ఆన్‌లైన్‌ పర్యవేక్షణ బాధ్యత ఉపాధ్యాయులదే

ABN , First Publish Date - 2020-12-14T04:33:48+05:30 IST

మెదక్‌ అర్బన్‌, డిసెంబరు 13 : కొవిడ్‌ నేపథ్యంలో ప్రభుత్వ బడుల విద్యార్థులకు ఆన్‌లైన్‌లోనే తరగతులు నిర్వహిస్తున్న విషయం విధితమే. మూడు నెలలుగా టీ-శాట్‌, దూరదర్శన్‌ ద్వారా ప్రసారాలను దాదాపు 60 శాతం మంది విద్యార్థులు మాత్రమే వింటున్నారని ఉపాధ్యాయులు ఇచ్చే నివేదికలు చెబుతున్నాయి.

ఆన్‌లైన్‌ పర్యవేక్షణ బాధ్యత ఉపాధ్యాయులదే
బూర్గుపల్లిలో ఆన్‌లైన్‌ తరగతులపై విద్యార్థుల సందేహాలను నివృత్తి చేస్తున్న ఉపాధ్యాయుడు (ఫైల్‌)

ప్రతి విద్యార్థీ పాఠాలు వినేలా చూడాలి

అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు 

ఆదేశాలు జారీచేసిన విద్యాశాఖ 

మెదక్‌ అర్బన్‌, డిసెంబరు 13 : కొవిడ్‌ నేపథ్యంలో ప్రభుత్వ బడుల విద్యార్థులకు ఆన్‌లైన్‌లోనే తరగతులు నిర్వహిస్తున్న విషయం విధితమే. మూడు నెలలుగా టీ-శాట్‌, దూరదర్శన్‌ ద్వారా ప్రసారాలను దాదాపు 60 శాతం మంది విద్యార్థులు మాత్రమే వింటున్నారని ఉపాధ్యాయులు ఇచ్చే నివేదికలు చెబుతున్నాయి. అయితే పూర్తిస్థాయిలో వినకపోవడంతో విద్యార్థులు భవిష్యత్‌లో ఇబ్బందిపడుతారని గుర్తించిన విద్యాశాఖ ప్రత్యేక ప్రణాళికలను రూపొందించింది. ప్రతీ విద్యార్థి ఆన్‌లైన్‌ క్లాసులు వినేలా పర్యవేక్షించే బాధ్యతను ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు అప్పగించింది. వీరు పాఠశాలలో చదివే విద్యార్థులు ఆన్‌లైన్‌ తరగతులు వింటున్నారా.. లేదా అనేది ఫోన్‌ ద్వారా పర్యవేక్షించాల్సి ఉంటుంది. వీటితో పాటు వర్క్‌షీట్లపై దృష్టిసారించాలని సూచనలు చేసింది. విద్యార్థులకు వర్క్‌షీట్లు ఇచ్చి వారితో నింపించేలా చూడాలని పేర్కొంది. ఆన్‌లైన్‌ పాఠాల నిర్వహణ, వర్క్‌షీట్లపై అలసత్వం వహిస్తే శాఖాపరమైన చర్యలు ఉంటాయని విద్యాశాఖ అధికారులు హెచ్చరించడంతో ఆన్‌లైన్‌ తరగతులను పకడ్బందీగా నిర్వహించేలా ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టిసారించారు. ప్రతి టీచర్‌ ప్రొఫార్మాలను సిద్ధం చేసుకోవాలి. విద్యార్థి పేరు, ఫోన్‌ నంబరు, తరగతి సేకరించుకోవాలి. విద్యార్థికి ఫోన్‌ చేసినప్పుడు టీవీ, ఫోన్‌, ఇతరుల వద్ద ఎలా పాఠ్యాంశాలు వింటున్నారో నమోదు చేయాలి. వర్క్‌షీట్లు పూర్తి చేస్తున్నారా.. లేదా అని పర్యవేక్షించాలి.  ఆన్‌లైన్‌ పాఠాలు వందశాతం మంది విద్యార్థులు చూసేలా పరిశీలించే బాధ్యత ఉపాధ్యాయులకు అప్పగించారు. జిల్లాలో మొత్తం 872 పాఠశాలలుండగా.. 608 ప్రాఽథమిక, 125 ప్రాథమికోన్నత, 139 ఉన్నత పాఠశాలలున్నాయి. ఇందులో 64,308 మంది విద్యార్థులు చదువుతున్నారు. 

ఆదేశాలు ఇలా

- ఆన్‌లైన్‌ తరగతులకు సంబంధించి రోజు ప్రతీ ప్రధానోపాధ్యాయుడు సమయపాలనను ఉపాధ్యాయులకు పంపించాలి. 

- ప్రతీ ఉపాధ్యాయుడు టీ-శాట్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.

- పాఠ్యాంశాల ప్రసారాల సమయంలో విద్యార్థులు పొలం, ఇతర పనులకు వెళ్లకుండా చూడాలి. తల్లిదండ్రులను సంప్రదించాలి.

- ఉపాధ్యాయులు ఆన్‌లైన్‌లో వచ్చే పాఠాలను వినాలి, అప్పుడే విద్యార్థులకు వచ్చే సందేహాలను నివృత్తి చేయవచ్చు. 

- పాఠానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలను ప్రత్యేక పుస్తకంలో నమోదు చేసుకోవాలి.

- ప్రతిరోజు వాట్స్‌పలో వర్క్‌షీట్లను పంపించాలి. విద్యార్థులు పూర్తిచేసిన తర్వాత తెప్పించుకుని మూల్యాంకనం చేయాలి.

- విద్యార్థుల తల్లిదండ్రులకు, విద్యార్థులకు ఉపాధ్యాయులు ప్రతిరోజు ఫోన్‌చేసి పర్యవేక్షించాలి.

- చదువులో వెనుకబడిన వారిని గుర్తించి దత్తత తీసుకోవాలి. పూర్తి వివరాలు రిజిస్టర్‌లో నమోదు చేయాలి. 

Updated Date - 2020-12-14T04:33:48+05:30 IST