నా ఓటు ఎవరో వేశారు

ABN , First Publish Date - 2020-02-16T06:54:42+05:30 IST

నా ఓటు ఎవరో వేశారు

నా ఓటు ఎవరో వేశారు

  • టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌ నూర్‌జహాన్‌ బేగం ఆందోళన

నారాయణఖేడ్‌, ఫిబ్రవరి 15 : తమ ఓట్లు ఇతరులు వేశారని, టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. నారాయణఖేడ్‌ మున్సిపాలిటీలోని 14వ వార్డు కౌన్సిలర్‌ నూర్‌ జహాన్‌ బేగంకు సహకార సంఘాల ఎన్నికల్లో ఒకటో టీసీలో 35వ క్రమసంఖ్యతో ఓటు హక్కు ఉంది. ఆమె ఉదయం 10 గంటల ప్రాంతంలో ఓటు వేయడానికి రావడంతో అప్పటికే ఆమె ఓటును ఎవరో వేసినట్లు  అధికారులు తెలిపారు. దీంతో ఆమె తన ఓటును ఇతరులు ఏ విధంగా వేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఓటును వినియోగించుకునే అవకాశం కల్పించే వరకు కదలబోనని బైఠాయించారు. దీంతో ఆమెకు అధికారులు టెండర్‌ ఓటు ఇచ్చారు. ఇదే టీసీలో నారాయణఖేడ్‌ మున్సిపాలిటీకి చెందిన 7వ వార్డు కౌన్సిలర్‌ మామయ్య మూడ నర్సింలు 40వ క్రమసంఖ్యతో ఓటు హక్కు ఉన్నప్పటికీ, ఆయన ఓటును కూడా ఇతరులు వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన కూడా టెండర్‌ ఓటును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా కొద్దిసేపు అధికారులతో టీఆర్‌ఎస్‌ నాయకులు వాగ్వాదం చేశారు. కాగా పట్టణానికి చెందిన కట్టకింది సంగారెడ్డి ఆరు సంవత్సరాల క్రితం చనిపోయాడని, ఆయన పేరుతో ఉన్న ఓటును క్రమ సంఖ్య 14 ద్వారా ఇతరులు వేశారని, టీఆర్‌ఎస్‌ నాయకులు సంజీవరెడ్డి, రామక్రిష్ణ, నజీబ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Updated Date - 2020-02-16T06:54:42+05:30 IST