గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడి మృతి
ABN , First Publish Date - 2020-12-14T05:09:31+05:30 IST
మిత్రుడితో కలిసి బైక్‌పై ఇంటికి వస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొని తీవ్రగాయాలపాలైన యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు.

కాబోయే అత్తగారింటికి వెళ్లి వస్తుండగా విషాదం... మరొకరికి గాయాలు
నారాయణఖేడ్, డిసెంబరు 13: మిత్రుడితో కలిసి బైక్‌పై ఇంటికి వస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొని తీవ్రగాయాలపాలైన యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని నిజాంపేట సమీపంలో జరిగింది. ఖేడ్ ఎస్‌ఐ సందీప్, రెండో ఎస్‌ఐ మొగులయ్య తెలిపిన వివరాల మేరకు.. మనూరు మండలం మాయికోడ్‌కు చెందిన బాలకృష్ణ(25)కు నిజాంపేటకు చెందిన యువతితో ఇటీవల పెళ్లి నిశ్చయమైంది. శనివారం బాలకృష్ణ తన మిత్రుడు నరేందర్‌తో కలిసి కాబోయే అత్తవారింటికి వెళ్లి రాత్రి స్వగ్రామానికి తిరిగివస్తుండగా దాదాపు 8.30 గంటల ప్రాంతంలో నిజాంపేట సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న బైపాస్ రోడ్డు వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొని బాలకృష్ణకు తీవ్ర గాయాలు కాగా మిత్రుడు సైతం స్వల్పంగా గాయపడ్డాడు. ఇది గమనించిన స్థానికులు నిజాంపేట సర్పంచు జగదీశ్వర్‌చారికి చెప్పడంతో ఆయన వెంటనే 108కు సమాచారమందించారు. తీవ్ర గాయాలకు గురైన బాలకృష్ణను నారాయణఖేడ్ ఆసుపత్రికి తరలించినప్పటికీ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ప్రమాదంలో గాయపడిన మరో వ్యక్తిని చికిత్స నిమిత్తం బీదర్ ఆసుపత్రికి తరలించారు. కాగా మృతుడి తండ్రి పదేళ్ల క్రితమే మరణించగా నాటి నుంచి కుటుంబ భారమంతా బాలకృష్ణపైనే ఉన్నట్టు స్థానికులు చెప్పారు. ఇటీవలే పెళ్లి నిశ్చయమై ఓ ఇంటివాడవుతాడనుకున్న తరుణంలో మృతి చెందడంతో తల్లి రోదన చూపరులను కంట తడిపెట్టించింది. మృతుడి సోదరుడు రమేష్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేయాలి
మండలంలోని నిజాంపేట వద్ద 161వ జాతీయ రహదారి విస్తరణలో భాగంగా నిర్మిస్తున్న బైపాస్ రోడ్డు బ్రిడ్జి సమీపంలో స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేయాలని నిజాంపేట సర్పంచ్ జగదీశ్వర్‌చారి ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. ఈ వంతెన వద్ద శనివారం రాత్రి బైక్‌ను గుర్తు తెలియని వాహనం ఢీ కొన్న ఘటనలో ఓ యువకుడు మృతి చెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ నేపఽథ్యంలో ఆదివారం సర్పంచ్ జగదీశ్వర్‌చారి ఘటనా స్థలాన్ని సందర్శించారు. వంతెన వద్ద నాలుగు వైపులా వెళ్లేందుకు మార్గాలు ఉండి వాహనాలు అతివేగంగా వెళ్తున్నందున ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని తెలిపారు. ఇక్కడ ఇప్పటికే జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో ఇరువురు ప్రాణాలు కోల్పోయారు. వాహనదారుల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని స్ర్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.