ఎన్నాళ్లకెన్నాళ్లకు !

ABN , First Publish Date - 2020-09-17T11:33:52+05:30 IST

పుల్కల్‌ మండలం సింగూరు ప్రాజెక్టుకు నాలుగేళ్ల తర్వాత భారీగా వరద నీరు వచ్చి చేరుతున్నది. గడిచిన రెండు మూడు రోజులుగా

ఎన్నాళ్లకెన్నాళ్లకు !

నాలుగేళ్ల తర్వాత సింగూరు ప్రాజెక్టులోకి భారీ వరద


పుల్‌కల్‌, సెప్టెంబరు 16 : పుల్కల్‌ మండలం సింగూరు ప్రాజెక్టుకు నాలుగేళ్ల తర్వాత భారీగా వరద నీరు వచ్చి చేరుతున్నది. గడిచిన రెండు మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు 27,064 క్యూసెక్కుల వరద నీరు కొత్తగా వచ్చి చేరింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ 523.600 మీటర్లు. 29.917 టీఎంసీలు సామర్థ్యం కలిగియున్నది. బుధవారం ఉదయం నాటికి ప్రాజెక్టులో 4.618 టీఎంసీలు నీటి నిల్వ ఉంది. సాయంత్రం 3 గంటల వరకు మరో 11,990 క్యూసెక్కుల వరద నీరు చేరింది. గడిచిన 24 గంటల్లో మొత్తం 27,064 క్యూసెక్కులకు చేరుకున్నది. గంటగంటకు నీటి మట్టం పెరుగుతుందని ప్రాజెక్టు డిప్యూటీ ఈఈ రామస్వామి, జేఈఈ మహిపాల్‌రెడ్డి వెల్లడించారు. గురువారం ఉదయం నాటికల్లా నీటి మట్టం గణనీయంగా పెరిగే అవకాశాలున్నాయని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.


బుధవారం సాయంత్రం నాటికి 516.100 మీటర్లకు 5.512 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. జిల్లాలో మంజీర నది పరీవాహక ప్రాంతాలైన జహీరాబాద్‌, నారాయణఖేడ్‌ ఏరియాల్లో భారీ వర్షం కురువడం వల్లనే ఇంత పెద్ద స్థాయిలో వరద నీరు వస్తున్నది. దీనికి తోడు కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుండి కూడా పెద్ద ఎత్తున వరద ప్రవాహం కొనసాగుతున్నది. మహారాష్ట్రలోని సైగాంవ్‌ వద్ద మంజీర నది ఐదు మీటర్ల ఎత్తులో వరద నీరు ప్రవహిస్తున్నదని అక్కడి నీటి పారుదల శాఖ సిబ్బంది ద్వారా సమాచారం అందింది. తెలంగాణలోకి ప్రవేశించే మంజీర నది మనూరు మండలం గౌడగాంజన్‌వాడ వద్ద నది తీరప్రాంతానికి తాకుతూ వరద నీరు ప్రవహిస్తున్నది. అనంతరం ఇదే మండలం పుల్‌కుర్తి దగ్గర వరద నీటి ఉధృతి మరింతగా పెరిగింది. దీంతో వరద నీరంతా నేరుగా ప్రాజెక్టు బ్యాక్‌ వాటర్‌లో కలుస్తున్నది. గడిచిన నాలుగేళ్లలో ప్రాజెక్టులోకి చెప్పుకోదగ్గ స్థాయిలో వరద నీరు వచ్చి చేరుతుండంతో నీటి పారుదల శాఖ అధికారులు, ప్రజలు, రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - 2020-09-17T11:33:52+05:30 IST