ప్రతి గింజనూ కొనుగోలు చేస్తాం

ABN , First Publish Date - 2020-04-07T11:38:04+05:30 IST

రైతులు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేస్తామని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌

ప్రతి గింజనూ కొనుగోలు చేస్తాం

కరోనాపై పోరాడుతూనే రైతు సంక్షేమానికి కృషి 

కరోనా వైరస్‌ సిగ్గుపడాల్సిన రోగం కాదు

ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు


గజ్వేల్‌, ఏప్రిల్‌ 6: రైతులు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేస్తామని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ మండలం దాచారంలో శనగల కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, ఎఫ్‌డీసీ చైర్మన్‌ ప్రతా్‌పరెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఓ వైపు కరోనాతో పోరాడుతూనే మరోవైపు సంక్షేమానికి ప్రభుత్వం పని చేస్తున్నదని తెలిపారు. రైతాంగం కోసం సీఎం కేసీఆర్‌ ఎంతో శ్రమిస్తున్నారని వివరించారు. ధాన్యాన్ని కొనేందుకు భారీగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, అందుకు రూ. 3,200 కోట్లను ముఖ్యమంత్రి కేటాయించారని చెప్పారు. దాన్యం కొనుగోళ్లలో దళారుల ప్రమేయం లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 7,700 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.


త్వరలోనే మొక్కజొన్న, వరి, పొద్దుతిరుగుడు కొనుగోలు కేంద్రాలను ప్రతి మండలంలో ప్రారంభిస్తామన్నారు. రాష్ట్రంలో గన్నీ బ్యాగులు కొరత ఉందని, పశ్చిమ బెంగాల్‌ నుంచి తెప్పించేందుకు ప్రధానితో సీఎం కేసీఆర్‌ మాట్లాడినట్టు తెలిపారు. గజ్వేల్‌ ప్రాంతంలో కూరగాయలను అధికంగా సాగుచేస్తారని, ఎరువుల దుకాణాలను తెరిచి ఉంచేలా ఏర్పాట్లు చేశామన్నారు. ఈ సీజన్‌లో కూరగాయల సాగుతో అత్యధిక లాభం వస్తుందన్నారు. కూరగాయల విక్రయానికి మార్కెట్‌కు వెళ్లే రైతులకు ప్రత్యేక పాసులు ఇవ్వాలని ఆదేశించినట్టు తెలిపారు.


రైతు సంక్షేమమే ధ్యేయంగా ఉన్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆరేనని కొనియాడారు. కరోనా వైరస్‌ కట్టడికి కృషి చేస్తున్న డాక్టర్లకు, సఫాయి కార్మికులకు కృతజ్ఞతలు తెలిపారు. అవకాశమున్న ప్రతి చోటా ఉపాధి హామీ పనులను పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు, ఏపీఎంలు, టెక్నికల్‌ అసిస్టెంట్లు చేయించాలని సూచించారు. కరోనా సిగ్గు పడాల్సిన రోగం కాదని, దగ్గు, జ్వరం, గొంతు నొప్పి ఉంటే ఆసుపత్రులను సంప్రదించాలన్నారు. ఆయన వెంట అదనపు కలెక్టర్‌ పద్మాకర్‌, తహసీల్దార్‌ మహ్మద్‌ అన్వర్‌, ఎంపీపీ అమరావతి, జడ్పీటీసీ మల్లేశం, పీఎసీఎస్‌ చైర్మన్‌ వెంకటేశ్‌గౌడ్‌, సర్పంచ్‌ భాగ్య, నాయకులు ఎం.శ్రీనివాస్‌, బి.మధు, సందీ్‌పరెడ్డి ఉన్నారు.

Read more