సిద్దిపేటలో ట్రాఫిక్‌ సమస్య

ABN , First Publish Date - 2020-11-25T05:40:21+05:30 IST

అన్నింటా అభివృద్ధి చెందుతున్న సిద్దిపేట పట్టణంలో ట్రాఫిక్‌ విషయంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది.

సిద్దిపేటలో ట్రాఫిక్‌ సమస్య
సిద్దిపేటలోని సుభాష్‌రోడ్డులో వాహనాల రద్దీ

పార్కింగ్‌ సదుపాయం, వన్‌వేలు లేక ప్రజలకు తిప్పలు 


సిద్దిపేట సిటీ, నవంబరు 24: అన్నింటా అభివృద్ధి చెందుతున్న సిద్దిపేట పట్టణంలో ట్రాఫిక్‌ విషయంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది. షాపింగ్‌ మాల్స్‌, స్టోర్స్‌ పుట్టుకొస్తున్నా పార్కింగ్‌ సదుపాయం లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో రోడ్లపైనే వాహనాలను నిలుపడంతో ట్రాఫిక్‌ సమస్య తలెత్తుతోంది. పట్టణంలో కొన్ని రోడ్లు దుకాణాల సముదాయలతో నిండిపోయాయి. ఆ ప్రాంతాల్లో వన్‌వేలు ఏర్పాటు చేయకపోవడంతో ప్రజలకు తిప్పలు తప్పడం లేదు. సుభా్‌షరోడ్‌, సెంట్రల్‌బ్యాంక్‌ రోడ్డు తదితర ప్రాంతాల్లో జనం ఎప్పుడు రద్దీగా ఉంటారు. ఆ ప్రాంతాల్లో వాహనాలను ఇష్టరీతిన పార్కింగ్‌ చేస్తున్నారు. ఆ ప్రాంతాల్లో ప్రైవేట్‌ ఆస్పత్రులు ఎక్కువగా ఉన్నాయి. అత్యవసర పరిస్థితిలో వెళ్లాలంటే ట్రాఫిక్‌ సమస్యతో రోగి ప్రాణానికే ప్రమాదం సంభవించే అవకాశం ఉంది. సుభాష్‌ రోడ్డుపై ఉదయం నుంచి రాత్రి 8 గంటల వరకు ఎప్పుడు జనం ఉంటారు. రోడ్డు విస్తీర్ణం కూడా చాలా తక్కువ. ఉన్న రోడ్డులోనే పండ్ల బండ్లు, పార్కింగ్‌ చేస్తుండడంతో కనీసం ఒక ఆటో కూడా వెళ్లలేని పరిస్థితి. కొన్ని రోజుల క్రితం ఈ రోడ్డుపై వన్‌వేను ఏర్పాటు చేసినా దుకాణ దారుల ఒత్తిడితో ఎత్తేశారు. సిద్దిపేట పట్టణంలోని ఏ ఒక్క బ్యాంక్‌ వద్ద కూడా పార్కింగ్‌ సదుపాయం లేదు. ప్రధాన కూడళ్ల వద్ద ఉన్న బ్యాంక్‌ల వద్ద పార్కింగ్‌ సదుపాయం లేక వాహనాలను రోడ్లపైనే నిలుపుతున్నారు. 


జరిమానాలను మరిచిన ట్రాఫిక్‌ అధికారులు


నో పార్కింగ్‌ జోన్‌లో వాహనాలు నిలిపితే జరిమానా విధిస్తారానే భయం ప్రజల్లో కరువైంది. విచ్చలవిడిగా రోడ్లపైనే వాహనాలను నిలిపి గంటల తరబడి పనులు చేసుకుంటున్నారు. దీంతో ట్రాఫిక్‌ సమస్య తలెత్తినా ట్రాఫిక్‌ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. 

Read more