సంగారెడ్డిలో ట్రాఫికర్‌ తీరేదెన్నడో?

ABN , First Publish Date - 2020-03-02T11:41:28+05:30 IST

సంగారెడ్డి శివారులోని పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ ఆర్భాటంగా ప్రారంభించారు. ఈ సిగ్నల్స్‌ సరిగా పనిచేయకపోవడంతో ట్రాఫిక్‌

సంగారెడ్డిలో ట్రాఫికర్‌ తీరేదెన్నడో?

  • అస్తవ్యస్తంగా వాహనాల రాకపోకలు
  • పనిచేయని సిగ్నల్స్‌
  • ఆక్రమణలతో కనిపించని ఫుట్‌పాత్‌లు
  • ట్రాఫిక్‌ నియంత్రణ వదిలి 
  • చలాన్లపైనే పోలీసుల దృష్టి

సంగారెడ్డి క్రైం: సంగారెడ్డి శివారులోని పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ ఆర్భాటంగా ప్రారంభించారు. ఈ సిగ్నల్స్‌ సరిగా పనిచేయకపోవడంతో ట్రాఫిక్‌ అస్తవ్యస్తంగా మారుతోంది. ఫలితంగా వాహనదారులు ఎవరికి వారు ఇష్టానుసారంగా వెళ్తున్నారు. ఇటీవల రెండు లారీలు ఢీ కొన్నాయి కూడా. ప్రాణనష్టం వాటిల్ల్లకపోయినా ట్రాఫిక్‌ మాత్రం గంటలపాటు స్తంభించింది. పట్టణంలోని ఐబీ వద్ద ఏర్పాటు చేసిన సిగ్నల్‌  అప్పుడప్పుడూ మొరాయిస్తోంది. దీంతో వాహనాలు అడ్డదిడ్డంగా వెళ్తున్నాయి. 


రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్‌


సంగారెడ్డి పట్టణం ట్రాఫిక్‌ సమస్యతో కొట్టుమిట్టాడుతోంది. రోజురోజుకూ పెరుగుతున్న జనాభాకనుగుణంగా రోడ్ల విస్తరణ జరుగక సమస్య జఠిలంగా మారుతోంది. పట్టణంలో చాలాకాలంగా ఉన్న రోడ్లలోనే డివైడర్లు ఏర్పాటు చేయడం, రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఫుట్‌పాత్‌లు ఆక్రమణకు గురికావడంతో వాహనాల పార్కింగ్‌ కష్టసాధ్యమవుతోంది. సాయంత్రాల్లో పట్టణంలో రోడ్డు దాటాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిందే. పెరుగుతున్న రద్దీని నియంత్రించేందుకు ట్రాఫక్‌ పోలీసులు సిగ్నల్స్‌ ఏర్పాటు చేసినా ఆశించిన ప్రయోజనం కలగడం లేదు. సిగ్నల్స్‌ సరిగా పనిచేయక వాహనాల రాకపోకలు ఇష్టానుసారంగా మారాయి. భారీ వాహనాలను పట్టణం మీదుగా వెళ్లకుండా పట్టణ శివారులోని ఫసల్‌వాది వద్ద ఏర్పాటు చేసిన ట్రాఫిక్‌ చెక్‌పోస్టు ఎత్తివేయడంతో భారీ వాహనాలు పట్టపగలే పట్టణంలోకి వస్తున్నాయి. దీంతో పట్టణంలో ట్రాఫిక్‌ సమస్య తీవ్రమైంది.


ఫుట్‌పాత్‌లు మాయం


ట్రాఫిక్‌కు అంతరాయం కలుగకుండా పాదచారుల కోసం రోడ్డుకు ఇరువైపులా ఫుట్‌పాత్‌లు ఏర్పాటు చేశారు. వ్యాపార వాణిజ్య సంస్థల నిర్వాహకులు ఈ ఫుట్‌పాత్‌లను ఆక్రమించి వ్యాపారం సాగిస్తున్నారు. దీంతో వ్యాపార సంస్థలకు వచ్చే వాహనదారులు తమ వాహనాలను రోడ్ల మీద నిలపాల్సి వస్తోంది. సరైన పార్కింగ్‌ సౌకర్యంలేక రోడ్డుపై సగం వరకు వాహనాలను నిలపాల్సిన పరిస్థితి. పార్కింగ్‌ చూపించాల్సిన వ్యాపార వాణిజ్య సంస్థల నిర్వాహకులు పట్టించుకోకపోవడంతో వాహనదారులకు కష్టాలు తప్పడం లేదు. 


నియంత్రణ వద్దు.. చలాన్లే ముద్దు


ట్రాఫిక్‌ నియంత్రణ వద్దు.. చలాన్ల విధింపే ముద్దు అన్న చందంగా ఉంది సంగారెడ్డి పట్టణంలో ట్రాఫిక్‌ పోలీసుల వరస. సంగారెడ్డి పట్టణంలో ఎక్కడ ట్రిపుల్‌ రైడింగ్‌ కనిపించినా, సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ డ్రైవింగ్‌ చేసినా వారికి చలాన్లను విధించేందుకు ట్రాఫిక్‌ పోలీసులు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ఆ ఆసక్తిలో లేశమాత్రమైనా ట్రాఫిక్‌ క్రమబద్ధీకరఫై చూపడం లేదని వాహనదారులు ఆరోపిస్తున్నారు. మోటార్‌ బైక్‌పై భార్యాపిల్లలలతో వెళ్లినా పోలీసులు చలాన్‌ ద్వారా జరిమానా విధిస్తున్నట్లు ఓ బాధితుడు వాపోయాడు. కొడుకును స్కూల్‌ నుంచి ఇంటికి తీసుకెళ్తుంటే ట్రిపుల్‌ రైడింగ్‌ అంటూ 1,200 చలాన్‌ వేసి పంపారని మరొకరు ఆందోళన వ్యక్తం చేశారు. ట్రాఫిక్‌ను నియంత్రించాల్సిన పోలీసులు చలాన్ల పేరిట వాహనదారులను భయాందోళనకు గురి చేస్తున్నారు.

Updated Date - 2020-03-02T11:41:28+05:30 IST