సమయపాలన పాటించకుంటే సస్పెన్షన్‌

ABN , First Publish Date - 2020-11-19T05:51:37+05:30 IST

అధికారుల పని తీరుపై కలెక్టర్‌ హన్మంతరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్‌ తప్పదని హెచ్చరించారు.

సమయపాలన పాటించకుంటే సస్పెన్షన్‌
హత్నూరలో రైతు వేదిక నిర్మాణ పనులను పరిశీలిస్తున్న కలెక్టర్‌ హన్మంతరావు

అధికారుల తీరుపై కలెక్టర్‌ ఆగ్రహం

కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులను ఇబ్బందులు పెడితే చర్యలు తప్పవన్న హన్మంతరావు


హత్నూర, నవంబరు 18: అధికారుల పని తీరుపై కలెక్టర్‌ హన్మంతరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్‌ తప్పదని హెచ్చరించారు. మండల కేంద్రమైన హత్నూరలో బుధవారం రైతు వేదిక నిర్మాణం పనులను పరిశీలించిన అనంతరం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. రైతు వేదిక పనులు పరిశీలనకు కలెక్టర్‌ వస్తున్నారని తహసీల్దార్‌కు ముందస్తు సమాచారం ఇచ్చినా.... సమయానికి అందుబాటులో లేకపోవడంతో అసహనానికి గురయ్యారు. కలెక్టర్‌ స్థాయి అధికారి వచ్చినా అందుబాటులో ఉండవా? అంటూ ఆ తర్వాత వచ్చి న తహసీల్దార్‌ జయరాంపై కలెక్టర్‌ మండిపడ్డారు. ఇక్కడ ఇష్టం లేకపోతే దూర ప్రాంతానికి బదిలీ చేస్తానని మందలించారు. అధికారులు సమయపాలన పాటించకపోవడంతో పాటు విధులపై నిర్లక్ష్యం వహిస్తే సస్పెండ్‌ చేస్తానని ఆయన హెచ్చరించారు. రైతు వేదిక నిర్మాణం పనులు నాలుగు రోజుల్లో పూర్తి చేయాలని అధికారులకు సూచిస్తుండగా.. వారం రోజుల సమయం కావాలని బదులు ఇవ్వడంతో మరింత ఆగ్రహానికి లోనైన కలెక్టర్‌ పీఆర్‌ఏఈ సురే్‌షకుమార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పని చేయడం చేతకాకపోతే మరో ప్రాంతానికి బదిలీ చేయాల్సి వస్తుందన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్‌ పరిశీలించి, అక్కడున్న రైతులతో మాట్లాడగా, ధాన్యం నింపేందుకు గన్నీ బ్యాగులు మూడు రోజులుగా లేవని రైతులు కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వెంటనే అక్కడున్న నిర్వాహకులను అడిగి తెలుసుకొని గన్నీ బ్యాగుల జిల్లా ఇన్‌చార్జి డీఎం మల్లేశంతో ఫోన్‌లో మాట్లాడారు. ఎందుకు గన్నీ బ్యాగులు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమాషా చేస్తున్నారా..? జిల్లాలో రైతులకు ఇబ్బందిలేకుండా గన్నీ బ్యాగులను అందుబాటులో ఉంచినా, ఎందు కు కొనుగోలు కేంద్రాలకు ఇవ్వడం లేదని మందలించారు. ధాన్యం కొనుగోలు కూడా ఆలస్యం జరుగుతుందని రైతులు కలెక్టర్‌కు మొరపెట్టుకున్నారు. ఎందుకు ఆలస్యం అవుతుందని నిర్వాహకులను నిలదీశారు. తూకం మిషన్‌ ఒకటే ఉండడం వల్ల ఇబ్బంది అవుతుందని చెప్పారు. వెంటనే కలెక్టర్‌ జిల్లా స్థాయి అధికారులకు ఫోన్‌ చేసి రెండు గంటల్లో తూకం యంత్రాన్ని పంపించాలని ఆదేశించారు. ఒక ధాన్యం బస్తా 42కేజీలు తూకం వేస్తున్నారని, రైతులు కలెక్టర్‌ దృష్టికి తీసుకురాగా ధాన్యంలో తాలు అధికంగా ఉండడం వల్ల బస్తాకు 41.5 కేజీల ధాన్యాన్ని మాత్రమే తూకం వేయాలని కలెక్టర్‌ సూచించారు. జిల్లాలో ఎక్కడైనా ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బంది కలిగిస్తేచర్యలు తప్పవని పేర్కొన్నారు. దొడ్డు రకం ధాన్యంతో పాటు సన్నరకం వడ్లను కూడా కొనుగోలు చేయాలని నిర్వాహకులను కలెక్టర్‌ హన్మంతరావు ఆదేశించారు. అనంతరం మండలంలోని చింతల్‌చెర్వు రైతు వేదిక నిర్మాణం పనులను పరిశీలించారు. కలెక్టర్‌ వెంట తహసీల్దార్‌ జయరాంనాయక్‌, ఏఈ సురే్‌షకుమార్‌, ఆర్‌ఐ సిద్దిరాంరెడ్డి, ఐకేపీ ఏపీఎం శ్రీలత, సర్పంచ్‌ సుధాకర్‌ తదితరులు ఉన్నారు. 


భూసేకరణను వేగవంతం చేయాలి

సంగారెడ్డి టౌన్‌, నవంబరు 18 : జిల్లాలో వివిధ ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్‌ హన్మంతరావు సంబంధిత అధికారులకు ఆదేశించారు. బుధవారం నిమ్జ్‌, టీఎ్‌సఐఐసీ, జాతీయ రహదారులు, ఆర్‌అండ్‌బీ, కాళేశ్వరం ప్రాజెక్టు కాలువకు సంబంధించి భూసేకరణ పురోగతిపై సంబంధిత అధికారులతో కలెక్టర్‌ సమీక్షించారు.  భూసేకరణ ప్రక్రియను త్వరగా పూర్తి చేయడంలో ఆయా అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. ఈ సమీక్షలో అదనపు కలెక్టర్‌ వీరారెడ్డి, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.


గ్రామాల అభివృద్ధిలో కార్యదర్శులే కీలకం

కోహీర్‌, నవంబరు18: గ్రామాల అభివృద్ధిలో పంచాయతీ కార్యదర్శులే కీలకమని కలెక్టర్‌ హన్మంతరావు అన్నారు. బుధవారం మండల కేంద్రమైన కోహీర్‌లోని ఎంపీపీ కార్యాలయంలో ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులకు, వివిధ ప్రభుత్వశాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పాల్గొని కలెక్టర్‌ మాట్లాడారు. పంచాయతీ కార్యదర్శులు ప్రతీ అభివృద్ధి పనిని చాలెంజ్‌గా తీసుకొని పూర్తిచేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్‌ సీఈవో ఎల్లయ్య, డీఆర్డీవో శ్రీనివా్‌సరావు, ఆర్డీవో రమే్‌షబాబు, డీఎల్పీవో రాఘవులు, ఎంపీవో వెంకట్‌రెడ్డి తదితరులు ఉన్నారు. 

Updated Date - 2020-11-19T05:51:37+05:30 IST