ఊరికి తాళం.. దారికొచ్చిన జనం..
ABN , First Publish Date - 2020-03-25T12:38:03+05:30 IST
జిల్లాలోని పలు గ్రామాలు స్వీయ నిర్బంధాన్ని అమలు చేస్తున్నాయి. కరోనా వైర్‌సను కట్టడి చేయడంలో భాగంగా కీలక నిర్ణయం తీసుకున్నాయి. తమ పల్లెల్లోకి ఇతరులెవరూ రాకుండా ముందస్తు జాగ్రత్తతో

- పల్లెల్లో స్వీయ నిర్బంధం ..
- ముళ్లకంచెలు, బారికేడ్లతో గ్రామానికి దారులు బంద్
- పొరుగు గ్రామానికీ వెళ్లలేకుండా దిగ్బంధం
- రోడ్డుమీదికి వచ్చిన వారిని అడ్డుకున్న పోలీసులు
- గజ్వేల్‌లో గుంజీలు తీయించిన ఖాకీలు
- దుకాణాల వద్ద సామాజికదూరం పాటిస్తున్న ప్రజలు
- రెండోరోజు ధరల కట్టడి.. రూ.20కే టమాట
- రద్దీ పెరగకుండా ఎక్కడికక్కడ కూరగాయల మార్కెట్ల ఏర్పాటు
- జిల్లా సరిహద్దుల్లో చెక్‌పోస్టుల ఏర్పాటు
- విదేశాల నుంచి రామచంద్రాపురానికి 57 మంది రాక
- నోటీసులిచ్చిన రెవెన్యూ అధికారులు
- బీహెచ్‌ఈఎల్ టౌన్‌షిప్ గేట్లు మూసివేత
- ఉజలంపాడ్‌లో పంచాయతీ నిబంధనలు కఠినతరం
- అతిక్రమించిన వారికి రూ.50వేల జరిమానా నిర్ణయం
- చెక్‌పోస్టులో తనిఖీలు కట్టుదిట్టం
ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సిద్దిపేట, మార్చి24:జిల్లాలోని పలు గ్రామాలు స్వీయ నిర్బంధాన్ని అమలు చేస్తున్నాయి. కరోనా వైర్‌సను కట్టడి చేయడంలో భాగంగా కీలక నిర్ణయం తీసుకున్నాయి. తమ పల్లెల్లోకి ఇతరులెవరూ రాకుండా ముందస్తు జాగ్రత్తతో లాక్‌డౌన్ చేశాయి. ఈ నెల 31వరకు మండల కేంద్రాలు, పట్టణాలతో సంబంధాలను తెంచుకోవడంపై ఆయా గ్రామాల ప్రజలు దృష్టి పెట్టారు.
ముళ్లకంచెలతో అడ్డుగోడలు..
జిల్లాలో 499 గ్రామాలు ఉండగా ప్రస్తుతం సుమారు 100 గ్రామాల్లో ఆంక్షలు విధించారు. గ్రామాల పొలిమేరల్లో ముళ్లకంచెలు, బారికేడ్లు వేసి తాత్కాలికంగా అడ్డుగోడలను నిర్మించారు. వంతులవారీగా అక్కడ కొందరు వ్యక్తులు ఉండేలా నిర్ణయం తీసుకున్నారు. ఇతరులెవరైనా వచ్చిన క్రమంలో వారి అవసరాన్ని తెలుసుకొని అనుమతిస్తున్నారు. లేదంటే తిరిగి పంపిస్తున్నారు. ఇక బయట దేశాల నుంచి వచ్చినా, పక్క రాష్ర్టాల నుంచి వచ్చినా సరే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. గ్రామ పరిస్థితిని ఆరా తీసేందుకు వచ్చే అధికారులకు మాత్రం అనుమతిస్తున్నారు. అంతేగాకుండా అత్యవసర పనులుంటే తప్ప ఇళ్లలో నుంచి బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు.
అతిక్రమిస్తే జరిమానాలే
ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించే విధంగా ఎవరైనా ప్రవర్తిస్తే జరిమానాలు సైతం విధించేలా గ్రామాల్లో చర్యలు చేపట్టారు. కొండపాక మండలం సిర్సనగండ్లలో ఉదయం 10గంటల వరకే స్వల్ప మినహాయింపులతో అనుమతులు ఇచ్చారు. ఆ తర్వాత ఎవరైనా బయట కనిపిస్తే జరిమానా విధిస్తున్నారు. ఇదే విధానాన్ని మిగితా గ్రామాలు కూడా అమలు చేయాలని భావిస్తున్నారు. రూ.100 నుంచి రూ.500 వరకు జరిమానాలు విధిస్తే ప్రజల్లో మార్పు వస్తుందని స్థానికంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు.
అనుమానితులపై ఆరా
విదేశాలనుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారి ఆరోగ్య పరిస్థితిపై రెవెన్యూ, పోలీసు, వైద్యాధికారులు, సిబ్బంది మంగళవారం ఇంటింటికీ వెళ్లి ఆరా తీశారు. స్వయం నిర్బంధంలో ఉన్న వారు తగు జాగ్రత్త్తలు తీసుకోవాలని సూచించారు. జడ్పీ సీఈవో శ్రవణ్‌కుమార్ స్వయంగా చిన్నకోడూరు, నారాయణరావుపేట మండలాల్లోని కొన్ని గ్రామాలకు వెళ్లి పరిశీలించారు. కరోనా వ్యాప్తిని అరికట్టడానికి కొనసాగుతున్న చర్యలను పరిశీలించారు.
ధరల కట్టడి
లాక్‌డౌన్ నేపథ్యంలో కూరగాయల ధరలు విపరీతంగా పెంచి విక్రయిస్తుండటంపై ప్రజాప్రతినిధులు, అధికారులు మంగళవారం చర్యలు తీసుకున్నారు. సిద్దిపేటలో మున్సిపల్ చైర్మన్ కడవెర్గు రాజనర్సు, మార్కెట్ కమిటీ చైర్మన్ పాల సాయిరాం తదితరులు తాత్కాలికంగా ఏర్పాటు చేసిన మార్కెట్లలో మైకుల ద్వారా ప్రచారం చేశారు. కూరగాయల ధరలను కట్టడి చేశారు. దీంతో సోమవారం కిలోకు రూ.40లకు అమ్మిన టమాటాలు మంగళవారం 20కే విక్రయించారు. పాత కూరగాయల మార్కెట్‌లో విచ్చలవిడి ధరలను అరికట్టడంలో భాగంగా దాన్ని మొత్తం మూసివేయించారు.
జిల్లా సరిహద్దుల్లో చెక్‌పోస్టులు
సిద్దిపేట జిల్లా సరిహద్దుల్లో పోలీస్ అధికారులు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి ఇతర జిల్లాల నుంచి రాకపోకలను నియంత్రించారు. వరంగల్, కరీంనగర్, మెదక్, యాదాద్రి-భువనగిరి, రంగారెడ్డి, హై దరాబాద్ జిల్లాల హద్దుల్లో ఇతర వాహనాలను తిప్పి పంపించారు. నిత్యావసర సరుకులు మినహా ఇతర వాహనాలను తిప్పి పంపారు.