కాగజ్‌మద్దుర్‌లో సీలింగ్ భూమికి ఎసరు ?
ABN , First Publish Date - 2020-12-28T05:01:10+05:30 IST
భూముల ధరలు నింగినంటుతుండటంతో మండలంలోని కాగజ్‌మద్దుర్ సమీపంలోని సీలింగు భూములను కొందరు అక్రమార్కులు దక్కించుకునేందుకు యత్నిస్తున్నట్టు పలువురు ఆరోపిస్తున్నారు.

ప్రభుత్వ భూమికి హద్దులు లేక ఆక్రమించే యత్నం
గుట్ట ప్రాంతాన్ని తొలచి మట్టిని తరలిస్తున్న అక్రమార్కులు
నర్సాపూర్, డిసెంబరు 27: భూముల ధరలు నింగినంటుతుండటంతో మండలంలోని కాగజ్‌మద్దుర్ సమీపంలోని సీలింగు భూములను కొందరు అక్రమార్కులు దక్కించుకునేందుకు యత్నిస్తున్నట్టు పలువురు ఆరోపిస్తున్నారు. సీలింగ్ భూములు ప్రభుత్వ ఆధీనంలో ఉన్నా, రెవెన్యూ అధికారుల పర్యవేక్షణ లేకపోవడం అక్రమార్కుల పాలిట వరంగా మారింది. కాగజ్‌మద్దూర్ సమీపంలోని సర్వే నెంబరు 63/1 భూమిలో మొత్తం పధ్నాలుగున్నర ఎకరాల భూమి ఉంది. ఇందులో మూడు ఎకరాలు పట్టా భూమి కాగా, మిగతాది సీలింగ్ కింద ప్రస్తుతం ప్రభుత్వ ఆధీనంలో ఉంది. అయితే రెవెన్యూ అధికారులు ఈ సీలింగు భూమికి ఎటువంటి రక్షణ చర్యలు, హద్దులు, బోర్డు గానీ ఏర్పాటు చేయలేదు. ఇదే అదునుగా కొందరి దృష్టి దీనిపై పడింది. సీలింగు భూమిలో 6 ఎకరాల మేర గుట్ట భూమి, 5.20ఎకరాల మేర కుంట శిఖం, ఒకటిన్నర భూమిలో రోడ్డు ఉంది. ఎక్కువ భాగం గుట్టగా ఉండటంతో ఇప్పటివరకు ఈ భూమిపై ఎవరి దృష్టి పడలేదు.
ఎకరం ధర అరకోటికి పైనే..
ఇటీవల భూములఽ ధరలు అమాంతం పెరగడంతో ప్రస్తుతం ఈ ప్రాంతంలో బహిరంగ మార్కెట్‌లో ఎకరాకు అర కోటికి పైగానే ధర పలుకుతున్నది. పైగా ప్రధాన రోడ్డుకు అతీసమీపంలో ఉండటంతో ఈ భూమికి డిమాండు వచ్చింది. దీంతో అడ్డుగా ఉన్న గుట్టను తొలగిస్తే భూమిని సులువుగా ఆక్రమించేందుకు అవకాశం ఉంటుందన్న ఉద్ధేశంతో కొన్ని రోజులుగా ఈ గుట్టను తొలిచేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా యంత్రాలతో గుట్టను తొలుస్తూ, మట్టిని ఇతర ప్రాంతాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో రోజురోజుకూ గుట్ట ఆనవాళ్లు కోల్పోయి భూమి చదునుగా మారుతున్నది. చదునుగా మారాక భూమిని ఆక్రమించేందుకు కొందరు పావులు కదుపుతున్నట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఏదిఏమైనా ఎంతో విలువైన ఈ సీలింగు భూమిని ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు కాపాడేందుకు తగిన చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో ఈ భూమి ఖాయంగా కబ్జా కాక తప్పదనే అభిప్రాయం వ్యక్తం అవుతున్నది.
సీలింగ్ భూమిని కాపాడాలి: కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి
కాగజ్‌మద్దుర్ గ్రామసమీపంలోని సీలింగ్ భూమిని కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి నాగరాజు డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎంతో విలువైన సీలింగు భూమిలోని గుట్టను యంత్రాలతో తొలచి మట్టిని ఇతర ప్రాంతాలకు తరలిస్తూ సొమ్ము చేసుకోవడమే కాకుండా ఆ భూమిని ఆక్రమించేందుకు కొందరు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా రెవెన్యూఅధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
సీలింగ్ భూమిని ఆక్రమిస్తే చర్యలు తప్పవు- మాలతి, తహసీల్దార్
కాగజ్‌మద్దుర్ సమీపంలోని 63/1 సర్వేనెంబరులోని సీలింగ్ భూమిలోని గుట్టను తొలచి ఆక్రమించేందుకు యత్నిస్తున్నట్లు మా దృష్టికి కూడా వచ్చింది. ఎవరైనా ఆక్రమించడానికి యత్నిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవు. త్వరలోనే అక్కడ హద్దులతో పాటు బోర్డును ఏర్పాటు చేస్తాం. గుట్టను తొలచి మట్టి తరలించే వారిపై కూడా నిఘా పెట్టి వారిపై కూడా చర్యలు తీసుకుంటాం.