అంతర్జాతీయ క్రీడా పోటీల్లో విజేతగా నిలవాలి
ABN , First Publish Date - 2020-12-03T06:11:59+05:30 IST
అంతర్జాతీయ క్రీడా పోటీల్లో విజేతగా నిలవాలి

- కబడ్డీ పోటీలను ప్రారంభించిన మంత్రి హరీశ్‌రావు
సిద్దిపేటఅర్బన్/టౌన్, డిసెంబరు 2: రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ క్రీడా పోటీల్లో పాల్గొని విజేతలుగా నిలిచి సిద్దిపేట జిల్లాకు పేరు ప్రఖ్యాతలు తేవాలని క్రీడాకారులను రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు కోరారు. సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మినీగ్రౌండ్లో బుధవారం సాయంత్రం అండర్-14, అండర్-19 ఫుట్ బాల్ క్రీడల కోసం శిక్షణ పొందుతున్న క్రీడాకారులతో మంత్రి కాసేపు ముచ్చటించారు. అంతకు ముందు డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డితో కలిసి కబడ్డీ క్రీడాపోటీల కోసం ఏర్పాటు చేసిన లాంగ్ టర్మ్ శిక్షణా శిబిరాన్ని మంత్రి లాంఛనంగా ప్రారంభించారు. ఈ మేరకు సిద్దిపేట-గజ్వేల్ నియోజకవర్గ జట్ల మధ్య కబడ్డీ పోటీలను కాసేపు వీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడారు. సిద్దిపేట జిల్లాలోని వివిధ రంగాలైన కబడ్డీ, ఫుట్‌బాల్ క్రీడాకారులు ఉచిత శిక్షణా శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ శిక్షణా శిబిరం నిర్వహిస్తున్న కబడ్డీ జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు చిట్టి దేవేందర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి శివకుమార్, ఫుట్ బాల్ అసోసియేషన్ ప్రతినిధి అక్బర్ ను మంత్రి అభినందించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, ‘సుడా’ చైర్మన్ రవీందర్‌రెడ్డి, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.