అత్యాచారాలను అరికట్టేందుకు ప్రత్యేక చట్టం

ABN , First Publish Date - 2020-12-29T05:07:15+05:30 IST

బాలికలపై అత్యాచారాలను అరికట్టేందుకు ప్రత్యేక చట్టాన్ని ఏర్పాటు చేశామని జిల్లా రెండో అదనపు సెషన్స్‌ న్యాయమూర్తి, బాలల లైంగిక వేధింపుల ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి మైత్రేయి తెలిపారు.

అత్యాచారాలను అరికట్టేందుకు ప్రత్యేక చట్టం
సంగారెడ్డిలోని మహిళా ప్రాంగణంలో నిర్వహించిన అవగాహన సదస్సులో పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న అధికారులు

లైంగిక వేధింపులకు పాల్పడితే 20 ఏళ్ల జైలు 

జిల్లా రెండో అదనపు సెషన్స్‌ న్యాయమూర్తి మైత్రేయి

పిల్లలకు మంచి చెడులపై అవగాహన కల్పించాలి

అదనపు కలెక్టర్‌ రాజర్షి షా


సంగారెడ్డి రూరల్‌, డిసెంబరు 28 : బాలికలపై అత్యాచారాలను అరికట్టేందుకు ప్రత్యేక చట్టాన్ని ఏర్పాటు చేశామని జిల్లా రెండో అదనపు సెషన్స్‌ న్యాయమూర్తి, బాలల లైంగిక వేధింపుల ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి మైత్రేయి తెలిపారు. సంగారెడ్డిలోని మహిళా ప్రాంగణంలో సోమవారం నిర్వహించిన అవగాహన సదస్సులో బాలికలపై జరుగుతున్న లైంగిక దాడుల నివారణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రూపొందించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ లైంగిక వేధింపులకు గురైన వారు వారి మనుగడ మీద విలువలు కోల్పోతున్నారని, వారికి సమాజంలో సముచిత స్థానం కల్పించేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు. బాధితులు ఎవరైనా తమకు జరిగిన అన్యాయాన్ని నిర్భయంగా పోలీసులకు తెలపాలని సూచించారు. లైంగిక వేధింపులకు పాల్పడిన నిందితులకు 20 ఏళ్ల పాటు జైలు శిక్ష విధిస్తామని ఆమె స్పష్టం చేశారు. 


చట్టాల్లో అనేక మార్పులు వచ్చాయి

పిల్లలకు తల్లిదండ్రులు మంచి చెడులపై అవగాహన కల్పించాలని అదనపు కలెక్టర్‌ రాజర్షి షా అన్నారు. చట్టాల్లో అనేక మార్పులు వచ్చాయని, ముఖ్యంగా పోక్సో యాక్ట్‌ చట్టం వచ్చినానంతరం అనేక మార్పులు చోటు చేసుకున్నాయని పేర్కొన్నారు. నేరస్తులు ఎవరైనా శిక్షార్హులేనని, నేరం జరిగినట్లు తెలిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. 


పోక్సో చట్టం పై అవగాహన కల్పించాలి

బాలికలు, మహిళలపై లైంగిక దాడులు జరగకుండా ఉండేందుకు పోక్సో చట్టంపై విస్తృతంగా అవగాహన కల్పించాలని శిశు సంక్షేమ సంస్థ చైర్‌ పర్సన్‌ శివకుమారి అన్నారు. పిల్లల ప్రవర్తనలను తల్లిదండ్రులు గమనిస్తు ఉండాలని సూచించారు. ఫోక్సో చట్టం అమలులో పోలీసుల పాత్ర ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. ఈ సదస్సులో సీనియర్‌ న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆశాలత, మహిళా శిశు సంక్షేమాధికారి పద్మావతి, బీసీ సంక్షేమాధికారి కేశురాం, కౌముదిని, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-29T05:07:15+05:30 IST