పది రోజుల్లో రైతు వేదికల పనులు పూర్తి కావాలి
ABN , First Publish Date - 2020-11-21T06:04:19+05:30 IST
పది రోజుల్లో రైతు వేదికల నిర్మాణాలు పూర్తి కావాలని అధికారులకు జిల్లా కలెక్టర్ పారుపాటి వెంకట్రామారెడ్డి ఆదేశించారు.

పర్యవేక్షణ బాధ్యత జిల్లాస్థాయి అధికారులదే
పంచాయతీరాజ్ శాఖ డీఈలు పనితీరు మార్చుకోవాలి
కలెక్టర్ వెంకట్రామారెడ్డి
గజ్వేల్, నవంబరు 20: పది రోజుల్లో రైతు వేదికల నిర్మాణాలు పూర్తి కావాలని అధికారులకు జిల్లా కలెక్టర్ పారుపాటి వెంకట్రామారెడ్డి ఆదేశించారు. గజ్వేల్ ఆర్డీవో కార్యాలయంలో శుక్రవారం జిల్లా అధికారులు, కాంట్రాక్టర్లు, పంచాయతీరాజ్ శాఖ డీఈలు, రైతు వేదిక కాంట్రాక్టర్లతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో క్లస్టర్లవారీగా రైతు వేదిక నిర్మాణాల పురోగతికి సంబంధించిన పూర్తి వివరాలను కాంట్రాక్టర్లు, డీఈలను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో 126 రైతు వేదికలు నిర్మిస్తున్నందున క్లస్టర్లవారీగా ఒక్కో నిర్మాణం పురోగతిని తెలుసుకుని, పనులను వేగవంతం చేసేందుకు పలు సూచనలు చేశారు. జిల్లాలో పంచాయతీరాజ్ శాఖ డీఈలు అనుకున్న స్థాయిలో పని చేయడం లేదని, ప్రణాళిక బద్ధంగా రైతు వేదిక నిర్మాణాలు పూర్తి చేయడంలో నిమగ్నం కావాలని ఆదేశించారు. పంచాయతీరాజ్ శాఖ డీఈఈలు పనితీరును మార్చుకోవాలని సూచించారు.
జిల్లాస్థాయి అధికారులకు పర్యవేక్షణ
జిల్లాలోని 126 రైతువేదికల నిర్మాణాలను శరవేగంగా పూర్తి చేసేందుకు గాను కలెక్టర్ వెంకట్రామారెడ్డి జిల్లాస్థాయి అధికారులకు పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించారు. జిల్లాలోని దొమ్మాట, మిరుదొడ్డి, అల్వాల్, చెప్యాల, భూంపల్లి గ్రామాలకు అదనపు కలెక్టర్ ముజామిల్‌ఖాన్, పుల్లూరు, రాఘవాపూర్, చిట్టాపూర్, పెద్దగుండవెళ్లి, తిమ్మాపూర్ గ్రామాలకు అదనపు కలెక్టర్ పద్మాకర్, బూర్గుపల్లి, పొన్నాల, బక్రీచెప్యాల, మందపల్లి గ్రామాలకు ఇన్‌చార్జి డీఆర్వో చెన్నయ్య, అల్లీపూర్, చిన్నకోడూర్, గోనెపల్లి, అనంతసాగర్, విఠలాపూర్ గ్రామాలకు డీఆర్డీఏ పీడీ గోపాల్‌రావు, మాచాపూర్, చంద్ల్లాపూర్, ఇబ్రహీంనగర్, మల్లారం గ్రామాలకు ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ శ్రీనివా్‌సచారి, నంగునూరు, గట్ల మల్యాల, ఖాతా గ్రామాలు పీఆర్ డీఈ వేణుగోపాల్, చీకోడ్, గంభీర్‌పూర్, పోతారెడ్డిపేట, ఆకారం, రాజక్కపేట, చెల్లాపూర్ గ్రామాలు జిల్లా వ్యవసాయశాఖాధికారి శ్రవణ్, మిరుదొడ్డి మండలంలోని వీరారెడ్డిపల్లి, రుద్రారం, జంగపల్లి గ్రామాల్లో పనులను జిల్లా మత్స్యశాఖాధికారి వెంకయ్య పర్యవేక్షిస్తారని కలెక్టర్ తెలిపారు. తొగుట మండలంలోని తొగుట, వెంకట్రావుపేట, ఎల్లారెడ్డిపేట, పెద్దమాసాన్‌పల్లి, గుడికందుల గ్రామాలు డీపీవో సురే్‌షబాబు, కొండపాక మండలంలోని కొండపాక, మాత్‌పల్లి, మేదినీపూర్, మర్పడగ, కుకునూర్‌పల్లి, కొక్కొండ గ్రామాలు గజ్వేల్ ఆర్డీవో విజయేందర్‌రెడ్డి, జగదేవ్‌పూర్ మండలంలోని చాట్లపల్లి, మునిగడప, తిమ్మాపూర్, జగదేవ్‌పూర్, తీగుల్ గ్రామాలు గడ ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి పర్యవేక్షిస్తారన్నారు. కొమురవెల్లి, మర్రిముచ్ఛాల పీఆర్ డీఈ శ్రీనివాస్, చేర్యాల మండలంలోని ఆకునూరు, గుర్జకుంట, చిట్యాల, కడవేర్గు, నాగపురి గ్రామాలు ఉద్యానవన శాఖ డీడీ రామలక్ష్మి, మద్దూరు మండలంలోని మద్దూరు, లద్దనూరు, ధూల్మిట్ట, కొండాపూర్, భైరాన్‌పల్లి గ్రామాల పర్యవేక్షణ బాధ్యతలను జడ్పీసీఈవో శ్రావణ్‌కుమార్‌కు అప్పజెప్పారు. హుస్నాబాద్ మండలంలోని పందిళ్ల, మహ్మదాపూర్, మీర్జాపూర్ గ్రామాలు పీఆర్ డీఈ సదాశివరెడ్డి, కోహెడ మండలంలోని కోహెడ, తంగలపల్లి, సముద్రాల, వర్కోల్, శ్రీరాములపల్లి గ్రామాలు పీఆర్ ఈఈ కనకరత్నం, అక్కన్నపేట మండలంలోని గౌరవెల్లి, అక్కన్నపేట, మల్లంపల్లి, అక్కన్నపేట, రేగొండ, రామవరం గ్రామాలు హుస్నాబాద్ ఆర్డీవో జయచంద్రారెడ్డిని, బెజ్జంకి మండలంలోని బెజ్జంకి, వడ్లూరు, బేగంపేట, గాగిళ్లాపూర్, దాచారం గ్రామాలు ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ నాగభూషణంను, బెజ్జంకి మండలంలోని కల్లెపల్లి, పెరికబండ గ్రామాలకు హుస్నాబాద్ ఏడీఏ మహే్‌షను ప్రత్యేక పర్యవేక్షణ అధికారులుగా నియమించినట్లు కలెక్టర్ పేర్కొన్నారు.
