బైక్‌పై ఫ్రెండ్ పెళ్లికి వెళ్లాడు... అక్కడ ఊహించని విధంగా...

ABN , First Publish Date - 2020-03-23T13:27:13+05:30 IST

స్నేహితుడి పెళ్లికి వెళ్లిన యువకుడి బైక్‌ను ఫైనాన్స్‌ వాళ్లు లాక్కెళ్లారు. బతిమిలాడినా...

బైక్‌పై ఫ్రెండ్ పెళ్లికి వెళ్లాడు... అక్కడ ఊహించని విధంగా...

ఫైనాన్స్‌ వాళ్లు బైక్‌ లాక్కెళ్లారని యువకుడి ఆత్మహత్య

తూప్రాన్‌ పట్టణ పరిధిలోని రావెల్లిలో ఘటన


తూప్రాన్(మెదక్ జిల్లా): స్నేహితుడి పెళ్లికి వెళ్లిన యువకుడి బైక్‌ను ఫైనాన్స్‌ వాళ్లు లాక్కెళ్లారు. బతిమిలాడినా పట్టించుకోలేదు. పరువు పోయిందన్న వేధనతో ఆ యువకుడు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన తూప్రాన్‌ పట్టణ పరిధి రావెల్లిలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామస్థుల కథనం ప్రకారం... రావెల్లికి చెందిన అనుమోళ్ల స్వామి కుమారుడైన మహేశ్‌ (22) ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. కంపెనీకి వెళ్లేందుకు బైక్‌ను కొనుగోలు చేశారు. అందుకు ఓ బైక్‌ ఫైనాన్స్‌ వద్ద రుణం తీసుకున్నారు.


శుక్రవారం చేగుంటలో జరిగిన స్నేహితుడి వివాహానికి మహేశ్‌ వెళ్లగా, ఫైనాన్స్‌ వాళ్లొచ్చి బైక్‌ను లాక్కెళ్లారు. బైక్‌ను లాక్కెళ్ల వద్దని వాళ్లను బతిమిలాడినా పట్టించుకోలేదు. ఈ విషయంలో ఇంటికి వచ్చి బాధపడిన మహేశ్‌ బైక్‌ను విడిపించాలని తల్లిదండ్రులను కోరాడు. శుక్రవారం ప్రైవేటుగా అప్పుకోసం తల్లిదండ్రులు చేసిన ప్రయత్నం ఫలించలేదు. పరువు పోయిందని భావించిన మహేశ్‌ రావెల్లిలోని ఇంట్లో శనివారం రాత్రి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలియగానే తూప్రాన్‌ పోలీసులు సంఘటన స్థలికి చేరుకున్నారు. విచారణ చేస్తున్నామని తెలిపారు.

Updated Date - 2020-03-23T13:27:13+05:30 IST