కరోనా సమయంలో వింత పోకడలు.. ఆలయాల్లో ఏం జరుగుతోందంటే..!

ABN , First Publish Date - 2020-07-24T20:01:39+05:30 IST

అన్ని సమస్యలకు ఆ దేవుడే దిక్కు అని అంటారు. కానీ ఆ దేవుడి హుండీలకే దిక్కు లేకుండా పోతోంది. నగదు కోసం అమ్మవార్ల ఆలయాలను కూడా వదలడం లేదు కొందరు ప్రబుద్ధులు. దేవతా విగ్రహాల ముక్కుపుడకలు, పుస్తెమట్టెలను సైతం మాయం చేస్తున్నారు.

కరోనా సమయంలో వింత పోకడలు.. ఆలయాల్లో ఏం జరుగుతోందంటే..!

దేవుడి హుండీలకు కన్నం

గ్రామ శివారు ఆలయాల్లో దొంగతనాలు

డబ్బుతో పాటు ఆభరణాల చోరీ

జిల్లాలో ఇటీవల 15 సంఘటనలు

చేస్తున్నది స్థానికులా.. దొంగలా ?


సిద్దిపేట (ఆంధ్రజ్యోతి): అన్ని సమస్యలకు ఆ దేవుడే దిక్కు అని అంటారు. కానీ ఆ దేవుడి హుండీలకే దిక్కు లేకుండా పోతోంది. నగదు కోసం అమ్మవార్ల ఆలయాలను కూడా వదలడం లేదు కొందరు ప్రబుద్ధులు. దేవతా విగ్రహాల ముక్కుపుడకలు, పుస్తెమట్టెలను సైతం మాయం చేస్తున్నారు. గల్లా పెట్టెలను పగులగొట్టి భక్తుల కానుకలతో ఉడాయిస్తున్నారు. ఇలాంటి సంఘటనలు సిద్దిపేట జిల్లాలో నిత్యకృత్యంగా మారాయి. 


ఆలయాల్లో దొంగతనాలు ఎక్కువయ్యాయి. గడిచిన రెండు నెలల వ్యవధిలోనే జిల్లాలో సుమారు 15 ఆలయాల్లో దొంగతనాలు జరిగాయి. గ్రామాల నడిబొడ్డున ఉన్న ఆలయాలకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ శివారుల్లో ఉన్న ఆలయాలనే ఎక్కువగా లక్ష్యంగా చేసుకుంటున్నారు. అది కూడా రాతివేళల్లో పక్కా ప్రణాళికతో దొంగతనాలకు ఒడిగడుతున్నారు. తలుపులు పగులగొట్టి అమ్మవార్ల విగ్రహాలపై ఉన్న బంగారు పుస్తెమట్టెలు, ముక్కుపుడకలను దర్జాగా కాజేస్తున్నారు. ఎలాంటి రక్షణ లేకుండా ఉన్న హుండీలను కొల్లగొడుతున్నారు. ఇలాంటి ఊరి చివరన ఉన్న ఆలయాలు సిద్దిపేట జిల్లాలో వేల సంఖ్యలో ఉంటాయి. పెద్దమ్మ, ఎల్లమ్మ, పోచమ్మ, కనకదుర్గమ్మ, బీరప్ప, మల్లన్న ఆలయాలు ఎక్కువగా శివారుల్లో ఉన్నందున వీటిపైనే గురిపెడుతున్న పరిస్థితి నెలకొన్నది. 


ఇది దొంగలా పనేనా ?

కరోనా నేపథ్యంలో ఇళ్లలో కూడా దొంగతనాలు తగ్గుముఖం పట్టాయి. ఇళ్లలో నుండి ఎవరు కూడా బయటకు వెళ్లకపోవడం ఒక కారణం. ఎవరిని తాకినా కరోనా సోకవచ్చనే అనుమానాలు దొంగల్లో కూడా లేకపోలేదు. పైగా నిఘా కూడా ఎక్కువైంది. కొత్త వ్యక్తులు కనిపిస్తేనే ఆరా తీసే పరిస్థితి ప్రస్తుతం అంతటా నెలకొన్నది. దర్జాగా దొంగతనాలు చేయాలంటే ఆలయాలు ఒక్కటే మార్గమనే ఆలోచనతో ఇలాంటి వాటికి పాల్పడుతున్నట్లుగా పలువురు భావిస్తున్నారు. మరి ఈ హుండీల దొంగతనాలు అసలు చోరీలకు పాల్పడే వారు చేసినవేనా అంటే ఇంకా రుజువు కాలేదు. స్థానిక వ్యక్తులపై కూడా అనుమానాలు లేకపోలేదు. నగదు కోసం అడ్డదారులు తొక్కుతూ ఈ హుండీలను కొల్లగొడుతున్నారనే సందేహాలు సైతం ఉన్నాయి. వారివారి గ్రామాల్లోనే ఈ ఆలయాలు ఉన్నందున ఎవరికీ అనుమానం రాకుండా చోరీలకు పాల్పడే అవకాశాలు సైతం లేకపోలేదు. పలుచోట్ల జరిగిన సంఘటనలపై ఇప్పటికే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారి విచారణ కూడా కొనసాగుతున్నది. 


మరి కొన్ని సంఘటనలు

మద్దూరు మండలం వల్లంపట్లలోని దుర్గామాతా ఆలయంలో నెలక్రితం అమ్మవారి నగలు, హుండీ డబ్బు మాయమయ్యాయి.


సిద్దిపేట అర్బన్‌ మండలం బూరుగుపల్లిలోని ఎల్లమ్మ గుడిలో అమ్మవారి ముక్కుపుడక, నగదు మాయమైంది.


రాయపోల్‌ మండలంలోని రామసాగర్‌, లింగారెడ్డిపల్లి గ్రామాల్లోని శివారు ఆలయాల్లో ఇటీవల దొంగతనాలు జరిగాయి. ఆభరణాలు, సొమ్ము ఎత్తుకెళ్లారు. 


తొగుట మండల కేంద్రంలోని పెద్దమ్మ, మల్లన్న  ఆలయాల్లోని హుండీలను సోమవారం కొల్లగొట్టి డబ్బుతో పాటు ఆలయంలోని ఆభరణాలు అపహరించారు. ఇదే మండలం లింగంపేట పెద్దమ్మ ఆలయంలోనూ చోరీ జరిగింది. 


చేర్యాల మండలం చిట్యాలలో రేణుకా ఎల్లమ్మ, పెద్దమ్మ  ఆలయాల్లో రూ.50 వేల నగదుతో పాటు పుస్తెమట్టెలు, ముక్కుపుడకలు, ఇతర వెండి వస్తువులను ఇటీవలె దొంగిలించారు. చుంచనకోటలో పెద్దమ్మ ఆలయంలో రూ.20 వేల హుండీని కాజేశారు. దొమ్మాటలోని మరో ఆలయంలోనూ ప్రయత్నించి విఫలమయ్యారు.

Updated Date - 2020-07-24T20:01:39+05:30 IST