పది రోజుల పాటు వేదికల వద్దే మకాం
వచ్చే పది రోజుల పాటు ప్రతీ జిల్లా అధికారి రైతు వేదికల వద్ద వాటి నిర్మాణాల తీరుపై కనీసం మూడు గంటల పాటు కూర్చుని పరిశీలన జరపాలని కలెక్టర్ సూచించారు. రానున్న 10 రోజుల్లో రైతు వేదికల నిర్మాణాలు కచ్చితంగా పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకుని కాంట్రాక్టర్లు పని చేసేలా చూడాలని అధికారవర్గాలకు సూచించారు. ఈ నెల 30వ తేదీ లోపు జిల్లాలో అన్ని రైతువేదిక నిర్మాణాలు పూర్తయ్యేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని చెప్పారు. ప్రతీ రోజూ రైతు వేదిక నిర్మాణం వద్ద ఎంత మంది లేబర్లు పనిచేస్తున్నారనే విషయమై తనకు వాట్సాప్ చేయాలని, రాత్రిపూట ఫ్లడ్‌లైట్లు పెట్టి నిర్మాణాలు పూర్తయ్యేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తెలిపారు. రైతు వేదికల నిర్మాణాల పురోగతిపై రెండు రోజులకోసారి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్ష జరుపుతామని కలెక్టర్ స్పష్టం చేశారు. రోజూవారీగా రైతువేదిక ప్రగతి పనుల నివేదిక ఆధారంగా అనుకున్న స్థాయిలో పనిచేయని కాంట్రాక్టర్లను మార్చి మరో కాంట్రాక్టరును నియమించే అధికార బాధ్యతలను ప్రతిపాదిత జిల్లా అధికారులకు ఇస్తున్నట్టు తెలిపారు. అదే విధంగా ప్రతీ రైతు వేదిక వద్ద టాయిలెట్ నిర్మాణం చేపట్టాలని, అంతేగాకుండా మూడు వరుసలుగా కొనిఫెరస్ మొక్కలు నాటాలని సూచించారు. రైతు వేదిక వద్ద ల్యాండ్ లెవలింగ్, జంగిల్ క్లియరెన్స్ చేసి ప్లాంటేషన్‌ను ఉపాధిహామీలో చేపట్టాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ పద్మాకర్, పంచాయతీరాజ్ ఎస్‌ఈ కనకరత్నం, ఇన్‌చార్జి డీఆర్వో చెన్నయ్య, ఆర్డీవో జయచంద్రారెడ్డి, అనంతరెడ్డి, డీఈలు వేణుగోపాల్, ప్రభాకర్, ఏజెన్సీ ప్రతినిధులు తదితరులున్నారు.
ఆర్‌అండ్‌ఆర్ కాలనీ పనులను మిషన్‌మోడ్‌లో పూర్తి చేద్దాం
ముట్రాజ్‌పల్లి ఆర్‌అండ్‌ఆర్ కాలనీ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ వెంకట్రామారెడ్డి అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులను ఆదేశించారు. గజ్వేల్ ఆర్డీవో కార్యాలయంలో శుక్రవారం జిల్లా అదనపు కలెక్టర్ పద్మాకర్‌తో కలిసి ముట్రాజ్‌పల్లి ఆర్‌అండ్‌ఆర్ కాలనీ నిర్మాణ పనుల పురోగతిపై అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. అధికార యంత్రాంగం అంతా కలిసి ఒక మిషన్‌మోడ్‌లో టీమ్‌వర్క్‌గా పనిచేద్దామని అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులకు కలెక్టర్ సూచించారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ ఆర్‌అండ్‌ఆర్ కాలనీ గృహా నిర్మాణాలు చేపట్టాలని ఏజెన్సీ ప్రతినిధులను కలెక్టర్ ఆదేశించారు. కాలనీలో మిషన్ భగీరథ పనులు, విద్యుత్ సరఫరా పనులను ముమ్మరం చేయాలని అధికారులకు సూచించారు. అంతర్గత మురికికాలువలు, సీవరేజీ పైపులైన్లు, స్ట్రామ్ వాటర్, ఇంటర్నల్ రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ, సీసీ రోడ్లు తదితర అంశాలపై చర్చించారు. ముట్రాజ్‌పల్లి ఆర్‌అండ్‌ఆర్ కాలనీ నిర్మాణ పనులను వివిధ దశల్లో ఉన్న ఇళ్ల నిర్మాణ పనులు, వాటి తీరుతెన్నులు నిర్మాణ పనుల పురోగతిపై ఏజెన్సీలతో సుదీర్ఘంగా చర్చించారు. ఇప్పటిదాకా చేపట్టిన, చేపట్టాల్సిన లక్ష్యాలకు అనుగుణంగా సైట్ ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. సమీక్షా సమావేశంలో గజ్వేల్ ఆర్డీవో విజయేందర్‌రెడ్డి, పంచాయతీరాజ్ ఎస్‌ఈ కనకరత్నం, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ శ్రీనివా్‌సచారి, ఈఈ రాజయ్య, డీఈ నాగభూషణం, పీఆర్ డీఈ ప్రభాకర్, ఏజెన్సీ ప్రతినిధులు తదితరులున్నారు.