మెదక్‌ జిల్లాలో జీరో కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-12-21T05:10:04+05:30 IST

జిల్లాలో తొమ్మిది నెలల సుదీర్ఘ కాలం తర్వాత ఆదివారం కరోనా కేసుల సంఖ్య జీరోగా నమోదైంది.

మెదక్‌ జిల్లాలో జీరో కరోనా కేసులు

 తొమ్మిది నెలల తర్వాత తొలిసారి..

 అయినా అప్రమత్తంగానే ఉండాలన్న వైద్యులు


మెదక్‌ అర్బన్‌, డిసెంబరు 20: జిల్లాలో తొమ్మిది నెలల సుదీర్ఘ కాలం తర్వాత ఆదివారం కరోనా కేసుల సంఖ్య జీరోగా నమోదైంది. కేసుల సంఖ్య నిల్‌ అని సంబుర పడాల్సిన అవసరం లేదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. జిల్లాలో మార్చి 29న ఓ వ్యక్తికి కరోనా ఉన్నట్లు మొదటిసారిగా నిర్ధారణ అయింది. ఇప్పటి వరకు 4,452 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 38 మంది చనిపోయారు. ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో వందకుపైగా కేసులు నమోదయ్యాయి. టెస్టుల సంఖ్యను పెంచడంతో అక్టోబరు నుంచి కొంత మేరకు కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతూ వస్తున్నది. జిల్లాలో ఆదివారం 261 మందికి కరోనా ర్యాపిడ్‌ పరీక్షలు చేయగా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.


తగ్గుముఖం పట్టిన వ్యాప్తి


జిల్లాలో కరోనా ర్యాపిడ్‌ పరీక్షలు విస్తృతంగా మొదలు పెట్టిన తర్వాత వైరస్‌ కమ్యూనిటీ వ్యాప్తి చాలా వరకు తగ్గిందని చెప్పుకోవచ్చు. పీహెచ్‌పీల వారీగా ప్రతీ రోజు అపరిమితంగా ర్యాపిడ్‌ టెస్టులు చేశారు. దీంతో పాజిటివ్‌గా నిర్ధారణ జరిగిన వ్యక్తులు 17 రోజుల పాటు హోం క్వారంటైన్‌తోపాటు ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందారు. ముఖానికి మాస్కు, భౌతికదూరం, చేతులను శుభ్రం చేసుకోవడం వంటి జాగ్రత్తలను ప్రజలు పాటించడంతో నేడు జిల్లాలో జీరో కేసులుగా మారేందుకు అవకాశం ఏర్పడింది.


జీరో కదా అనుకుంటే..


కరోనా కేసుల సంఖ్య నిల్‌కు చేరుకోవడంతో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉంటే భవిష్యత్‌లో ఈ మహమ్మారిని మళ్లీ రాకుండా తరిమి కొట్టవచ్చని వైద్యులు చెబుతున్నారు. కొన్ని రోజులుగా జిల్లాలో పరిస్థితి భయంకరంగా మారిపోతున్నది. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు, షాపింగ్‌ కాంప్లెక్స్‌, పలు వ్యాపార, వాణిజ్య సంస్థల్లో ప్రజలు భౌతిక దూరం పాటించడం లేదు. చాలా మంది మాస్కులు ధరించకుండా బయట తిరుగుతున్నారు. టెస్టులతో కరోనా జీరోకు తీసుకువచ్చేందుకు సహకరించిన ప్రజలు.. రెండో దఫా విజృంభన నేపథ్యంలో కొవిడ్‌ నిబంధనలు పాటిస్తే అందరికీ మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. 


Updated Date - 2020-12-21T05:10:04+05:30 IST