కొలువుల ఆశ

ABN , First Publish Date - 2020-12-19T05:55:06+05:30 IST

త్వరలోనే 50వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయి.

కొలువుల ఆశ

 సర్కారు ప్రకటనతో ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న నిరుద్యోగ యువత

 సిద్దిపేట జిల్లాలో అన్ని శాఖల్లో కలిపి వందల సంఖ్యలో పోస్టులు 

 శిక్షణ కేంద్రాలు లేక ఇబ్బందులు


ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సిద్దిపేట, డిసెంబరు 18: త్వరలోనే 50వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయి. ఉద్యోగాలకు జిల్లాలోని యువత సన్నద్ధమవుతోంది. అయితే నోటిఫికేషన్లపై కొందరు నిరుద్యోగులు తర్జనభర్జన పడుతున్నట్లు తెలుస్తోంది.


జిల్లాలో 126 టీచర్‌ పోస్టులు ఖాళీ


జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో మొత్తంగా 126 ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేయాల్సి ఉన్నట్లు విద్యాశాఖ ప్రభుత్వానికి నివేదిక పంపించింది. ఇందులో స్కూల్‌ అసిస్టెంట్లు-57, భాషా పండితులు-5, సెకండరీ గ్రేడ్‌ టీచర్లు-60, పీఈటీలు-4 పోస్టులు ఉన్నట్లు గుర్తించారు. 126 పోస్టులతోపాటు ఇటీవలే ఉద్యోగ విరమణ చేసినవారు, మరో అరునెలల్లో చేయాల్సిన వారి జాబితాను కూడా సిద్ధం చేయనున్నట్లు తెలుస్తున్నది. జిల్లాలో గడిచిన ఆరేళ్లలో పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలు, వ్యవసాయ శాఖ ఏఈవోలు, గ్రూప్‌-4ద్వారా రిక్రూట్‌ అయిన జూనియర్‌ అసిస్టెంట్లు పనిచేస్తున్నారు. వీరి సంఖ్య 400 దాకా ఉంది. ప్రస్తుతం వీఆర్వోలను  తాత్కాలికంగా పక్కనబెట్టగా పంచాయతీ కార్యదర్శుల పోస్టుల్లో మరో 50 భర్తీ చేయాల్సి ఉంది. ఇక జిల్లాలో వ్యవసాయ శాఖకు సంబంధించి 127 ఏఈవో క్లస్టర్లు ఉండగా 20 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రెవెన్యూతో పాటు ఇతర శాఖల్లో జూనియర్‌ అసిస్టెంట్ల కొరత తీవ్రంగా ఉన్నది. ప్రతీ కార్యాలయంలో ప్రైవేట్‌ వ్యక్తులను కంప్యూటర్‌ ఆపరేటర్లుగా, అసిస్టెంట్లుగా తాత్కాలిక పద్ధతిన నియమించుకున్నారు. వైద్య, ఆరోగ్య శాఖలోనూ ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులే ఎక్కువ మంది ఉన్నారు. ఈ శాఖలోనూ వందలాది పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. 


పోలీసు ఉద్యోగాలకే ప్రాధాన్యం


టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో రెండుసార్లు రాష్ట్ర వ్యాప్తంగా 30వేలకు పైగా పోలీస్‌ ఉద్యోగాలు భర్తీ అయ్యాయి. తాజాగా మరో 20వేల పోలీసు ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు చర్చ జరుగుతోంది. దీంతో నిరుద్యోగ యువత ఇప్పటి నుంచే పరీక్షకు సన్నద్ధమవుతున్నారు. గత నోటిఫికేషన్‌లో సిద్దిపేట జిల్లాకు చెందిన 15 మంది ఎస్‌ఐలుగా, 300 మంది వరకు కానిస్టేబుళ్లుగా ఎంపికయ్యారు. హుస్నాబాద్‌, గజ్వేల్‌, సిద్దిపేట పట్టణాల్లో నాడు ఉచిత కోచింగ్‌ సెంటర్లను ఏర్పాటు చేసి శిక్షణ ఇచ్చారు. ఈ సారి కూడా సిద్దిపేటలో శిక్షణను ప్రారంభించారు. 


కోచింగ్‌ సెంటర్లు కరువు


 సిద్దిపేట పట్టణంలో సుమారు 10 వరకు ప్రైవేట్‌ కోచింగ్‌ సెంటర్లు ఉన్నాయి. వీటితో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ స్టడీ సర్కిళ్లలో శిక్షణ ఇచ్చేవారు. కరోనా కారణంగా ఈ కోచింగ్‌ సెంటర్లన్నీ మూతబడ్డాయి. హైదరాబాద్‌లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. చాలామందికి ఇళ్లలో ప్రిపేర్‌ అయ్యే విధంగా వసతులు లేవు. ఇదే సమయంలో నోటిఫికేషన్‌ వస్తే తమ పరిస్థితి ఏమిటని ఆవేదన చెందుతున్నారు. ఆన్‌లైన్‌ క్లాసులు అర్థం కాక, శిక్షణ ఇచ్చేవారు అందుబాటులో లేక సతమతమయ్యే అవకాశం ఉంది.


Updated Date - 2020-12-19T05:55:06+05:30 IST