నా వంతు ఎప్పుడొస్తదో!

ABN , First Publish Date - 2020-05-10T10:03:26+05:30 IST

ఆరుగాలం శ్రమించి పండించిన వడ్లు అమ్ముకోవడానికి అన్నదాతకు అరిగోస తప్పడం లేదు. ఊరూరా కొనుగోలు

నా వంతు ఎప్పుడొస్తదో!

కేంద్రాల్లో పేరుకుపోయిన ధాన్యం నిల్వలు

మెదక్‌ జిల్లాలో పలుచోట్ల నిలిచిన కొనుగోళ్లు

మిల్లర్ల మాయాజాలం.. ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం

సేకరించిన ధాన్యం తరలింపులో కాలయాపన

రోజుల తరబడి అన్నదాతల పడిగాపులు

అకాల వర్షంతో మొలకెత్తుతున్న ధాన్యం

బస్తాకు రూ.2 చొప్పున వసూలు చేస్తున్న లారీ డ్రైవర్లు

రైతుల నెత్తిన భారం.. పట్టించుకోని అధికారులు


ఆంధ్రజ్యోతి ప్రతినిధి, మెదక్‌, మే 9 : ఆరుగాలం శ్రమించి పండించిన వడ్లు అమ్ముకోవడానికి అన్నదాతకు అరిగోస తప్పడం లేదు. ఊరూరా కొనుగోలు కేంద్రాలు తెరిచాం..ప్రతి గింజనూ కొంటాం.. అని ప్రభుత్వం చెప్తున్నా! రైతులు మాత్రం రోజుల తరబడి కేంద్రాల్లో పడిగాపులు పడుతున్నారు. రైస్‌ మిల్లర్ల మాయాజాలం.. టాన్స్‌పోర్టు కార్మికుల నిర్లక్ష్యం కారణంగా కేంద్రాల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోతున్నాయి. దీంతో పలుచోట్ల కొనుగోళ్లను నిలిపివేశారు.  మరోవైపు పగబట్టినట్లు వానలు వెంటపడడంతో ఆరు నెలల కష్టం నీటి పాలవుతోంది. కేంద్రాల్లోనే ధాన్యం మొలకలు వస్తున్నది. రైతులు ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ తమ నంబర్‌ కోసం ఎదురుచూస్తూ కుప్పల దగ్గర కావలి కాస్తున్నారు. 


మెదక్‌ జిల్లాలో రబీ సీజన్‌లో 205 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు లక్ష 20వేల మెట్రిక్‌ టన్నుల పంట సేకరించారు. కానీ క్షేత్రస్థాయిలో ధాన్యం అమ్మడానికి రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. మిల్లర్ల మాయాజాలం.. అధికారుల నిర్వాకంతో తీవ్రంగా నష్టపోతున్నారు. అకాల వర్షాలతో కేంద్రాల్లోనే ధాన్యం మొకలకలు వస్తున్నది. సేకరించిన ధాన్యాన్ని కస్టమ్‌ మిల్లింగ్‌ కోసం రైస్‌మిల్లులకు తరలించడంలో తీవ్ర జాప్యం జరుగుతుండడమే సమస్యలకు ముఖ్య కారణమవుతోంది. ధాన్యాన్ని మిల్లులకు రవాణా చేసే కాంట్రాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.


మెదక్‌ రెవెన్యూ డివిజన్‌ పరిధిలో రవాణా కాంట్రాక్ట్‌ను న్యూ హైదరాబాద్‌, మెదక్‌ ట్రాన్స్‌ ఫోర్ట్‌ కంపెనీ, తూప్రాన్‌, నర్సాపూర్‌ డివిజన్లకు సంబంధించి హనుమాన్‌ ట్రాన్స్‌ఫోర్ట్‌ సంస్థలకు అప్పగించారు. కానీ సరిపడా వాహనాలను సమకూర్చడంలో వారు విఫలమవడంతో కేంద్రాల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోతున్నాయి. మరోవైపు కేంద్రాల నుంచి వచ్చిన ధాన్యాన్ని మిల్లుల్లో అన్‌లోడ్‌ చేయడంలోనూ ఆలస్యం జరుగుతోంది. జిల్లాలో ఏ రైస్‌మిల్లు వద్ద చూసినా లారీలు బారులు తీరిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. దీంతో కేంద్రాల నిర్వాహకులు కొనుగోళ్లు నిలిపివేశారు. 


వెంటాడుతున్న అకాల వర్షాలు

అకాల వర్షాలు అన్నదాతను వెంటాడుతున్నాయి. కల్లాల్లో ధాన్యం నీటి పాలవుతోంది. కేంద్రాలకు తరలించిన ధాన్యం తడిసి మొలకలు వస్తున్నాయి. వర్షానికి ధాన్యం తడవకుండా కేంద్రాల్లో టార్పాలిన్లు అందుబాటులో లేవు. రైతులే సొంతంగా టార్పాలిన్లు తెచ్చుకుంటున్నారు. లేదంటే వానకు వడ్లు కొట్టుకుపోవాల్సిందే. అష్టకష్టాలు పడుతూ కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్న రైతులు కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని పలుచోట్ల ఆందోళనలు చేస్తున్నారు.


రైతుల నెత్తిన అదనపు భారం

ధాన్యాన్ని త్వరగా మిల్లులకు తరలించాలంటే బస్తాకు రూ.2 చొప్పున ఇవ్వాల్సిందేనని లారీ డ్రైవర్లు వసూళ్లకు పాల్పడుతున్నారు. ఎలాగోలా మిల్లుకు చేరితే చాలని అన్నదాతలు మారు మాట్లాడకుండా అడిగినంత ఇస్తున్నారు. ఒక్కో లారీలో 600 నుంచి 650 బస్తాల ధాన్యం రవాణా అవుతుంది. ఈ లెక్కన లారీకి రూ.1,200 రైతులు నష్టపోతున్నారు. ఇదంతా బహిరంగంగా జరుగుతున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు.


200 బస్తాలకు రూ. 400 ఇచ్చిన: నర్సింహులు, రైతు, అవుసులపల్లి

200 బస్తాల ధాన్యాన్ని కొనుగోలు కేంద్రంలో అమ్మిన. నాలుగు రోజులైనా మిల్లుకు తీసుకుపోలేదు. తొందరగా తీసుకుపోవాలంటే బస్తాకు రూ.2 ఇవ్వాలన్నరు. వాన పడితే వడ్లు తడుస్తయని రూ.400 ఇచ్చిన.


హమాలీలు లేక మిల్లుల వద్ద అన్‌లోడింగ్‌లో జాప్యం : రాజునాయక్‌, సివిల్‌ సప్లై సంస్థ అసిస్టెంట్‌ మేనేజర్‌ 

మిల్లులకు వద్ద తగినంత స్థలం, హమాలీలు లేక లారీలు అన్‌లోడింగ్‌ చేయడంలో జాప్యం జరుగుతోంది. కొన్నిచోట్ల సమస్యలున్నా సాధ్యమైనంత  వేగంగా కొనుగోళ్లు జరిగేలా చర్యలు తీసుకుంటున్నాం. రైతులకు ఇబ్బందులు లేకుండా చూస్తాం.


Updated Date - 2020-05-10T10:03:26+05:30 IST