పకడ్బందీగా పదో తరగతి పరీక్షలు

ABN , First Publish Date - 2020-03-15T12:20:29+05:30 IST

జిల్లాలో ఈ నెల 19 వతేదీ నుంచి ఏప్రిల్‌ 6 వ తేదీ వరకు జరగనున్న పదో తరగతి

పకడ్బందీగా పదో తరగతి పరీక్షలు

పరీక్షా కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పన 

ఇన్‌చార్జి డీఈవో నాంపల్లి రాజేష్‌

సంగారెడ్డి అర్బన్‌, మార్చి 14 : జిల్లాలో ఈ నెల 19 వతేదీ నుంచి ఏప్రిల్‌ 6 వ తేదీ వరకు జరగనున్న పదో తరగతి పరీక్షలను పక్కాగా నిర్వహిస్తామని, ఇందు కోసం అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశామని ‘ఆంధ్రజ్యోతి’ ఇంటర్వ్యూలో జిల్లా ఇన్‌చార్జి విద్యాశాఖాధికారి నాంపల్లి రాజేష్‌ తెలిపారు.


జిల్లాలో ఎన్ని పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు ?

జిల్లాలో 112 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశాం. అందులో 22,038 మంది రెగ్యులర్‌, 143 మంది ప్రైౖవేటు విద్యార్థులు, మొత్తం 22,181 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.


ఎంత మంది సిబ్బందిని నియమించారు ?

112 మంది చీఫ్‌ సూపరింటెండెంటు,్ల 112 మంది డిపార్ట్‌మెంటల్‌ ఆఫీసర్లు, ఐదుగురు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌, 18 మంది రూట్‌ ఆఫీసర్లును నియమించాం.


పరీక్షా కేంద్రాల్లో సౌకర్యాల కల్పనకు తీసుకున్న చర్యలు ?

పరీక్ష కేంద్రాల్లో తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేశాం. విద్యార్థులు నేలపై కూర్చోకుండా బెంచీలు ఏర్పాటు చేస్తున్నాం. విద్యుత్‌ అంతరాయం కలుగకుండా విద్యుత్‌ శాఖ అధికారులను కోరాం. అన్ని పరీక్షా కేంద్రాల్లో ఏఎన్‌ఎం అందుబాటులో ఉంటారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు వచ్చేటప్పుడు, ఇంటికి వెళ్లెటప్పుడు ప్రత్యేక బస్సులను నడపాలని ఆర్టీసీ అధికారులను కోరాం. విద్యార్థులు హాల్‌టికెట్‌ చూపించి ఉచితంగా ప్రయాణించవచ్చు. 


మాస్‌ కాపీయింగ్‌ జరగకుండా తీసుకుంటున్న చర్యలు?

పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమల్లో ఉంటుంది. కేంద్రాల వద్ద జిరాక్స్‌ సెంటర్లను మూసివేస్తాం. జిల్లా వ్యాప్తంగా ఫ్లయింగ్‌, సిట్టింగ్‌ స్క్వాడ్‌ అఽధికారుల పర్యవేక్షణ ఉంటుంది. మాస్‌ కాపీయింగ్‌ పాల్పడితే చర్యలు తప్పవు. 


ఫీజులు చెల్లించాలని హాల్‌టికెట్లు ఇవ్వకుండా వేధించే ప్రైవేటు పాఠశాలలపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు ?

హాల్‌టికెట్ల జారీ విషయంలో ఇలాంటి సంఘటనలు గతంలో జరిగిన సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇంటర్‌ మాదిరిగానే ఈసారి ఆన్‌లైన్‌లో హాల్‌ టికెట్లు ఎక్కడి నుంచైనా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. విద్యార్థులు వెబ్‌సైట్‌ నుంచే నేరుగా డౌన్‌లోడ్‌ చేసుకునే వెసులుబాటును విద్యాశాఖ అధికారులు కల్పించారు.  


ఉత్తమ ఫలితాల సాధనకు తీసుకున్న చర్యలేమిటి? 

జిల్లా వ్యాప్తంగా ప్రేరణ తరగతులు నిర్వహించాం. గత డిసెంబర్‌ నుంచి ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించాం. ఫోకస్‌ కార్యక్రమం ద్వారా సుమారు 70 మంది విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి 10/10 జీపీఏ సాధన కోసం సిద్ధం చేశాం. విద్యార్థుల్లో ఆత్మ స్థైర్యం పెంచాం. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలి. ఈ సారి రాష్ట్రంలోనే జిల్లాను అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నాం.

Updated Date - 2020-03-15T12:20:29+05:30 IST