విద్యార్థులు తెలంగాణ పేరు నిలబెట్టాలి
ABN , First Publish Date - 2020-12-17T05:56:19+05:30 IST
అటవీ కళాశాల విద్యార్థులు తెలంగాణ పేరును అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టాలని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆకాంక్షించారు. సిద్దిపేట జిల్లా ములుగు మండల కేంద్రంలోని ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఎఫ్‌సీఆర్‌ఐ)లో బీఎస్సీ ఫారెస్ర్టీ కోర్సు పూర్తి చేసిన 49మంది మొదటి బ్యాచ్ విద్యార్థులకు మంత్రులు హారీశ్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి డిగ్రీ పట్టాలను బుధవారం ప్రదానం చేశారు.

అంతర్జాతీయ స్థాయిలో రాణించి ఉన్నత స్థితిలో నిలవాలి
రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు
రాష్ట్రంలో 214 కోట్ల మొక్కలను నాటాం
అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి
ములుగు/గజ్వేల్, డిసెంబరు 16: అటవీ కళాశాల విద్యార్థులు తెలంగాణ పేరును అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టాలని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆకాంక్షించారు. సిద్దిపేట జిల్లా ములుగు మండల కేంద్రంలోని ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఎఫ్‌సీఆర్‌ఐ)లో బీఎస్సీ ఫారెస్ర్టీ కోర్సు పూర్తి చేసిన 49మంది మొదటి బ్యాచ్ విద్యార్థులకు మంత్రులు హారీశ్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి డిగ్రీ పట్టాలను బుధవారం ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడారు. ఈ కాలేజీకి వస్తే ప్రపంచ శ్రేణి విద్యాసంస్థలకు వచ్చిన అనుభూతి కలుగుతుందన్నారు. అధునాతన సదుపాయాలున్న ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఎఫ్‌సీఆర్‌ఐ)ను విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దేందుకు అనువుగా ఉందన్నారు. మొదటి బ్యాచ్ విద్యార్థులుగా ఓ ప్రత్యేకత ఉంటుందని, అదే సమయంలో బాధ్యతలు కూడా ఉంటాయని చెప్పారు. ఉన్నత విద్య కోసం బయటకు వెళ్లే విద్యార్థులు తిరిగి బోధకులు, ఇతర మార్గాల ద్వారా కళాశాల అభివృద్ధికి తమవంతు సహకారం అందించాలన్నారు. ఈ కళాశాలలో తెలంగాణలోని అన్ని జిల్లాలకు చెందిన విద్యార్థులు ప్రవేశాలు పొందారని, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అటవీ విద్యను అందించాలన్న తమ లక్ష్యం నెరవేరిందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ వ్యాప్తంగా హరితహారం కార్యక్రమంలో 230 కోట్ల మొక్కలను నాటడం లక్ష్యంగా నిర్దేశించుకున్నామన్నారు. ఇప్పటి వరకు 214 కోట్ల మొక్కలను నాటినట్లు వెల్లడించారు. గతంలో తెలంగాణలో 23శాతంగా ఉన్న అటవీ విస్తీర్ణం 33శాతానికి పెరిగిందని చెప్పారు. ఎఫ్‌సీఆర్‌ఐలో విద్యను పూర్తి చేసుకున్న విద్యార్థులు తెలంగాణ రాష్ట్రంలో జీవవైవిధ్యాన్ని పెంపొందించేందుకు క్రియాశీలక పాత్ర పోషించాలని సూచించారు. వివిధ రంగాల్లో అత్యున్నత ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు, జ్ఞాపికను మంత్రి అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్ వంటేరు ప్రతా్‌పరెడ్డి, అటవీ శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, పీసీసీఎఫ్ ఆర్. శోభ, సీఎం ఓఎస్డీ ప్రియాంకవర్గీస్, జిల్లా అదనపు కలెక్టర్ ముజామిల్‌ఖాన్, కాలేజ్ డీన్ చంద్రశేఖర్‌రెడ్డి, ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్ట్రార్ గోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.
