండలాల వారీగా ఉపాధ్యాయులతో సమావేశాలు నిర్వహిస్తూ అందరినీ సంఘటితం చేస్తున్నారు. హక్కుల సాధనకు ప్రభుత్వంపై ఎందుకు ఉద్యమం చేయాల్సి వస్తోందో నాయకులు ఉపాధ్యాయులకు అవగాహన కల్పించారు.
ఆందోళనలో 35 సంఘాలు : పెరుమాళ్ల వెంకటేశం, యూటీఎఫ్ నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి
పీఆర్‌టీయూ మినహా యూఎ్‌సపీసీ (ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి) జాక్టో (ఉపాధ్యాయ సంఘాల పోరాట సమితి) ఆధ్వర్యంలోని 35 సంఘాలు దశల వారీ పోరాటంలో భాగం పంచుకుంటున్నాయి. అందులో భాగంగా గురువారం ఉమ్మడి జిల్లాలోని కలెక్టరేట్ల ఎదుట సామూహిక నిరాహార దీక్షలు చేపడుతున్నాం. ప్రభుత్వం నుంచి కార్యాచరణ ప్రారంభం కాకపోతే ఈ నెల 29న చలో హైదరాబాద్ పిలుపు కొనసాగుతుంది. మావి న్యాయమైన డిమాండ్లు అని స్వయంగా సీఎం కేసీఆర్ ప్రకటించి, లిఖిత పూర్వక హామీ ఇచ్చారు. వాటి అమలుకు పోరాడి సాధించుకున్న తెలంగాణలో ధర్నాలు చేపట్టాల్సి రావడం బాధాకరం.