తెల్లాపూర్‌లో రెడీమిక్స్‌ కేంద్రాల సీజ్‌

ABN , First Publish Date - 2020-12-19T05:44:33+05:30 IST

తెల్లాపూర్‌ మున్సిపాలిటీ పరిధిలో ఎలాంటి అనుమతులు లేకుండా కొనసాగుతున్న రెడీమిక్స్‌ కేంద్రాలను అధికారులు సీజ్‌ చేశారు.

తెల్లాపూర్‌లో రెడీమిక్స్‌ కేంద్రాల సీజ్‌
అధికారులు సీజ్‌ చేసిన ఉస్మాన్‌నగర్‌లోని రెడీమిక్స్‌ కేంద్రం

రామచంద్రాపురం, డిసెంబరు 18: తెల్లాపూర్‌ మున్సిపాలిటీ పరిధిలో ఎలాంటి అనుమతులు లేకుండా కొనసాగుతున్న రెడీమిక్స్‌ కేంద్రాలను అధికారులు సీజ్‌ చేశారు. రెసిడెన్షియల్‌ జోన్‌లో ఎలాంటి కాలుష్య కారక పరిశ్రమలు నెలకొల్పరాదన్న నిబంధనలు ఉన్నప్పటికీ వాటిని బేఖాతారు చేస్తూ తెల్లాపూర్‌ మున్సిపల్‌ పరిధిలో రెడీమిక్స్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారని పలు మార్లు ‘ఆంధ్రజ్యోతి’ కథనాలను ప్రచురించింది. గురువారం రాత్రి రామచంద్రాపురం తహసీల్దార్‌ శివకుమార్‌, డిప్యూటీ తహసీల్దార్‌ విశ్వేశ్వర్‌, వీఆర్వో రాజమల్లేశం, కాలుష్య నియంత్రణ మండలి ఈఈ, స్థానిక పోలీసు అధికారులు, విద్యుత్‌ శాఖ ఏఈలు, భూగర్భ గనుల శాఖ అధికారులు రెడీమిక్స్‌ కేంద్రాల వద్దకు వెళ్లారు. అనుమతులు చూపాలంటూ రెడీమిక్స్‌ కేంద్రాల యాజమాన్యాలను కోరారు. ఎలాంటి అనుమతులు చూపకపోవడంతో కొల్లూరులో ఐదు, ఉస్మాన్‌నగర్‌లో ఒక రెడీమిక్స్‌ కేంద్రాన్ని అధికారులు సీజ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ పెద్దల అండదండలతో కొనసాగుతున్న రెడీమిక్స్‌ కేంద్రాలను కూడా అధికారులు సీజ్‌ చేయడంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2020-12-19T05:44:33+05:30 IST