ఉపాధి పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు : కలెక్టర్
ABN , First Publish Date - 2020-12-16T05:06:59+05:30 IST
ఉపాధిహామీ పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి అన్నారు.
కోదాడ రూరల్, డిసెంబరు 15 : ఉపాధిహామీ పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో అనంతగిరి, కోదాడ మండలాలకు చెందిన గ్రామకార్యదర్శులు, ఉపాధిహామీ సిబ్బంది, పంచాయతీరాజ్ ఏఈలతో మంగళవారం ఉపాధి పనులపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. మండలంలో ఉపాధిహామీ ద్వారా కూలీలకు కల్పించిన పనిదినాలు, బిల్లుల చెల్లింపులు, పల్లె ప్రకృతి వనం, నర్సరీల ఏర్పాటు, డంపింగ్ యార్డు, శ్మశానవాటికల నిర్మాణాల పురోగతిపై సమీక్ష చేశారు. అనేక గ్రామాల్లో కూలీలకు బిల్లుల చెల్లింపులో ఆలస్యంకావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతగిరి మండలం మొగలాయికోటలో రూ.5 లక్షల బిల్లుల చెల్లింపులో అలసత్వం వహిస్తున్న అధికారులను తీవ్రంగా మందలించారు. ఒక్క గ్రామంలో రూ.5 లక్షలు నిలిచిపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. మండలానికి రూ.50 లక్షల చొప్పున జిల్లాలో రూ.10 కోట్ల బిల్లుల బకాయిలు పేరుకుపోయాయని అన్నారు. అయినా సిబ్బందికి చలనం లేదని లేదన్నారు. సిబ్బందిని పర్యవేక్షించాల్సిన ఎంపీవో, ఎంపీడీవోలు కూడా పట్టించుకోవడం లేదని వారిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామాల్లో పల్లె ప్రకృతి వనం, నర్సరీల ఏర్పాటుకు ప్రభుత్వ స్థలాలు లేకుంటే ప్రైవేట్ స్థలాలను తీసుకోవాలని సూచించారు. పలుగ్రామాల కార్యదర్శులు మాట్లాడుతూ హరితహారం కింద నాటిక మొక్కలకు నీళ్లు పోయాల్సిన కూలీలకు డబ్బుల చెల్లింపు జరగలేదని, దీంతో వారు తీవ్రఇబ్బందిపడుతున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో పంచాయతీరాజ్ ఏఈలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలో ప్రత్యేకంగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తానన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ పద్మజారాణి, జడ్పీ సీఈవో విజయలక్ష్మి, డీఆర్‌డీఏ పీడీ కిరణ్‌కుమార్, ఏపీడీ పెంటయ్య, అడిషనల్‌పీడీ సురేష్, ఎంపీడీవో విజయశ్రీ, డీఎల్‌పీవో శ్రీరాములు, అధికారులు పాల్గొన్నారు.