ప్రమాణాలకు తిలోదకాలు
ABN , First Publish Date - 2020-11-25T06:14:28+05:30 IST
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పల్లె ప్రకృతివనాల ఏర్పాటు కార్యక్రమం మండలంలో అభాసుపాలవుతోంది.

మొక్కుబడిగా పల్లె ప్రకృతివనాలు
సమస్యగా మారిన స్థలాల లభ్యత
పలు గ్రామాల్లో జనావాసాలకు దూరంగా ఏర్పాటు
నిధుల దుర్వినియోగమే తప్ప ప్రయోజనం లేదంటున్న ప్రజలు
కోహెడ, నవంబరు 24: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పల్లె ప్రకృతివనాల ఏర్పాటు కార్యక్రమం మండలంలో అభాసుపాలవుతోంది. నిబంధనల మేరకు చేపట్టాల్సిన నిర్మాణం పనులను పలు గ్రామాల్లో తూతూ మంత్రంగా కానిచ్చేస్తున్నారు. ఆయా గ్రామాల్లో ప్రకృతివనాలకు అవసరమైన స్థలం లభించకపోవడంతో, అందుబాటులో ఉన్న కొద్దిపాటి విస్తీర్ణంలోనే పనులు చేస్తూ నాణ్యతకు తిలోదకాలిస్తున్నారు. కోహెడ మండలంలోని వరికోలు గ్రామంలో 10 గుంటల స్థలంలోనే పనులు కానిచ్చేస్తున్నారు. దీంతో ప్రజాధనం దుర్వినియోగమే తప్ప మరేమీ కాదని పలువురు విమర్శిస్తున్నారు.
నియోజకవర్గంలో నత్తనడకన పనులు
హుస్నాబాద్ నియోజకవర్గంలోని అనేక గ్రామ పంచాయతీల్లో అర ఎకరం, అంతలోపు స్థలాల్లోనే వనాలు నిర్మించడం గమనార్హం. వివరాల్లోకి వెళ్తే.. కోహెడ మండలంలో 29 ప్రకృతి వనాలు, హుస్నాబాద్‌లో 17వనాలు, అక్కన్నపేట మండలంలో 31 పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం జూలైలో ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటివరకు 69 స్థలాలు గుర్తించి నిర్మాణాలు చేపట్టారు. మరో ఎనిమిది చోట్ల స్థలాలు ఎంపిక కాకపోవడంతో పనులు మొదలు కాలేదు. పనులు నత్తనడకన నడుస్తుండంతో పకృతివనం పనులు అభాసుపాలవుతున్నాయి. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఒక ఎకరం స్థలం అందుబాటు లేనిపక్షంలో అర ఎకరం స్థలంలో పల్లెప్రకృతి వనాలను ఏర్పాటు చేయాలి. పట్టణ ప్రాంతాల మాదిరిగానే గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు పార్కులను అందుబాటులోకి తేవాలన్నదే అసలు లక్ష్యం. అయితే అసలు లక్ష్యాన్ని అధికారులు, ఆయా గ్రామాల ప్రతినిధులు గాలికి వదిలేశారు. పలు గ్రామాల్లో స్థలాల సమస్య కారణంగా 10 గుంటలు లేదా అంతకు లోపు స్థలాల్లోనే ప్రకృతివనాల నిర్మాణాలు చేపడుతున్నారు. అదీ గ్రామస్థులకు దూరంగా ఎక్కడో వనాలు నిర్మిస్తుండటంతో ప్రజలకు ఏమేరకు ఉపయోగపడుతుందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వనాల్లో ప్రభుత్వ నర్సరీల్లో పెంచిన మొక్కలను నాటించాల్సి ఉండగా మొక్కలు లేకపోవడంతో బయట కొనుగోలు చేసి మొక్కలను నాటుతున్నారు. కొనుగోలు చేసి మొక్కలు నాటామని చూపించడం ద్వారా నిధులు స్వాహాకు తావిచ్చినట్టవుతుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పలు మండలాల్లో స్థలాభావం
కోహెడ మండలం వరికోలు గ్రామంలో 10 గుంటల స్థలంలో వనం నిర్మాణం చేపట్టారు. ఇందులోనే వాకింగ్ ట్రాక్, అవసరమైన ఇతర నిర్మాణాలను చేపట్టడం ఎలా సాధ్యపడుతుందని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇంత చిన్న స్థలంలో వనం నిర్మిస్తే ప్రభుత్వ లక్ష్యం ఏమేరకు నెరవేరుతుందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మండలంలో 5 గ్రామాలు, హుస్నాబాద్ మండలంలో మూడు గ్రామాల్లో స్థల ఎంపిక సమస్యలతో పకృతి వనాల పనులు ఇంకా ప్రారంభం కాలేదు. కోహెడ మండలం బత్తులవానిపల్లి, గోట్లమిట్ట, కూరెల్ల, వెంకటేశ్వరపల్లి, చంచల్‌చెరువుపల్లి, హుస్నాబాద్ మండలంలో జిల్లెల్లగడ్డ, మహ్మదాపూర్, ఉమ్మాపూర్ గ్రామాల్లో స్థల సమస్యలతో వనాల పనులు ఇంకా ప్రారంభం కాలేదు.
లక్ష్యం నెరవేరేనా?
పల్లె ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలనే ఉద్ధేశంతో ఉపాధిహామీ పథకంలో భాగంగా ప్రకృతి వనాలను ఏర్పాటు చేస్తున్నారు. అర ఎకరంలో రూ. 2.50లక్షలు, ఎకరం స్థలంలో రూ. 6లక్షల నిధులను కేటాయిస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలోని 69 గ్రామాల్లో పనులు కొనసాగుతున్నాయి. ప్రకృతివనాల్లో వాకింగ్ చేసేందుకు ట్రాక్ నిర్మాణం చేపట్టాల్సి ఉంది. వివిధ రకాల మొక్కలు కూడా పెంచాల్సి ఉంది. సేద దీరేందుకు చెట్ల కింద ప్లాట్ ఫాంలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. పార్కు చుట్టూ ఫెన్సింగ్ కూడా తప్పనిసరి. 10 గుంటల లోపు స్థలంలో నిర్మాణాలు చేపడుతున్న వనాలకు ప్రభుత్వ రూపొందించిన మార్గదర్శకాలు సరిపోవు. దీంతో ప్రకృతివనాల నిర్మాణం అభాసుపాలయ్యే అవకాశం ఉంది. పనుల పర్యవేక్షణకు ఈజీఎస్, పంచాయతీరాజ్ శాఖ అధికారుల పర్యవేక్షణలో నిర్మాణాలు చేపడుతున్నారు. ఎకరం స్థలంలో నాలుగు వేల మొక్కలు, అర ఎకరం స్థలంలో రెండు వేల మొక్కలు నాటాలి. అయితే చిన్న స్థలాల్లో మొక్కుబడిగా చేస్తున్న ఈ తంతు ద్వారా నిధుల దుర్వినియోగం జరుగుతున్నదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
స్థల సమస్యలు ఉన్నాయి - శ్రీనివాసరెడ్డి, ఎంపీవో, కోహెడ
పల్లె ప్రకృతి వనం ఏర్పాటులో గ్రామాల్లో స్థలాలకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి. కొన్ని గ్రామాల్లో ప్రభుత్వ భూమి లేకపోవడంతో పనులు ప్రారంభం కాలేదు. కొన్నిచోట్ల మాత్రమే తక్కువ స్థలంలో వనాల నిర్మాణాలు మొదలుపెట్టాం.
