రింగు రోడ్డుకు రూట్ మ్యాప్
ABN , First Publish Date - 2020-12-14T04:27:04+05:30 IST
సిద్దిపేట నియోజకవర్గం చుట్టూ ఔటర్ రింగు రోడ్డు నిర్మాణానికి చర్యలు వేగవంతమయ్యాయి. సరైన రూట్‌మ్యాప్ కోసం సర్వే చేపట్టడానికి ఆర్‌అండ్‌బీ అధికారులు సన్నద్ధమయ్యారు. రాజీవ్ రహదారి టు రాజీవ్ రహదారి అనుసంధానంగా ఏర్పాటయ్యే ఈ రహదారికి కేసీఆర్ మార్గ్‌గా నామకరణం చేశారు.

సర్వే నిర్వహణకు ఆర్‌అండ్‌బీ అధికారుల సన్నద్ధం
సిద్దిపేట చుట్టూ 76 కి.మీ.ల ఔటర్ రహదారి
21 గ్రామాల మీదుగా డబుల్ రోడ్డు
కేసీఆర్ మార్గ్‌గా నామకరణం
ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సిద్దిపేట, డిసెంబరు 13 : సిద్దిపేట నియోజకవర్గం చుట్టూ ఔటర్ రింగు రోడ్డు నిర్మాణానికి చర్యలు వేగవంతమయ్యాయి. సరైన రూట్‌మ్యాప్ కోసం సర్వే చేపట్టడానికి ఆర్‌అండ్‌బీ అధికారులు సన్నద్ధమయ్యారు. రాజీవ్ రహదారి టు రాజీవ్ రహదారి అనుసంధానంగా ఏర్పాటయ్యే ఈ రహదారికి కేసీఆర్ మార్గ్‌గా నామకరణం చేశారు. ఇది పూర్తయితే సిద్దిపేట, దుబ్బాక, హుస్నాబాద్, మానకొండూరు నియోజకవర్గాల ప్రజల రాకపోకలకు అనువుగా ఉంటుంది. వారికి దూర భారం కూడా తగ్గుతుంది.
సిద్దిపేట పట్టణానికి ప్రస్తుతం బైపాస్ రోడ్డు ఉంది. పెరుగుతున్న జనాభాతో ఈ రోడ్డు రద్దీగా మారింది. సిద్దిపేట చుట్టూ ఉన్న గ్రామాల ప్రజలు నేరుగా రాజీవ్ రహదారిలో ప్రవేశించాలంటే సరైన మార్గం లేదు. సిద్దిపేట పట్టణం మీదుగానే రాజీవ్ రహదారిపైకి చేరుతున్నారు. సింగిల్ రోడ్లు మాత్రమే ఉండడం రాకపోకలకు అంతరాయంగా మారింది. అందుకే ఔటర్ రింగు రోడ్డు నిర్మాణానికి మంత్రి హరీశ్‌రావు శ్రీకారం చుట్టారు.
76 కిలోమీటర్ల దూరం రూ.160 కోట్లతో నిర్మాణం
కరీంనగర్ టు హైదరాబాద్ రాజీవ్ రహదారి సిద్దిపేట పట్టణ శివారు మీదుగానే వెళ్తుంది. ఈ రహదారికి అనుసంధానిస్తూ రూ.160 కోట్లతో రింగు రోడ్డును నిర్మించాలని తలపెట్టారు. ప్రస్తుతమైతే డబుల్ రోడ్డుగా నిర్ణయించారు. హైదరాబాద్ నుంచి సిద్దిపేటలో ప్రవేశించడానికి ముందు రాజీవ్ రహదారి నుంచి పొన్నాల గ్రామంలోకి ఒక పంచాయతీ రాజ్ సింగిల్ రోడ్డు ఉంది. ఇక్కడ ప్రవేశించి కిష్టసాగర్, ఎన్‌సాన్‌పల్లి, వెంకటాపూర్, బుస్సాపూర్, ఇరుకోడ్, రాంపూర్, రావురూకుల, పుల్లూరు, మల్యాల, గంగాపూర్, మాచాపూర్, చిన్నకోడూరు, రామునిపట్ల, గోనెపల్లి, ఓబులాపూర్, పాలమాకుల, వెంకటాపూర్, తిమ్మాయిపల్లి, బంధారం గ్రామాల మీదుగా దుద్దెడ వద్ద హైదరాబాద్ వైపు రాజీవ్ రహదారికి అనుసంధానం చేయనున్నారు. దాదాపు 76 కిలోమీటర్ల దూరం ఈ రింగు రోడ్డు ఉంటుంది.
తగ్గనున్న దూరభారం..
ఈ రహదారి పూర్తయితే వాహనదారులకు దూర భారం తగ్గుతుంది. హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రం నుంచి హైదరాబాద్ వెళ్లాల్సి వస్తే సిద్దిపేట రాజీవ్ రహదారికి చేరాల్సిందే. అంటే 40 కిలోమీటర్ల దూరం ప్రయాణించాలి. ఇప్పుడు రింగు రోడ్డు పూర్తయితే నంగునూరు మండలం పాలమాకుల నుంచి టర్న్ చేసుకొని వెంకటాపూర్, తిమ్మాయిపల్లి, బంధారం గ్రామాల మీదుగా దుద్దెడ రాజీవ్ రహదారి చేరుకోవచ్చు. దీంతో 20 కి.మీ.ల దూర భారం తగ్గుతుంది. ఇలాగే సిద్దిపేట చుట్టూరా ఉన్న గ్రామాలకు లబ్ధి కలుగుతుంది.
ప్రస్తుతం ఈ రింగురోడ్డు పంచాయతీరాజ్ పరిధిలో ఉన్న సింగిల్ రోడ్లతో లింకు ఉంది. దీనిని ఆర్‌అండ్‌బీ పరిధిలోకి తీసుకొచ్చి డబుల్ రోడ్డు నిర్మిస్తారు. అంటే రహదారి వెడల్పుతోపాటు కొత్త మార్గాన్ని నిర్మించనున్నారు. త్వరలోనే ఓ ఏజన్సీకి సర్వే బాధ్యతలు అప్పగించనున్నారు. నిధులు కూడా మంజూరు కావడంతో త్వరలోనే రహదారి నిర్మాణ పనులు ప్రారంభమయ్యేలా మంత్రి హరీశ్‌రావు ప్రత్యేకంగా దృష్టి సారించారు.