జీహెచ్‌ఎంసీ శివారు ప్రాంతాలకు ప్రత్యేక నిధులు
ABN , First Publish Date - 2020-05-13T05:46:41+05:30 IST
జీహెచ్‌ఎంసీ పరిధిలోని శివారు డివిజన్లలో మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక నిధులు కేటాయిస్తామని జలమండలి ఎండీ దానకిషోర్ అన్నారు.

జలమండలి ఎండీ దానకిషోర్
పటాన్‌చెరు, మే 12 : జీహెచ్‌ఎంసీ పరిధిలోని శివారు డివిజన్లలో మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక నిధులు కేటాయిస్తామని జలమండలి ఎండీ దానకిషోర్ అన్నారు. మంగళవారం పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి దానకిషోర్‌తో సమావేశమై పలు సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా శివారు డివిజన్లలో వీకర్ సెక్షన్ కాలనీలు, బస్తీలలో భూగర్భ డ్రైనేజీ పనులకు నిధులు కేటాయించాలని కోరారు. తాగునీటి సరఫరాతో పాటు మురుగునీటి నియంత్రణ సైతం జలమండలి ఆధ్వర్యంలో కొనసాగుతున్నందున భూగర్భ డ్రైనేజీ పనులకు నిధులు ఇవ్వాలని ఎమ్మెల్యే అన్నారు.
పటాన్‌చెరులోని కటికె బస్తీలో ఇప్పటివరకు భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ లేదని, దీంతో అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం పొంచి ఉందని చెప్పారు. ఓపెన్ డ్రైనేజీల వల్ల పారిశుధ్య నిర్వహణ కష్టసాధ్యంగా మారిందని ఎండీకి ఎమ్మెల్యే వివరించారు. రూ.60 లక్షలతో భూగర్భ డ్రైనేజీ ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. ఎమ్మెల్యే విజ్ఞప్తిపై దానకిషోర్ సానుకూలంగా స్పందించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని శివారు డివిజన్లలో మౌలిక వసతుల కల్పనపై జలమండలి ప్రత్యేక దృష్టిపెట్టిందన్నారు. ముఖ్యంగా మురుగునీటి నిర్వహణపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించామని తెలిపారు. భూగర్భ డ్రైనేజీ ఏర్పాటుకు ప్రత్యేక నిధులు కేటాయిస్తామని హామీనిచ్చారు.