భయపడొద్దు

ABN , First Publish Date - 2020-04-07T11:34:21+05:30 IST

కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటుందని, ప్రజలు భయపడొద్దని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు భరోసానిచ్చారు. సంగారెడ్డి జిల్లా

భయపడొద్దు

కరోనా కట్టడికి ప్రభుత్వం చర్యలు చేపడుతున్నది

సంగారెడ్డి జిల్లాలో రెండు మూడు ఐసోలేషన్‌ వార్డులు 

ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడి

రామచంద్రాపురంలోని మయూరినగర్‌లో పరిశీలన 

ఇంటింటికీ వైద్యపరీక్షలు నిర్వహించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌, వైద్యశాఖ డైరెక్టర్‌కు ఆదేశం


రామచంద్రాపురం, ఏప్రిల్‌ 6: కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటుందని, ప్రజలు భయపడొద్దని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు భరోసానిచ్చారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పట్టణం మయూరినగర్‌లో ఉంటున్న తండ్రి, కొడుకులకు రెండు రోజుల క్రితం కరోనా పాజిటివ్‌ రావడంతో సోమవారం స్థానికంగా ఉన్న పరిస్థితులను, అధికారులు తీసుకుంటున్న జాగ్రతలు, రక్షణ చర్యలను మంత్రి పరిశీలించారు. మయూరినగర్‌లోని తండ్రి కొడుకులకు కరోనా పాజిటివ్‌ వచ్చింద ని, వీరు ప్రస్తుతం కాంటినెంటల్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని మంత్రి చెప్పారు. సాయంత్రం వీరిని మెరుగైన చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. కరోనావ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని హరీశ్‌రావు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలను, సూచనలను ప్రజలు పాటించాలని కోరారు. కరోనా కట్టడిలో ప్రజలు విశ్వాసం, ధైర్యం కోల్పోవద్దని చెప్పారు.


ఇక కరోనా బారిన పడిన తండ్రి కొడుకుల కుటుంబ సభ్యులకు, వారి ఇంట్లో ఉంటున్న పనిమనిషి, అద్దెకుంటున్న వారినిఐసోలేషన్‌కు పంపే ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. వారు ఇద్దరు ఎవరెవరిని కలిశారన్న సమాచారాన్ని సేకరించి వారికి కూడా వైద్యపరీక్షలు నిర్వహిస్తామన్నారు. మయరినగర్‌లో ఇంటింటికీ వైద్యపరీక్షలు నిర్వహించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌, వైద్యశాఖ డైరెక్టర్‌కు ఆదేశించామన్నారు. మమూరినగర్‌లోని ప్రజలకు నిత్యావసర వస్తువులు, కూరగాలయ విషయంలో ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ప్రజాప్రతినిధులు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. మంత్రి వెంట ఎంపీ  ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి, కలెక్టర్‌ హనుమంతరావు, మియాపూర్‌ ఏసీపీ కృష్ణ ప్రసాద్‌, సీఐ రమేష్‌, ఎస్‌ఐ కోటేశ్వర్‌రావు, తహసీల్దార్‌ శివకుమార్‌, డీసీ బాలయ్య, వీఆర్వో రాజమల్లేశం, కార్పొరేటర్లు అంజయ్య, వి.సింధూ ఆదర్శరెడ్డి తదితరులు ఉన్నారు. 

Updated Date - 2020-04-07T11:34:21+05:30 IST