‘ఉపాధి’ భరోసా
ABN , First Publish Date - 2020-04-26T10:20:54+05:30 IST
లాక్‌డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో కూలి పనులపైనే ఆధారపడి జీవించే వారికి ఎలాంటి ఇబ్బందులు ఎదురుకారాదన్న

లాక్‌డౌన్ నేపథ్యంలో కూలీలకు ఉపాధి పనులు
57,617 మందికి పనుల కల్పన
గత ఏడాదితో పోల్చితే 16 వేల పని దినాలు ఎక్కువ
ఙకూలి రూ.211 నుంచి రూ.237కు పెంపు
ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సంగారెడ్డి, ఏప్రిల్ 25 : లాక్‌డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో కూలి పనులపైనే ఆధారపడి జీవించే వారికి ఎలాంటి ఇబ్బందులు ఎదురుకారాదన్న ఉద్దేశంతో సంగారెడ్డి జిల్లా యంత్రాంగం ఉపాధి హామీ పనులపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. కూలీ దొరకక పస్తులుంటున్నామన్న పరిస్థితులు కూలీలకు రాకుండా ఉండేందుకు యంత్రాంగం అవసరమైన చర్యలను చేపట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన ఈ నెల మొదటి రెండు వారాల్లో కాస్త నత్తనడకగా సాగిన ఉపాధి హామీ పనులను ఆ తర్వాత నుంచి వేగం పెంచారు.
ప్రస్తుత ఆర్థికసంవత్సరంలో జిల్లా వ్యాప్తంగా 84,41,133 పనిదినాలు కల్పించాలన్న ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదించింది. ఆ మేరకు ఇప్పటివరకు 70,150 పనిదినాలను జిల్లా యంత్రాగం కల్పించింది. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే నెలలో ఇప్పటి వరకు పోల్చితే 16 వేల పనిదినాలను కూలీలకు అదనంగా కల్పించినట్టయిందని అధికారవర్గాలు తెలిపాయి. గత ఆర్థిక సంత్సరంలో ఇప్పటి వరకు కూలీలకు కేవలం 54,070 పనిదినాలనే యంత్రాంగం కల్పించింది. కరోనా వైరస్ ప్రభావంతో పనులు ఎక్కడా దొరకకపోవడంతో సంగారెడ్డి జిల్లా అధికారులు కూలీల కోసం ఉపాధి హామీ పనులను వేగవంతం చేసింది.
అన్ని మండలాల్లో పనులు షురూ
సంగారెడ్డి జిల్లాలోని రామచంద్రాపురం మండలం మినహా అన్ని మండలాల్లోని 647 గ్రామ పంచాయతీల్లో ఉపాధిహామీ పనులు మొదలయ్యాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉన్న కారణంగా రామచంద్రాపురం మండలంలో పనులు చేపట్టడం లేదు. ప్రతి గ్రామంలో ప్రాథమికంగా కనీసం ఐదు మంది కూలీలకు పనులు కల్పించేలా యంత్రాంగం చర్యలు చేపట్టింది. పొలాలకు వెళ్లేందుకు మట్టిరోడ్లు వేయడంతో పాటు చెరువుల్లో పూడికతీత పనులు, మళ్లింపు కాల్వలు, కట్టుకాల్వలు తీయడం, వాటిల్లో పేరుకపోయిన మట్టిని తొలగించడం తదితర పనులను చేయిస్తున్నారు.
అంతేగాక పచ్చదనంలో భాగంగా మొక్కలు నాటడంతో పాటు ట్యాంకర్ల ద్వారా నీళ్లు పోయించడం చేయిస్తున్నారు. డంపుయార్డులు, వైకుంఠధామాల నిర్మాణాలకు ఉపాధి హామీ ద్వారా పనులు కల్పిస్తున్నారు. పనులు చేస్తున్న కూలీలకు గతేడాదిలో రూ.211లు ఇచ్చిన కూలీని ఈసారి రూ.237కు పెంచి చెల్లిస్తున్నారు. ఉపాధి హామీ పనులు చేపట్టేందుకు ముందుకు వచ్చే కూలీల జాబ్‌చార్ట్‌లను అధికారులు రూపొందించి ప్రతి సోమవారం లేదా గురువారాల్లో పనులను ప్రారంభింపజేస్తున్నారు. ఏమైనా కూలీలందరికీ ఏడాదిలో వంద రోజుల పని కల్పించేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. 2,21,369 మంది కూలీలకు జాబ్‌చార్ట్ ఇచ్చిన యంత్రాంగం 57,617 మంది కూలీలతో పనులు చేయిస్తున్నది.
భౌతిక దూరం పాటించేలా చర్యలు
జిల్లాలో జరుగుతున్న ఉపాధి హామీ పనుల్లో కూలీలందరూ భౌతికదూరం పాటించి పనులు చేసేలా క్షేత్రస్థాయిలో అధికారులు చూస్తున్నారు. మాస్క్‌లు కూడా ధరించి పనులు చేయాలని వారు కోరుతున్నారు. కరోనా వైరస్ మహమ్మరి సోకకుండా తీసుకునే ప్రధాన జాగ్రత్తలను కూలీలకు వివరిస్తున్న అధికారులు ఆరోగ్యం కాపాడుకుంటూ ఉపాధి పొందాలని సూచిస్తున్నారు. అందులో భాగంగా వేసవి తీవ్రత ఎక్కువగా ఉన్న దృష్ట్యా ఉదయం, సాయంత్రం వేళల్లోనే పనులు చేయాలని వారు కూలీలకు వివరిస్తున్నారు. పని ప్రదేశంలో తాగు నీటి వసతిని కల్పిస్తున్న అధికారులు కూలీలకు ఎండదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఉపాధి హామీకి పెద్ద ఎత్తున నిధులు
ఈసారి ఉపాధి హామీ పనులు చేపట్టేందుకు కూలీల కోసం ప్రభుత్వం పెద్దఎత్తున నిధులను కేటాయించింది. గత ఆర్థిక సంవత్సరంలో కూలీ డబ్బుగా ప్రభుత్వం రూ.48,64,219లు కేటాయించగా, ఈసారి మాత్రం రూ.200 కోట్లను చెల్లించనున్నది. కూలీ డబ్బులతో పాటు పనుల కోసం వినియోగించే పనిముట్ల కొనుగోలు, వైకుంఠధామాలు, డంపుయార్డులు వంటి పక్కా నిర్మాణాల కోసం ఈసారి ప్రభుత్వం రూ.858 కోట్లను ఖర్చు చేయనున్నది. దీనికి అవసరమైన ప్రణాళికను జిల్లా యంత్రాంగం సిద్ధం చేస్తున్నది