ఐదేళ్లలో 240

ABN , First Publish Date - 2020-10-04T10:34:54+05:30 IST

అదిగో డబుల్‌ బెడ్రూం ఇళ్లు.. ఇదుగో డబుల్‌ బెడ్రూం ఇళ్లు.. కట్టడం పూర్తవుతున్నాయి.. ఇవ్వడమే తరువాయి.. దరఖాస్తు చేసుకోండి..

ఐదేళ్లలో 240

పేదలకు కేటాయించిన డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు ఇంతే!

సంగారెడ్డి జిల్లాకు మంజూరైనవి 5,555

ఇప్పటివరకు నిర్మాణం చేపట్టినవి 5,139

మరో 1,383 ఇళ్లకు మౌలిక వసతుల కల్పన


అదిగో డబుల్‌ బెడ్రూం ఇళ్లు.. ఇదుగో డబుల్‌ బెడ్రూం ఇళ్లు.. కట్టడం పూర్తవుతున్నాయి.. ఇవ్వడమే తరువాయి.. దరఖాస్తు చేసుకోండి.. అంగరంగ వైభవంగా గృహప్రవేశాలు చేద్దాం అని ఊరించడం తప్ప ఇప్పటివరకు సగం ఇళ్లను కూడా పూర్తిగా నిర్మించలేదు. సంగారెడ్డి జిల్లాకు 5,555 ఇళ్లను మంజూరు చేయగా అందులో 5,139 డబుల్‌ ఇళ్లు మాత్రమే నిర్మాణ దశలో ఉన్నాయి. మిగతా ఇళ్ల నిర్మాణం కోసం ఇంకా తట్టెడు మట్టి కూడా తీయలేదు. 50 వరకు డబుల్‌ ఇళ్ల నిర్మాణాలకు ఇంకా టెండర్ల ప్రక్రియ పూర్తి కాకపోవడం విడ్డూరం. జిల్లాలో 1,623 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని చెబుతున్నా వాటికి ఇంకా తుది మెరుగులను దిద్దుతూనే ఉన్నారు. అయితే ఇన్నాళ్లకు జిల్లాలో 240 మంది లబ్ధిదారులకు ఇళ్లను కేటాయించారు. మిగతా ఇళ్ల నిర్మాణాలను ఎప్పుడు పూర్తి చేస్తారో.. ఎప్పుడు లబ్ధిదారులకు కేటాయిస్తారో అధికార పార్టీ నేతలకు, జిల్లా అధికారులకే తెలియాలి.


ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సంగారెడ్డి, అక్టోబరు 3 : ప్రభుత్వం గొప్పగా చెప్పుకునే డబుల్‌ బెడ్రూం ఇళ్లను సంగారెడ్డి జిల్లాలో కేవలం 240 మందికి కేటాయించారు. 2015-16 సంవత్సరంలో డబుల్‌ బెడ్రూం ఇళ్ల కార్యక్రమాన్ని చేపట్టిన ప్రభుత్వం ఆ సంవత్సరంలో సంగారెడ్డి జిల్లాకు 1,800 ఇళ్లను మంజూరు చేసింది. ఆ తర్వాత సంవత్సరమైన 2016-17లో 3,755 ఇళ్లకు మంజూరు ఇచ్చింది. మొత్తం మీద మంజూరైన 5,555 డబుల్‌ బెడ్రూం ఇళ్లలో ఇప్పటిదాకా 5,505 ఇళ్లకే టెండర్లు ఖరారయ్యాయి. వీటిలో కాంట్రాక్టర్లు 5,139 ఇళ్ల నిర్మాణం చేపట్టారు. ఐదేళ్ల కాలంలో విడతల వారీగా ప్రారంభించిన డబుల్‌ బెడ్రూం ఇళ్లలో ఇప్పటివరకు 1,623 ఇళ్లు పూర్తయి, స్వల్ప పనులతో తుది మెరుగులు దిద్దుకుంటున్నాయి. జిల్లా వ్యాప్తంగా పూర్తయిన ఇళ్ల నుంచి లబ్ధిదారులకు 240 డబుల్‌ బెడ్రూం ఇళ్లను మాత్రమే కేటాయించడం గమనార్హం. ఐదేళ్ల కాలంలో నిర్మాణాలు చేపట్టిన 5,139 డబుల్‌ బెడ్రూం ఇళ్లకు ప్రభుత్వం రూ.175.18 కోట్లను ఖర్చు చేసింది.


