పది విద్యార్థులూ... విజయీభవ

ABN , First Publish Date - 2020-03-19T06:56:01+05:30 IST

గురువులు చెప్పే పాఠాలు వింటూ.. ఏడాది పాటు పుస్తకాలతో కుస్తీ పట్టిన విద్యార్థులు తమ ప్రతిభను పరీక్షించుకునే సమయం వచ్చింది. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా

పది విద్యార్థులూ... విజయీభవ

మెదక్‌ అర్బన్‌, మార్చి 18 : గురువులు చెప్పే పాఠాలు వింటూ.. ఏడాది పాటు పుస్తకాలతో కుస్తీ పట్టిన విద్యార్థులు తమ ప్రతిభను పరీక్షించుకునే సమయం వచ్చింది. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా విద్యాశాఖ అన్నిఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా కరోనా ప్రభావం విద్యార్థులపై పడకుండా ముందస్తు చర్యలు తీసుకుంటుంది. విద్యార్థులు మాస్క్‌లు ధరించి పరీక్ష రాసేందుకు వెలుసుబాటు కల్పించింది. నేటి నుంచి పరీక్షలు ప్రారంభమై వచ్చేనెల ఏప్రిల్‌ 6న ముగియనున్నాయి.


మెదక్‌ జిల్లాలో ఇలా..

జిల్లావ్యాప్తంగా 66 పరీక్షా కేంద్రాలు ఏర్పాటుచేయగా.. జిల్లాలో మొత్తం 11,471 విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇందులో బాలురు 5,717 మంది, బాలికలు 5,754 మంది హాజరుకానున్నారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:15 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో హ్యాండ్‌వాష్‌ లిక్విడ్లు, సబ్బులను అందుబాటులో ఉంచారు. పరీక్ష ప్రారంభం, ముగిశాక ఇంటికి చేరేందుకు ఆర్టీసీ విస్తృతంగా బస్సులను నడిపిస్తోంది. ఈ విషయంలో కలెక్టర్‌ ధర్మారెడ్డి ఆధ్వర్యంలో ఆయా శాఖల అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి దిశానిర్దేశం చేశారు. 


పటిష్ట నిఘా

పదో తరగతి పరీక్షలకు పకడ్బందీగా నిర్వహించేందుకు పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు చేయనున్నారు. జిల్లాలోని 66 పరీక్షా కేంద్రాల వద్ద ఇద్దరి చొప్పున 132 పోలీసులు బందోబస్తు నిర్వహించనున్నారు. ప్రతి 20 మంది విద్యార్థులకు ఒక ఇన్విజిలేటర్‌ను నియమించారు. మెదక్‌ జిల్లావ్యాప్తంగా 800 మంది ఇన్విజిలేర్లు, 66 మంది చీఫ్‌ సూపరింటెండెంట్లు, 66 మంది డిపార్ట్‌మెంటల్‌ ఆఫీసర్లు, 3 ఫ్లయింగ్‌ స్క్వాడ్‌, 18 మంది రూట్‌, సిట్టింగ్‌ స్క్వాడ్‌ అధికారులను నియమించారు. 


15 పరీక్షా పత్రాలు భద్రపరిచే పాయింట్లు

పదో తరగతి పరీక్షల నిర్వహణకు 66 కేంద్రాలుండగా, పరీక్షా పత్రాలు నిల్వ చేసేందుకు 15 పోలీ్‌సస్టేషన్లు ఉన్నాయి. అందులో ఏ కేటగిరీకి చెందిన 23, బీ కేటగిరీకి చెందిన 25 పరీక్షా కేంద్రాలకు ఇవి అందుబాటులో ఉన్నాయి. సీ కేటగిరీకి చెందిన 18 పరీక్షా కేంద్రాలకు నిల్వ పాయింట్లకు పోలీ్‌సస్టేషన్లు కొంతదూరంగా ఉన్నందున వారు పరీక్షా పత్రాలు తీసుకెళ్లేందుకు ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.


నిబంధనలు ఇలా

పరీక్షా కేంద్రంలోకి ఇన్విజిలేటర్లు, చీఫ్‌ సూపరింటెండెంట్లు, ఏ అధికారి అయినా సెల్‌ఫోన్‌, ఇతర ఎలక్ర్టానిక్‌ వస్తువులు తీసుకెళ్లేందుకు అనుమతి లేదు. పరీక్ష సమయానికి గంట ముందు విద్యార్థులను కేంద్రాల్లోకి అనుమతించనున్నారు. విద్యార్థులకు తొలిరోజు 5 నిమిషాల వరకు అనుమతిస్తున్నట్లు ప్రకటించారు. 


ఏర్పాట్లు పూర్తిచేశాం : రమేశ్‌కుమార్‌, డీఈవో, మెదక్‌

పదో తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు అన్నిఏర్పాట్లు పూర్తిచేశాం. కేంద్రాల పరిసరాల్లోని జిరాక్స్‌ సెంటర్లు, బుక్‌స్టాళ్లు మూసేయాలి. గతంలో మాదిరిగా నిమిషం నిబంధన లేదు. పరీక్షలు ఉదయం 9:30 గంటలకు ప్రారంభమవుతాయి. ఐదు నిమిషాలు గడిచినా పరీక్ష రాసేందుకు విద్యార్థులను అనుమతిస్తారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు గంట ముందు పరీక్షా కేంద్రాలకు చేరుకుంటే మేలు. 144 సెక్షన్‌ అమల్లో ఉంటుంది.


పకడ్బందీగా పది పరీక్షలు

నేటి నుంచి ప్రారంభమయ్యే పది పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు అన్నిఏర్పాట్లు చేసినట్లు మెదక్‌ డీఈవో రమేశ్‌కుమార్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. విద్యార్థులు ఎలాంటి భయాందోళనకు గురికాకుండా స్వేచ్ఛగా పరీక్ష రాయాలని సూచించారు. ఉపాధ్యాయుల సలహాలు, సూచనలతో ప్రతి విద్యార్థి 10 జీపీఏ సాధించాలని ఆకాంక్షించారు. హాల్‌ టికెట్‌ చూపిస్తే ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేయొచ్చని పేర్కొన్నారు. కరోనా దృష్ట్యా ప్రతిఒక్కరూ మాస్క్‌లు ధరించే విధంగా మండల విద్యాధికారులు చర్యలు తీసుకుంటున్నారన్నారు. పరీక్షల్లో ఎల్టాఇ మాస్‌ కాపీయింగ్‌ జరగకుండా పటిష్టమైన చర్యలు చేపట్టామన్నారు. ముగ్గురు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌, 18 మందితో సిట్టింగ్‌ స్క్వాడ్‌ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. పరీక్షా కేంద్రంలోకి ఇన్విజిలేటర్లు, విద్యార్థులు సెల్‌ఫోన్లను తీసుకురావొదన్నారు. గతేడాది మెదక్‌ జిల్లా రాష్ట్రంలో 7వ స్థానంలో నిలిచిందని, ఈ ఏడాది ఉత్తమ ఫలితాలు సాధించేలా విద్యార్థులను తయారు చేశామన్నారు. 

Updated Date - 2020-03-19T06:56:01+05:30 IST