‘దూళిమిట్ట’తో మూడు దశాబ్దాల కల సాకారం

ABN , First Publish Date - 2020-12-18T06:12:33+05:30 IST

దూళిమిట్ట కేంద్రంగా మండల ఏర్పాటుతో ఇక్కడి ప్రజల మూడు దశాబ్దాల కల

‘దూళిమిట్ట’తో మూడు దశాబ్దాల కల సాకారం
తహసీల్దార్‌ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి

కొత్త మండల అభివృద్ధికి అన్నివిధాలుగా సహకరిస్తా

ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు


దూళిమిట్ట, డిసెంబరు 17: దూళిమిట్ట కేంద్రంగా మండల ఏర్పాటుతో ఇక్కడి ప్రజల మూడు దశాబ్దాల కల సాకారమైందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. మద్దూరు మండలంలో గ్రామంగా కొనసాగిన దూళిమిట్ట కేంద్రంగా 11 గ్రామాలతో నూతన మండలాన్ని గురువారం ఆయన జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ప్రభుత్వ విప్‌ బోడకుంటి వెంకటేశ్వర్లుతో కలిసి ప్రారంభించారు. అంతకుముందు వారికి గ్రామస్థులు బతుకమ్మలు, డప్పు చప్పుళ్లతో ఘన స్వాగతం పలికారు. ర్యాలీగా బయలుదేరి బాబు జగ్జీవన్‌రామ్‌ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. తహసీల్దార్‌ కార్యాలయం, విద్యుత్‌ సెక్షన్‌ కార్యాలయం, రైతువేదికను ప్రారంభించారు. అనంతరం తహసీల్దార్‌ కార్యాలయంలో ఇన్‌చార్జి తహసీల్దార్‌ అశోక్‌ మంత్రి సమక్షంలో బాధ్యతలను స్వీకరించారు. అనంతరం పంచాయతీ కార్యాలయ ప్రాంగణంలో సర్పంచ్‌ దీపికావేణుగోపాల్‌రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో ఈ ప్రాంత ప్రజలు సీఎం కేసీఆర్‌కు అండగా నిలిచారని గుర్తు చేశారు. దూళిమిట్ట మండలం ఏర్పాటు కాకముందే కరెంట్‌ ఆఫీసు ఏర్పాటైనట్లు చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్‌టీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 1984లో చేపట్టిన మండలాల విభజనలోనే దూళిమిట్ట మండలంగా ఏర్పాటు కావల్సినా అప్పట్లో సాధ్యం కాలేదని వివరించారు. అప్పటి నుంచి 36 ఏళ్లుగా మండలం ఏర్పాటు కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని, ప్రజల ఆకాంక్షను గుర్తించిన సీఎం కేసీఆర్‌ జిల్లాలో 24వ మండలంగా దూళిమిట్టను ఏర్పాటు చేయడానికి ఉత్తర్వులు ఇచ్చారని కొనియాడారు. దూళిమిట్టలో విద్యావంతులు, ప్రభుత్వ, ప్రవేటు రంగాల్లో ఉన్నతోద్యోగాలు చేస్తున్న వారు పలువురు ఉన్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ చీఫ్‌విప్‌ బోడకుంటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే ముత్తిరెడి యాదగిరిరెడ్డి సహకారంతో మండలాన్ని ఆదర్శంగా నిలిపేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు. 

అనంతరం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మాట్లాడుతూ దూళిమిట్టలో ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు భూమి ఇచ్చిన దాతలను అభినందించారు. దాతలకు భవిష్యత్తులో నిర్మించనున్న డబుల్‌బెడ్‌రూం ఇళ్లల్లో ప్రాధాన్యమిస్తామని వివరించారు. ముదిరాజ్‌ కమ్యూనిటీ హాల్‌ నిర్మాణానికి నిధుల మంజూరుకు కృషి చేయనున్నట్లు తెలిపారు.  అనంతరం మంత్రి హరీశ్‌రావుతో కలిసి దాతలను సన్మానించారు. 


ఈ నెల 27 నుంచి రైతుబంధు 

యాసంగి సీజన్‌కు ప్రభుత్వం అందజేయనున్న రైతుబంధు సాయాన్ని ఈ నెల 27 నుంచి రైతుల అకౌంట్లలో జమ చేయనున్నట్లు మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ఎకరాకు రూ.5 వేల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా రైతులకు సాయం అందజేయడానికి ప్రభుత్వం రూ.7,250 కోట్లను కేటాయించిందని వెల్లడించారు. నూతన వ్యవసాయ విధానాలపై రైతుల్లో చైతన్యం తీసుకురావడానికే రైతువేదికనలను ఏర్పాటు చేశామని వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో చెరువులు ఏడాదిలో ఏడు నెలలు మత్తడి దుంకుతూ కరువును తరిమికొడుతున్నాయని కొనియాడారు. కార్యక్రమంలో మద్దూరు ఎంపీపీ కృష్ణారెడ్డి, జిల్లా సమన్వయ సమితి అధ్యక్షుడు నాగిరెడ్డి, ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతా్‌పరెడ్డి, ఆర్డీవో జయచంద్రారెడ్డి, తహసీల్దార్‌ నరేందర్‌, జడ్పీటీసీ గిరి కొండల్‌రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ తిరుపతిరెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు మంద యాదగిరి పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-18T06:12:33+05:30 IST