ప్రతిపక్ష నేతలకు టీఆర్‌ఎస్ కౌంటర్
ABN , First Publish Date - 2020-12-27T05:40:30+05:30 IST
చేర్యాల పెద్దచెరువు మత్తడి ఆవరణ స్థల విషయమై ఆందోళన సాగిస్తున్న ప్రతిపక్ష నేతలకు టీఆర్‌ఎస్ కౌంటర్ ఇచ్చింది. మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతా్‌పరెడ్డితో పాటు ప్రతిపక్ష నేతల తీరును ప్రశ్నిస్తూ కరపత్రాలను రూపొందించింది.

కొమ్మూరి తీరును ప్రశ్నిస్తూ కరపత్రాల పంపిణీ
చేర్యాల, డిసెంబరు 26 : చేర్యాల పెద్దచెరువు మత్తడి ఆవరణ స్థల విషయమై ఆందోళన సాగిస్తున్న ప్రతిపక్ష నేతలకు టీఆర్‌ఎస్ కౌంటర్ ఇచ్చింది. మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతా్‌పరెడ్డితో పాటు ప్రతిపక్ష నేతల తీరును ప్రశ్నిస్తూ కరపత్రాలను రూపొందించింది. పార్టీ చేర్యాల పట్టణాధ్యక్షుడు ముస్త్యాల నాగేశ్వర్‌రావు ప్రచురించిన కరపత్రాలను శనివారం మున్సిపల్ చైర్‌పర్సన్ అంకుగారి స్వరూపారాణి స్థానిక నాయకులతో కలిసి ఆవిష్కరించి పంపిణీ చేశారు. అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ చేర్యాల ప్రజల ఆశలను వమ్ముచేసి ఈ ప్రాంత అస్థిత్వాన్ని వంచించిన కబ్జాదారుడు మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతా్‌పరెడ్డి అని విమర్శించారు. తగాదా భూమిని తక్కువ ధరకు సెటిల్‌మెంట్ చేసి ఎలాంటి అనుమతులు లేకుండా 19 ఎకరాలలో వెంచర్ చేసిన కొమ్మూరి 10 వేల చదరపు గజాలు గ్రామపంచాయతీకే కేటాయించాల్సి ఉన్నా.. ఇతరులకు అమ్ముకోవడాన్ని కబ్జా కాదంటారా అని ఎద్దేవా చేశారు. మున్సిపల్ ఆఫీసు నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయించిన గ్రీన్‌ల్యాండ్‌లో ప్రతా్‌పరెడ్డి ప్రస్తుతం పెట్రోల్ బంక్ నిర్మాణం చేసుకోవడాన్ని ఏమంటారో తెలపాలన్నారు. పెద్దచెరువు మత్తడి ద్వారా వరదనీరు రోడ్డుపైకి ప్రవహించి ప్రజలు, వ్యాపార స్తులు ఇబ్బందులు ఎదుర్కోవడంతో ప్రభుత్వ అసమర్థత అని నిరసన వ్యక్తం చేసిన ప్రతిపక్షాల నాయకులు నేటికీ ప్రత్యామ్నాయ మార్గం చూపకపోగా, ఎమ్మెల్యే ముత్తిరెడ్డిపై దుష్ప్రచారంతో రాద్దాంతం చేస్తున్నారన్న విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. చేర్యాల అస్థిత్వ పరిరక్షణకు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కృషి చేశారని, ప్రతిపక్ష నేతలు ఎంత మభ్యపెట్టాలని చూసినా ప్రజలు హర్షించరని, తగిన గుణపాఠం తప్పక నేర్పుతారన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నిమ్మ రాజీవ్, కౌన్సిలర్లు ఆడెపు నరేందర్, పచ్చిమడ్ల సతీష్, కో-ఆప్షన్ సభ్యులు ముస్త్యాల నాగేశ్వర్‌రావు, పచ్చిమడ్ల అంజనీదేవీ, వై.ఆరోగ్యరెడ్డి, నాయకులు ఎం.బాలనర్సయ్య, పుర్మ వెంకట్‌రెడ్డి, పుర్మ ఆగంరెడ్డి పాల్గొన్నారు.