టీఆర్‌ఎస్‌దే హవా

ABN , First Publish Date - 2020-02-16T06:29:53+05:30 IST

టీఆర్‌ఎస్‌దే హవా

టీఆర్‌ఎస్‌దే హవా

  • కారు ఖాతాలో 404 డైరెక్టర్‌ స్థానాలు
  • 40 సంఘాల్లో గులాబీ గుబాలింపు
  • కాంగ్రెస్‌కు 259 డైరెక్టర్‌ స్థానాలు
  • 12 సంఘాల చైర్మన్‌గిరి దక్కే ఛాన్స్‌
  • ఒకే సంఘానికి పరిమితమవనున్న బీజేపీ 
  • నేడు చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎన్నిక
  • జోరుగా క్యాంపుల నిర్వహణ

ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సంగారెడ్డి, ఫిబ్రవరి 15 : సహకార ఎన్నికల్లో టీఆర్‌ఎ్‌స హవానే కొనసాగింది. జిల్లాలో అత్యధికంగా 404 డైరెక్టర్‌ స్థానాలను ఆ పార్టీ గెలుచుకోవడంతో 40 సంఘాల (పీఏసీఎ్‌స)లో పాగా వేయడానికి సిద్ధమైంది. జిల్లాలోని 53 సంఘాలలోని 689 డైరెక్టర్ల స్థానాలకు ఎన్నికల కోసం నోటిఫికేషన్‌ ఇవ్వగా ఎస్టీలకు రిజర్వు చేసిన 10 సంఘాల్లోని 10 డైరెక్టర్ల స్థానాలకు అభ్యర్థులు లేని కారణంగా ఎన్నికలు జరగలేదు. మిగిలిన 679 డైరెక్టర్ల స్థానాల్లో 262 డైరెక్టర్ల స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఇందులో ఎనిమిది సంఘాలున్నాయి. దాంతో 45 సంఘాల్లోని 417 డైరెక్టర్ల స్థానాలకు శనివారం ఎన్నికలు జరిగాయి. మధ్యాహ్నం ఒంటిగంటకు పోలింగ్‌ ముగియగానే అక్కడే ఓట్ల లెక్కింపును నిర్వహించి, ఫలితాలను ప్రకటించారు. 


పార్టీల వారీగా బలాబలాలు

262 డైరెక్టర్ల స్థానాలు ఏకగ్రీవం ఎన్నికలు జరిగిన 417 డైరెక్టర్ల ఫలితాలు వెల్లడయ్యాయి. మొత్తం 679 డైరెక్టర్ల స్థానాల్లో టీఆర్‌ఎస్‌ మద్దతుదారులు 404 మంది గెలుపొందగా, కాంగ్రెస్‌ మద్దతుదారులు 259 మంది, బీజేపీకి చెందిన వారు 14 మంది, ఇండిపెండెంట్లు ఇద్దరు గెలుపొందిన వారున్నారు.


టీఆర్‌ఎ్‌సకు 40 సంఘాలు

ఒక్కో సంఘంలో 13 మంది డైరెక్టర్లున్నారు. వీరిలో కనీసం 7 మంది డైరెక్టర్లు గెలుపొందిన పార్టీ మద్దతుదారులు చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవులను దక్కించుకోనున్నది. ఆ రకంగా జిల్లాలోని 53 సంఘాలలో 40 సంఘాలు టీఆర్‌ఎ్‌సకు దక్కనున్నాయి. కాంగ్రెస్‌ 12 సంఘాలను గెలుచుకోనుండగా బీజేపీ ఒక్క సంఘం దక్కించుకోనుండడం విశేషం.


పార్టీలకు దక్కనున్న సంఘాలు

టీఆర్‌ఎ్‌సకు నందికంది, సదాశివపేట, మల్కాపూర్‌, కంది, ఇస్మాయిల్‌ఖాన్‌పేట, గొల్లపల్లి, మారేపల్లి, నాగాపూర్‌, మాచిరెడ్డిపల్లి, ఇప్పెపల్లి, రాయిపల్లి, ఏడాకులపల్లి, ఝరాసంగం, ఇందూర్‌, న్యాల్‌కల్‌, పీచెరాగడి, వావిలాల, గుమ్మడిదల, ముత్తంగి, రుద్రారం, సోలక్‌పల్లి, పటాన్‌చెరు, భానూర్‌, తెల్లాపూర్‌, బాచేపల్లి, కల్హేర్‌, నారాయణఖేడ్‌, మనూర్‌, బీబీపేట, బొక్క్‌సగావ్‌, క్రిష్ణాపూర్‌, మార్డి, సంజీవన్‌రావుపేట, గంగాపూర్‌, కడ్పల్‌, అందోల్‌, ముదిమానిక్‌, హత్నూర, కాసాల, ఖాదిరాబాద్‌ సంఘాలు దక్కనున్నాయి. కాగా కాంగ్రె్‌సకు కొండాపూర్‌, తేర్పోల్‌, చెల్మడకలాన్‌, మల్‌చెల్మ, సత్వార్‌, బిలాల్‌పూర్‌, బిడెకన్నె, హద్నూర్‌, నల్లంపల్లి, కంగ్టి, అక్సాన్‌పల్లి, శివ్వంపేట సంఘాలు దక్కే అవకాశాలు ఉండగా, బీజేపీ మండల కేంద్రమైన పుల్‌కల్‌ సంఘంను దక్కించుకోనున్నది. 


నేడు చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎన్నికలు

జిల్లాలోని సహకార సంఘాల చైర్మన్‌, వైస్‌ చైర్మన పదవులకు ఆదివారం నాడు ఎన్నికలు జరగనున్నాయి. ఏవైనా కారణాల చేత సంఘం సమావేశంలో సభ్యుల కోరం లేక వాయిదా పడితే సోమవారం ఎన్నికలు నిర్వహించనున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. పీఏసీఎస్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక కోసం ఆయా పదవులను ఆశిస్తున్న టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ అభ్యర్థులు డైరెక్టర్లతో క్యాంపులు నిర్వహిస్తున్నారు. చైర్మన్‌ ఎన్నిక ఆదివారం ఉండడంతో జిల్లా సమీపంలోని రిసార్టులు, హోటళ్లకు తీసుకెళ్లారు. అక్కడే గెలుపొందిన డైరెక్టర్లకు మందు, విందుతో పాటు ఒక్కో డైరెక్టర్‌కు రూ.లక్ష నుంచి రెండు లక్షల వరకు ఇచ్చేందుకు ఒప్పందాలు చేసుకుంటున్నట్టు తెలిసింది. 

Updated Date - 2020-02-16T06:29:53+05:30 IST