కడుపు కాలుతున్నా అర్హులం కాదా?

ABN , First Publish Date - 2020-05-24T09:57:46+05:30 IST

యాదాద్రి జిల్లాలో 2,14,014 రేషన్‌కార్డులు ఉన్నాయి. మొత్తం 6,60, 697 యూనిట్లకు నెలకు 4,264 మెట్రిక్‌ టన్నుల బియ్యం సరఫరా చేయాల్సి ఉంది.

కడుపు కాలుతున్నా అర్హులం కాదా?

 ఉమ్మడి జిల్లాలో పేరుకుపోయిన ఎఫ్‌ఎ్‌ససీ దరఖాస్తులు

పట్టించుకోని అధికారులు  ఆపదకాలంలో సాయమందక పేదల ఇక్కట్లు


కరోనా వైరస్‌ నేపథ్యంలో లాక్‌డౌన్‌తో చిన్న, పెద్ద పరిశ్రమలు, సమస్త వ్యా పారాలు, పనులు బంద్‌ కావడంతో ప్రతిఒక్కరికీ ఉపాధి కరువైంది. అందులో పేదల పరిస్థితి చెప్పనలవి. రెక్కాడితేగానీ పూట గడవని పేదలు లాక్‌డౌన్‌ కాలంలో ఆకలితో అలమటించాల్సి వచ్చింది. ప్రభుత్వం పేదలను ఆదుకునేందు కు రేషన్‌కార్డుదారులకు ఒక్కొక్కరికీ ఉచితంగా 12కిలోల బియ్యం, రూ. 1500 అందించింది. అయితే ప్రభుత్వం కొన్నేళ్లుగా రేషన్‌ కార్డులు మంజూరు చేయకపోవడంతో అర్హులు ఈ సాయాన్ని అందుకోలేకపోయారు. ఆపదకాలంలో ఈ చిరు సాయం సైతం అందక ఆకలితో అలమటించాల్సి వచ్చింది.


యాదాద్రి, (ఆంధ్రజ్యోతి)/సూర్యాపేట(కలెక్టరేట్‌), నల్లగొండ, నార్కట్‌పల్లి, మిర్యాలగూడ, నాగార్జునసాగర్‌, దేవరకొండ, పీఏపల్లి, కోదాడ, చౌటుప్పల్‌, హుజూర్‌నగర్‌, మోత్కూరు : 


యాదాద్రి జిల్లాలో

యాదాద్రి జిల్లాలో 2,14,014 రేషన్‌కార్డులు ఉన్నాయి. మొత్తం 6,60, 697 యూనిట్లకు నెలకు 4,264 మెట్రిక్‌ టన్నుల బియ్యం సరఫరా చేయాల్సి ఉంది. ఇవిగాక కొత్తగా రేషన్‌ కార్డుల కోసం చాలా మంది దరఖాస్తు చేసుకున్నారు. అవన్నీ వివిధ స్థాయిల్లో ఏడాదిన్నరగా పరిశీలనలోనే కొట్టుమిట్టాడుతున్నాయి. దీంతో రేషన్‌కార్డు వస్తే రూ.1కి కిలో బియ్యం, పంచదార వంటి నిత్యావసర సరుకులు అందుతాయని ఆశపడిన వారికి ఎదురుచూపులు తప్పట్లేదు. జిల్లాలో 5,393 ఎఫ్‌ఎ్‌ససీ కార్డులు పెండింగ్‌లో ఉన్నట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. కొత్త దరఖాస్తులు 2,600 పెండింగ్‌లో ఉండగా పరస్పర బదిలీలు, కుటుంబ సభ్యులు చేర్పులు, మార్పులు 3,793 ఉన్నట్టుగా అధికార వర్గాలు తెలిపాయి.


క్షేత్రస్థాయిలో తహసీల్దార్‌ కార్యాలయాల్లో వందల కొద్దీ దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్టుగా సమాచారం. ప్రభుత్వం రేషన్‌కార్డు లేని కుటుంబానికి 5కిలోల బియ్యం సరఫరా చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రకారం జిల్లాలో 8,500 కుటుంబాలకు 5కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేశారు. ఈ ప్రాతిపదికన పరిశీలిస్తే జిల్లాలో 10వేలకు పైగా కుటుంబాలు ఆహార భద్రతా కార్డులకు అర్హులుగా ఉన్నట్టు అంచనా. లాక్‌డౌన్‌ కాలంలో వీరికి ప్రభుత్వపరంగా ఎలాంటి సాయం అందలేదు. దీంతో ఆహార దినుసులు దాతలెవరైనా ఇస్తారా అని వారు ఎదురుచూడక తప్పలేదు.


నల్లగొండ జిల్లాలో

నల్లగొండ జిల్లాలో 4,57,399 రేషన్‌కార్డులు ఉండగా, 13,97,624 యూనిట్లకు ప్రతినెలా 1,62,470 క్వింటాళ్ల బియ్యం పంపిణీ చేస్తున్నారు. కాగా, జిల్లావ్యాప్తంగా కొత్త రేషన్‌కార్డుల కోసం 6755 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. కార్డులు లేని వారు మీసేవల ద్వారా దరఖాస్తు చేసుకున్నా పరిశీలన, ఆమోదం, కొత్త కార్డు ఇచ్చే వారు కరువయ్యారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకపోవడంతో అధికారు ల కొత్త కార్డులు జారీ చేయడం లేదు. 2019,జూన్‌ నెలలో కొత్త కార్డులు మంజూ రు చేయాలని నిర్ణయించినా అది అమలుకు నోచుకోలేదు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఆహార భద్రత కార్డులు లేనివారు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కార్డులు ఉన్నవారికి ప్రభుత్వం రెం డు నెలలుగా ఒక్కొక్కరికి 12కిలోల బియ్యాన్ని ఉచితంగా ఇవ్వడమే గాక రూ.1500 నగదు సైతం అందించింది. కార్డులులేని వారిని పటించుకునే వారు కరువయ్యారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు. 


సూర్యాపేట జిల్లాలో

సూర్యాపేట జిల్లాలో ఆహార భద్రత, అంత్యోదయ, అన్నపూర్ణ కార్డులు మొత్తం 3,16,879 ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా 9,30,313 యూనిట్లకు ప్రతి నెలా 610 రేషన్‌ దుకాణాల ద్వారా సరుకులు పంపిణీ చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం ఏప్రిల్‌, మే నెలలకు సంబంధించి రేషన్‌ కార్డు ఉన్న కుటుంబానికి సభ్యుల ప్రకారం ఒక్కొక్కరికి 12కిలోల చొప్పున ఉచితంగా బియ్యం పంపిణీ చేయడంతో పాటు, రూ.1500 సాయాన్ని అందించింది.


జిల్లావ్యాప్తంగా కొత్త రేషన్‌ కార్డుల కోసం 34,150 మంది దరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక నూతన రేషన్‌ కార్డులు మంజూరు చేయలేదు. దరఖాస్తులను రెవెన్యూ అధికారులు పరిశీలించినా, ఏళ్లు గడుస్తున్నా లబ్ధిదారులకు కొత్త రేషన్‌ కార్డులు అందలేదు. దీంతో ప్రభుత్వం అందించే పథకాలు, ఆపద సమయంలో అందించే సాయానికి వారు అర్హులు కాలేకపోతున్నారు. ఫలితంగా ఎంతోమంది పేదలు ఇబ్బందులు పడుతున్నారు.


Updated Date - 2020-05-24T09:57:46+05:30 IST