ఉద్యోగాల పేరిట రూ.67 లక్షలకు టోకరా

ABN , First Publish Date - 2020-12-17T06:00:47+05:30 IST

ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి మోసం చేసి దాదాపు రూ.67 లక్షల వసూలు చేసిన ముగ్గురు నిందితులను సంగారెడ్డి పట్టణ పోలీసులు బుధవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను సంగారెడ్డి డీఎస్పీ ఏ.బాలాజీ పట్టణ పోలీ్‌సస్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

ఉద్యోగాల పేరిట రూ.67 లక్షలకు టోకరా
నిందితుల వివరాలను తెలుపుతున్న డీఎస్పీ బాలజీ

ముగ్గురు నిందితుల అరెస్టు

పరారీలో మరొక నిందితుడు

వివరాలు వెల్లడించిన సంగారెడ్డి డీఎస్పీ బాలాజీ 


సంగారెడ్డి క్రైం, డిసెంబరు 16 : ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి మోసం చేసి దాదాపు రూ.67 లక్షల వసూలు చేసిన ముగ్గురు నిందితులను సంగారెడ్డి పట్టణ పోలీసులు బుధవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను సంగారెడ్డి డీఎస్పీ ఏ.బాలాజీ పట్టణ పోలీ్‌సస్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్‌ మండలం తొగర్‌పల్లి గ్రామానికి చెందిన ఎర్రొల్ల బందెమ్మ(30), పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన నూతి రవీందర్‌(50), కరీంనగర్‌ జిల్లా చిగురుమామిడి మండలం ఇందుర్తికి చెందిన బత్తిని వైకుంఠం(56), సంగారెడ్డికి చెందిన విజయకుమార్‌ ఒక ముఠాగా ఏర్పడ్డారు. నిరుద్యోగుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికి దాదాపు 25 మంది నిరుద్యోగుల నుంచి రూ.67లక్షల రూపాయలు వసూలు చేశారు. ఒక్కొక్కరి దగ్గర రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు దండుకున్నారు. గత సంవత్సరం కాలంగా వసూలు చేసిన మొత్తం డబ్బు తిరిగి ఇవ్వాలని కొందరు బాధితులు వారిని డిమాండ్‌ చేయగా నిందితులు సాంఘిక సంక్షేమ శాఖ, రిజిస్ర్టేషన్‌ కార్యాలయాల్లో నియామకాలు చేసినట్లు నకిలీ ఉద్యోగ నియామక పత్రాలను సృష్టించి బాధితులకు ఇచ్చారు. తీరా ఆ నియామక పత్రాలు నకిలీవని తెలుసుకున్న బాధితులు పోలీసులను ఆశ్రయించారు. అంతేగాక నిందితుల్లో ఒకరైన ఎర్రోల్ల బందెమ్మ తాను తప్పించుకొనేందుకు నూతి రవీందర్‌, బత్తిని వైకుంఠం, విజయ్‌కుమార్‌ తనను కూడా మోసగించారని పట్టణ పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. సంగారెడ్డి పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా మొత్తం వ్యవహారం బయటపడింది. ఈ కేసులో ఎర్రొల్ల బందెమ్మ, నూతి రవీందర్‌, బత్తిని వైకుంఠంను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. మరో నిందితుడు విజయ్‌కుమార్‌ పరారీలో వున్నట్టు చెప్పారు. నిందితుల నుంచి చెక్‌బుక్కులు, ఫోన్‌లు, నకిలీ నియామక పత్రాలు స్వాధీనం చేసుకున్నామని వివరించారు. 


Updated Date - 2020-12-17T06:00:47+05:30 IST