దుబ్బాకలో బీడుభూములు సస్యశ్యామలం

ABN , First Publish Date - 2020-12-19T06:01:45+05:30 IST

మల్లన్నసాగర్‌ ప్రాజెక్ట్‌ ద్వారా దుబ్బాక నియోజకవర్గంలోని బీడు భూములకు సాగునీరు అందించి సస్యశ్యామలం చేస్తున్నామని ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు.

దుబ్బాకలో బీడుభూములు సస్యశ్యామలం
మిరుదొడ్డిలో కల్యాణలక్ష్మి చెక్కును అందజేస్తున్న ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే రఘునందన్‌రావు, ఎమ్మెల్సీ పారూఖ్‌హుస్సేన్‌

 ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి


మిరుదొడ్డి, డిసెంబరు 18: మల్లన్నసాగర్‌ ప్రాజెక్ట్‌ ద్వారా దుబ్బాక నియోజకవర్గంలోని బీడు భూములకు సాగునీరు అందించి సస్యశ్యామలం చేస్తున్నామని ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. మండలంలోని లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను, అకాల వర్షాల వలన ఇళ్లు కూలిపోయిన బాధితులకు నష్టపరిహారపు చెక్కులను శుక్రవారం మిరుదొడ్డిలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు, ఎమ్మెల్పీ పారూఖ్‌హుస్సేన్‌తో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడారు. దుబ్బాకలో మల్లన్నసాగర్‌ ద్వారా నీళ్లందని 12 గ్రామాలకు రూ.80 కోట్లతో ఇర్కోడ్‌ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ద్వారా సాగునీటిని అందిస్తున్నట్లు చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పఽథకాలను సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలో అమలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. అనంతరం ఎమ్మెల్యే రఘునందన్‌రావు మాట్లాడుతు.. తాను పార్టీలకు అతీతంగా పనిచేస్తున్నట్లు చెప్పారు. దుబ్బాక నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపడుతానని వెల్లడించారు. అనంతరం ఎమ్మెల్సీ పారూఖ్‌హుస్సేన్‌ మాట్లాడుడూ.. దుబ్బాక నియోజకవర్గాన్ని పార్టీలకు అతితంగా అభివృద్ధి చేసుకోవాలన్నారు. కాగా తహసీల్దార్‌ ప్రభుత్వ పరంగా నిర్వహించే కార్యక్రమాల్లో ప్రొటోకాల్‌ పాటించడం లేదని ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే రఘుందన్‌రావు దృష్టికి ఎంపీపీ సాయిలు తీసుకువచ్చారు. కార్యక్రమంలో  జడ్పీటీసీ లక్ష్మీలింగం, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు బాల్‌రాజు, ఎంపీటీసీ నర్సింహులు పాల్గొన్నారు.


రేకులకుంట ఆలయాన్ని అభివృద్ధి చేస్తాం


దుబ్బాక, డిసెంబరు 18: దుబ్బాక మున్సిపాలిటీలోని రేకులకుంట మల్లిఖార్జున, రేణుక ఎల్లమ్మ ఆలయాల్లో ఎంపీ ప్రభాకర్‌రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామని, ధనుర్మాసంలో జాతరకు ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. అనంతరం దుబ్బాక ఎంపీపీ ఛాంబర్‌లో ఎంపీటీసీలు, సర్పంచులతో సమావేశమయ్యారు. ఆయన వెంట మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ వనితాభూంరెడ్డి, ఎంపీపీ పుష్పలత, జడ్పీటీసీ రవీందర్‌రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్‌ రమేష్‌, కౌన్సిలర్లు నిమ్మ రజిత, ఆస స్వామి, యాదగిరి, టీఆర్‌ఎస్‌ నేత రాజమౌళి ఉన్నారు.


Read more