ప్రతీ ఎకరాకు నీళ్లిస్తాం

ABN , First Publish Date - 2020-05-10T10:04:52+05:30 IST

కాళేశ్వరం నీళ్లు వస్తే సిద్దిపేట ప్రాంతంలో భవిష్యత్తులో బోర్లు, బావులు తవ్వించుకోవాల్సిన అవసరమే రాదని మంత్రి

ప్రతీ ఎకరాకు నీళ్లిస్తాం

కాల్వల ద్వారా పొలానికే పారిస్తాం

బోర్లు, బావులు తవ్వించే అవసరమే రాదు

ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు


సిద్దిపేట రూరల్‌, మే 9: కాళేశ్వరం నీళ్లు వస్తే సిద్దిపేట ప్రాంతంలో భవిష్యత్తులో బోర్లు, బావులు తవ్వించుకోవాల్సిన అవసరమే రాదని మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట రూరల్‌ మండలం పెద్దలింగారెడ్డిపల్లిలో శనివారం రాత్రి ఆయన పర్యటించారు. రంగనాయకసాగర్‌ ప్రాజెక్టు ఎడమ కాల్వ ద్వారా వచ్చిన నీటితో నిండిన అమ్మకుంట చెరువును సందర్శించి జల హారతి ఇచ్చారు. హనుమాన్‌ ఆలయంలో గోదావరి నీటితో అభిషేకం చేశారు. లవ్‌ పీఎల్‌ఆర్‌పీ బోర్డును ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ గోదావరి నదికి 490 మీటర్ల ఎత్తులో ఉన్న సిద్దిపేటకు గోదావరి జలాలను తరలించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు.


భవిష్యత్తులో సిద్దిపేట ప్రాంతంలో బోర్లు, బావులు తవ్వించే అవసరమే ఉండదని, ప్రతి ఎకరాకు రంగనాయకసాగర్‌ ద్వారా సాగునీరు అందిస్తామని చెప్పారు. తెలంగాణలో రైతులు పట్టు పంచెలు కట్టుకునే రోజులు వచ్చాయన్నారు. సాగునీటి సౌకర్యం పెరిగినందున రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టిసారించాలని సూచించారు. యాసంగి ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ దేశంలోనే ముందున్నదని చెప్పారు. దేశవ్యాప్తంగా 54 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరిస్తే, రాష్ట్రంలోనే 34 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని తెలియజేశారు. భవిష్యత్తులో రాఘవాపూర్‌లో 10 వేల మెట్రిక్‌ టన్నుల గోదాం నిర్మిస్తామని చెప్పారు.


వారం రోజుల్లో రైతులకు రైతు బంధు పథకం ద్వారా డబ్బులు విడుదలవుతాయని, రూ.25 వేల వరకు పంట రుణాలు మాఫీ అవుతాయని తెలిపారు. లాక్‌డౌన్‌ సడలించినా ప్రజలు జాగ్రత్తలు పాటించాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్‌ నందిని సిధారెడ్డి, సర్పంచ్‌ తౌటి ఉదయశ్రీ, ఎంపీపీ శ్రీదేవి, జడ్పీటీసీ శ్రీహరిగౌడ్‌, సుడా చైర్మన్‌ మారెడ్డి రవీందర్‌రెడ్డి, స్థానిక నాయకులు, రైతులు పాల్గొన్నారు.

Updated Date - 2020-05-10T10:04:52+05:30 IST