సిద్దిపేటలో ఐటీ కంపెనీల ఏర్పాటుపై అమెరికా నుంచి స్పందించారు

ABN , First Publish Date - 2020-12-13T06:23:46+05:30 IST

సిద్దిపేట శివారులో ఐటీ పార్క్‌ కోసం భూమి పూజ చేసిన విషయం తెలిసి అమెరికా నుంచి తనకు ఫోన్లు వచ్చాయని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. తెలంగాణ ప్రాంతం నుంచి అమెరికాలో స్థిరపడిన వాళ్లు సిద్దిపేటలో తమ కంపెనీలను ఏర్పాటు చేయడానికి ముందుకొస్తున్నారని తెలిపారు.

సిద్దిపేటలో ఐటీ కంపెనీల ఏర్పాటుపై అమెరికా నుంచి స్పందించారు
ఐటీ కంపెనీ నిర్వాహకుడు రఘును సన్మానిస్తున్న మంత్రి హరీశ్‌రావు

రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు


ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సిద్దిపేట, డిసెంబరు 12 : సిద్దిపేట శివారులో ఐటీ పార్క్‌ కోసం భూమి పూజ చేసిన విషయం తెలిసి అమెరికా నుంచి తనకు ఫోన్లు వచ్చాయని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. తెలంగాణ ప్రాంతం నుంచి అమెరికాలో స్థిరపడిన వాళ్లు సిద్దిపేటలో తమ కంపెనీలను ఏర్పాటు చేయడానికి ముందుకొస్తున్నారని తెలిపారు. ఈ ప్రాంత నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు సిద్ధంగా ఉన్నారని, ఫలితంగా వారి కంపెనీలను కూడా విస్తరించినట్లు అవుతుందని పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి అన్నపూర్ణ ట్రస్టు ఆధ్వర్యంలో శుక్రవారం సిద్దిపేట నియోజకవర్గంలోని ప్రైవేట్‌ పాఠశాలల ఉపాధ్యాయులకు నిత్యావసర సరుకులు అందజేశారు. మంత్రి హరీశ్‌రావు సైతం తన సొంత ఖర్చులతో హెల్త్‌ కిట్లను టీచర్లకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐటీ టవర్‌కు భూమిపూజ చేసిన రోజే నాలుగు ప్రముఖ కంపెనీలతో ఒప్పందం జరిగిందని వివరించారు. 2 వేల ఉద్యోగాలకు లైన్‌ క్లియర్‌ అయ్యిందని, ఇప్పుడు మరికొన్ని ఉద్యోగాలు రాబోతున్నాయని చెప్పారు. మౌలిక వసతులు ఉన్నపుడే పరిశ్రమలు, కంపెనీలు ఏర్పాటు చేస్తారని వివరించారు. మౌలిక వసతులు ఉండాలంటే ఈ ప్రాంతం స్వచ్ఛతతో, ఆర్యోగంగా ఉండాలని తెలిపారు. అందుకే ప్రతి ఒక్కరూ స్వచ్ఛ సిద్దిపేట, ఆరోగ్య సిద్దిపేట కోసం అడుగులు వేయాలని కోరారు. ప్రైవేట్‌ టీచర్లందరికీ అండగా ఉంటామని, ఏ ఒక్కరూ అధైర్యపడొద్దని సూచించారు. కొవిడ్‌ రెండో దశ ప్రమాదకరంగా ఉన్నదని, కావున జాగ్రత్తగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సు, మార్కెట్‌ చైర్మన్‌ పాల సాయిరాం, పట్టణ టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు సంపత్‌రెడ్డి, సత్యసాయి ట్రస్టు ప్రతినిధులు రామ్మూర్తి, ఆనంద్‌, ప్రైవేట్‌ టీచర్ల సంఘం అధ్యక్షుడు రత్నాకర్‌ తదితరులు పాల్గొన్నారు. 

సిద్దిపేట ప్రజల సంక్షేమం, ఈ ప్రాంత అభివృద్ధిపై మంత్రి హరీశ్‌రావుకు ఉన్న కమిట్‌మెంటు అసాధారణమని ఫస్ట్‌ అమెరికన్‌ ఇండియా ఐటీ కంపెనీ నిర్వాహకుడు రఘు ప్రశంసించారు. సత్యసాయి ట్రస్టు ఆహ్వానంతో ఇక్కడకు వచ్చానని, తొలిసారి హరీశ్‌రావును ప్రత్యక్షంగా చూశానని చెప్పారు. ఆయన మాటలు విని ఫ్లాట్‌ అయ్యానని, లీడర్‌ అంటే ఇలాగే ఉండాలని అన్నారు. సత్యసాయి ఉచిత అన్నదానం రవాణా కోసం ఒక వాహనాన్ని సిద్దిపేటకు ఇచ్చానని, ఇక్కడికి వచ్చాక మరో మూడు వాహనాలను ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. సిద్దిపేట ఐటీ పార్క్‌లో తన కంపెనీ కోసం స్థలం కేటాయిస్తే నిరుద్యోగులకు ఉపాధి కల్పించడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. 


Updated Date - 2020-12-13T06:23:46+05:30 IST