ఎక్కడెక్కడ కేటాయించారంటే పుల్‌కల్‌ మండలం సింగూరులో 2015-16లో మంజూరై నిర్మాణం పూర్తయిన 150 ఇళ్లను గతేడాది లబ్ధిదారులకు కేటాయించారు. అలాగే జహీరాబాద్‌ మండలం పస్తాపూర్‌లో 2016-17లో మంజూరైన 40 ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయించిన యంత్రాంగం ఇటీవలే లబ్ధిదారులకు కేటాయించింది. కల్హేర్‌ మండలం బాచేపల్లిలో 2016-17లో మంజూరైన 50 ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసి లబ్ధిదారులకు కేటాయించారు.


త్వరలో కేటాయించేందుకు మరో 1,383 ఇళ్లు సిద్ధం

జిల్లా వ్యాప్తంగా నిర్మాణాలు చేపట్టిన డబుల్‌ బెడ్రూం ఇళ్లలో 1,623 నిర్మాణాలు పూర్తి కాగా అందులో 240 ఇళ్లను ఇప్పటికే లబ్ధిదారులకు కేటాయించారు. మరో 1,383 ఇళ్లు దాదాపుగా పూర్తయి లబ్ధిదారులకు అందించేందుకు సిద్ధంగా ఉన్నాయి. కొండాపూర్‌ మండలం అలియాబాద్‌లో 50, సదాశివపేట మండలం ముబారక్‌పూర్‌లో 30, తంగెడపల్లిలో 50, సిద్దాపూర్‌లో 100, సంగారెడ్డి మండలం ఫసల్‌వాదిలో 265, జహీరాబాద్‌లో 312, అందోలులో 216, వడ్డెరలు, హమాలీలకు ప్రత్యేకంగా 108 ఇళ్లు, అందోలు మండలం డాకూరులో 104, మునిపల్లి మండలం కంకోలులో 96, మునిపల్లిలో 72 డబుల్‌ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి.


అయితే ఈ ఇళ్లన్నింటికీ ఫ్లోరింగు, విద్యుత్‌ సరఫరా, డ్రైనేజీ నిర్మాణం, తలుపుల బిగింపు వంటి పనులు చేపట్టాల్సి ఉన్నది. అందుకే వీటికి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను యంత్రాంగం చేపట్టడం లేదు. ఫసల్‌వాదిలో పూర్తి కావచ్చిన 265 ఇళ్లు చివరి దశలో ఉన్నాయి. జహీరాబాద్‌ అర్బన్‌ పరిధిలో చేపట్టిన 320 ఇళ్లు ఇటుక పనుల వరకు పూర్తయ్యాయి. ప్లాస్టరింగ్‌ చేయాల్సి ఉన్నది. అందోలు నగర పంచాయతీ పరిధిలో వడ్డెరలు, హమాలీల కోసం నిర్మిస్తున్న 108 ఇళ్లకు, ఇతరుల కోసం చేపట్టిన 216 ఇళ్లకు ఇంకా మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉన్నది. అలాగే మునిపల్లిలో పూర్తయ్యాయంటున్న 72 ఇళ్లకు, కంకోలులో నిర్మాణాలు పూర్తయిన 96 ఇళ్లలోనూ మౌలిక సదుపాయాలను కల్పించిన తర్వాతే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయనున్నట్టు అధికారవర్గాలు తెలిపాయి. ఇలా ఉండగా పటాన్‌చెరు నియోజకవర్గంలో నిర్మాణాలు ప్రారంభించిన 400 ఇళ్లలో, నర్సాపూర్‌ నియోజకవర్గం హత్నూర మండలంలో చేపట్టిన 70 ఇళ్లలో ఐదేళ్లలో ఒక్కటీ పూర్తి కాకపోవడం గమనార్హం.

Updated Date - 2020-10-04T10:34:54+05:30 IST