రెండు పార్టీల్లో నైరాశ్యం
ABN , First Publish Date - 2020-10-04T10:36:49+05:30 IST
ఉమ్మడి రాష్ట్రంలో బలమైన పార్టీలుగా వెలుగొంది దశల వారీగా అధికారాన్ని పంచుకున్న పార్టీలు ఇప్పుడు పూర్తిగా ప్రభావాన్నీ
దుబ్బాకలో గత ప్రాభవాన్ని కోల్పోయిన టీడీపీ, కాంగ్రెస్
నియోజకవర్గంలో ఉనికే లేని తెలుగుదేశం
హస్తం పార్టీలో నాయకత్వ సమస్య
ఉప ఎన్నిక బరిలో నిలిచేందుకు అగచాట్లు
దుబ్బాక, అక్టోబరు 3 : ఉమ్మడి రాష్ట్రంలో బలమైన పార్టీలుగా వెలుగొంది దశల వారీగా అధికారాన్ని పంచుకున్న పార్టీలు ఇప్పుడు పూర్తిగా ప్రభావాన్నీ కోల్పోయాయి. వెలుగు వెలిగిన చోటే చీకటిలోకి వెళ్లిపోతున్నాయి. సరైన నాయకత్వం లేక, కార్యకర్తలను పట్టించుకునే నాఽథుడు కరువై టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు వెలవెలపోతున్నాయి. దుబ్బాక ఉప ఎన్నికల బరిలో నిలిచేందుకు అగచాట్లు పడుతున్నాయి. ఇక్కడ తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఉనికిని కోల్పోగా, కాంగ్రెస్ సైతం ఏ మాత్రం ప్రభావం చూపించలేని దుస్థితికి దిగజారింది. ఉమ్మడి జిల్లాలో దుబ్బాక (అప్పటి దొమ్మాట) నుంచి కాంగ్రెస్ పార్టీ ఐదు పర్యాయాలు గెలిపొంది బలమైన పార్టీగా నిలవగా, దానిని దెబ్బతీస్తూ టీడీపీ కూడా నాలుగు పర్యాయాలు ఏకఛత్రాధిపత్యాన్ని కొనసాగించింది. చివరికి తెలంగాణ ఉద్యమంతో టీడీపీ దుబ్బాకలో మొత్తానికే కనుమరుగైంది. ఎంతోకొంత నాయకత్వం, కార్యకర్తలు ఉన్న కాంగ్రెస్ ఉనికిని చాటుకునేందుకు ఆపసోపాలు పడుతున్నది. ఈ రెండు పార్టీలు ప్రస్తుతం ఎన్నికల్లో సొంతంగా పోటీ చేయలేని దుస్థితికి చేరుకున్నాయి.
గతంలో వెలుగు వెలిగిన టీడీపీ, కాంగ్రెస్
ఒకప్పుడు దుబ్బాక, సిద్దిపేట నియోజకవర్గాల్లో కాంగ్రెస్, టీడీపీ బలంగా ఉండేవి. ఈ రెండు పార్టీల మధ్య ప్రధాన పోటీ కొనసాగేది. ప్రస్తుతం టీడీపీ రాజకీయంగా గణనీయమైన ప్రభావం చూపగల శక్తిని కోల్పోగా, కాంగ్రె్‌సకు సరైన నాయకత్వం లేక డీలా పడుతోంది. మొదట దొమ్మాట నియోజకవర్గంగా ఉన్న 1962లో ఖాజీమైనోద్దీన్ ఇక్కడి నుంచి కాంగ్రెస్ జెండాను ఎగుర వేశారు. నాడు కమ్యూనిస్టు పార్టీ ప్రభావం గల దొమ్మాటను కాంగ్రెస్ కంచుకోటగా మలుచుకున్నది. 1967లో ఇక్కడి నుంచి స్వతంత్య్ర అభ్యర్థిగా బీంరెడ్డి గెలుపొందినా కూడా అనంతరం వరుసగా కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటూ వచ్చింది. 1972లో సోలిపేట రామచంద్రారెడ్డి, ఆ తరువాత 1978, 1982లో ఐరేణి లింగయ్య కాంగ్రెస్ పార్టీ నుంచే గెలుపొందారు. 1982లో టీడీపీ గాలి వీస్తున్నా ప్రతికూల పరిస్థితిలోనూ దుబ్బాక(దొమ్మాట), సిద్దిపేటను కాంగ్రెస్ గెలుచుకున్నది. దొమ్మాటలో ఐరేణి లింగయ్య, సిద్దిపేటలో అనంతుల మదన్‌మోహన్ గెలిచారు.
