నీటి గుంతలో పడి ఇద్దరు చిన్నారులు మృతి

ABN , First Publish Date - 2020-09-01T07:04:39+05:30 IST

గుంతలో పడి ఇద్దరు చిన్నారులు మృతిచెందిన సంఘటన మండలంలోని మల్లేపల్లిలో చోటు చేసుకున్నది.

నీటి గుంతలో పడి ఇద్దరు చిన్నారులు మృతి

కొండాపూర్‌, ఆగస్టు 31 : గుంతలో పడి ఇద్దరు చిన్నారులు మృతిచెందిన సంఘటన మండలంలోని మల్లేపల్లిలో చోటు చేసుకున్నది. గ్రామస్థుల, పోలీసుల వివరాల ప్రకారం గ్రామానికి చెందిన ప్రశాంత్‌ (13), చంటి దినేష్‌ (13) కలిసి ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటలకు ఊరి బయటకు వెళ్లారు. ఈ క్రమంలో ప్రశాంత్‌ బహిర్భూమికి వెళ్లి ప్రమాదవశాత్తు పక్కనే ఉన్న గుంతలో పడిపోయాడు. దినేష్‌ కాపాడేందుకు ప్రయత్నించి అతనూ పడిపోయాడు.


సాయంత్రమైనా కొడుకు ఇంటికి రాకపోవడంతో ప్రశాంత్‌ తండ్రి మానయ్య ఇరుగుపొరుగు వారిని ఆరాతీశాడు. ఎక్కడా కనిపించకపోవడంతో ఊరు శివారులో వెతుకుతున్న క్రమంలో ఓ గుంతలో ప్రశాంత్‌ చెప్పులు కనిపించాయి. అందులోకి దిగి చూడగా ఇద్దరు చిన్నారులు మృతిచెంది ఉన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని శవపంచనామా నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

సోమవారం ఉదయం మల్లేపల్లిలో అంత్యక్రియలు నిర్వహించారు. దినే్‌షకు తల్లిదండ్రులు లేరు. ప్రశాంత్‌ తుర్కల ఖానాపూర్‌లోని గురుకుల పాఠశాలలో, దినేష్‌ హత్నూరలోనే గురుకుల పాఠశాలలో ఏడో తరగతి పూర్తిచేసుకున్నారు. 


Updated Date - 2020-09-01T07:04:39+05:30 IST