అనంతరం 1985లో జరిగిన ఎన్నికల్లో డి.రామచంద్రారెడ్డి టీడీపీ నుంచి గెలుపొందారు. అనంతరం టీడీపీ బలమైన క్యాడర్‌ను నిర్మించుకున్నది. కాంగ్రెస్ కంచుకోటను బద్దలు కొట్టి 1989, 1994, 1999లో టీడీపీ నుంచి చెరుకు ముత్యంరెడ్డి అప్రతిహతంగా విజయ బావుటను ఎగరేశారు. స్థానిక సంస్థల్లో ఆయన బలమైన క్యాడర్‌ను నిర్మించారు. 2001లో టీఆర్‌ఎస్ ఆవిర్భావం అనంతరం టీడీపీ ప్రభావాన్ని కోల్పోతూ వచ్చింది. నియోజకవర్గంలో స్థానిక ఎన్నికల్లో అప్పటి ఐదు మండలాల్లో టీఆర్‌ఎస్ విజయబావుట ఎగరేసింది. అదే ఊపుతో 2004లో టీఆర్‌ఎస్ అభ్యర్థి సోలిపేట రామలింగారెడ్డిని గెలిపించింది. అప్పటికీ టీడీపీ క్షేత్రస్థాయిలో ఉనికిని కోల్పోలేదు. 2005లో మళ్లీ టీడీపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో బలాన్ని చాటుకున్నది. 2008లో రామలింగారెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉపఎన్నికలో బరిలో దిగగా, చెరుకు ముత్యంరెడ్డి(టీడీపీ)పై స్వల్ప మెజార్టీతో గెలుపొందారు.
2009లో మహాకూటమి ఏర్పాటుతో దుబ్బాక నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థిగా సోలిపేట రామలింగారెడ్డి(టీఆర్‌ఎ్‌స)కు కేటాయించడంతో చెరుకు ముత్యంరెడ్డి చివరి క్షణంలో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగి గెలుపొందారు. అప్పటికీ చాలా మంది టీడీపీ శ్రేణులు, చెరుకు ముత్యంరెడ్డి అభిమానులు కాంగ్రెస్ వైపు వచ్చారు. అప్పటి నుంచి దుబ్బాకలో టీడీపీకి ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి. తెలుగదేశం ఉనికి కోల్పోతూ వచ్చింది. తర్వాత 2014 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ముత్యంరెడ్డి, టీఆర్‌ఎస్ నుంచి సోలిపేట రామలింగారెడ్డి తలపడగా సోలిపేట నెగ్గారు. ఇక 2018లో కాంగ్రెస్ పార్టీ ఇక్కడి నుంచి అనూహ్యంగా కొత్త ముఖాన్నీ రంగంలోకి దింపింది. నాగేశ్వర్‌రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించడంతో క్షేత్రసాయి కార్యకర్తలు ముత్యంరెడ్డి వెంట టీఆర్‌ఎ్‌సలో చేరారు. దీంతో కాంగ్రె్‌సకు కోలుకోలేని దెబ్బ పడింది. హస్తం పార్టీకి కార్యకర్తలు బలం సన్నగిల్లింది. ఒక్కప్పుడు ప్రబల శక్తిగా వెలిగిన కాంగ్రెస్, టీడీపీ ప్రస్తుతం ఉప ఎన్నికలో బరిలో దిగడానికి అగచాట్లు పడుతున్నాయి.