సిద్దిపేట అంటేనే అభివృద్ధికి చిహ్నం
ABN , First Publish Date - 2020-08-16T10:27:13+05:30 IST
సిద్దిపేట అంటేనే అభివృద్ధికి చిహ్నంగా మారిందని, జిల్లా ఇప్పటికే ఎన్నో అభివృద్ధి పురోగతులు సాధించి ఎన్నింటిలోనో ఆదర్శంగా నిలిచిందని

3,256 చెరువులు, చెక్‌డ్యాంలు నిర్మించుకున్నాం
హరితహారంతో పచ్చదనంగా పెంపొందించుకున్నాం
నూతన పంచాయతీరాజ్ చట్టంతో పేదలకు మేలు
స్వాతంత్య్ర వేడుకల్లో మంత్రి హరీశ్‌రావు
సిద్దిపేట సిటీ, ఆగస్టు 15: సిద్దిపేట అంటేనే అభివృద్ధికి చిహ్నంగా మారిందని, జిల్లా ఇప్పటికే ఎన్నో అభివృద్ధి పురోగతులు సాధించి ఎన్నింటిలోనో ఆదర్శంగా నిలిచిందని, సిద్దిపేట జిల్లా అభివృద్ధిలో ముందుండి ఇతర జిల్లాలకు ప్రోత్సాహకంగా నిలుస్తుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్‌లో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పతాకావిష్కరణ చేశారు. అంతకు ముందు మంత్రి కలెక్టరేట్ కార్యాలయంలో పోలీసులచే గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం కలెక్టరేట్ మీటింగ్ హాల్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత కరోనా నేపథ్యంలో జెండా పండుగను నిరాడంబరంగా నిర్వహించామని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాలో జరిగిన పలు అభివృద్ధి పనులను గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ తలపెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు.
రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలు దేశంలోనే మంచి గుర్తింపు పొందాయన్నారు. ముఖ్యంగా మిషన్ భగీరఽథ, కాకతీయ పనులతో దాదాపు జిల్లాలో అన్నీ చెరువులు, చెక్‌డ్యాంలు నీటితో కళకళలాడుతున్నాయన్నారు. జిల్లాలో 3,256 చెరువులు, చెక్‌డ్యాంలను నిర్మించామని, వీటి ద్వారా 1,13,237 ఆనకట్టలు నిర్మించామని, మిషన్ కాకతీయ పథకం ద్వారా 2,140 చెరువులను పునరుద్ధరించుకున్నా మన్నారు. అంతేకాకుండా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఇప్పటికే జిల్లాలో నీటి సమస్య తొలగిపోయిందన్నారు.
నియంత్రిత సాగు విధానానికి అనుగుణంగా జిల్లాలో ఈ వర్షకాలం 2,10,401 ఎకరాలలో వరి, 2,25,359 ఎకరాలలో పత్తి, 41,248 ఎకరాలలో కంది సాగు చేయడానికి ప్రభుత్వం నుంచి సహకారం అందిస్తున్నట్లు తెలిపారు. రైతుబంధు పఽథకం ద్వారా 2,77,630 మంది లబ్ధిపొందినట్లు వివరించారు. జిల్లాలో 581 మంది రైతులకు రైతుబీమా అందినట్లు పేర్కొన్నారు.
జిల్లావ్యాప్తంగా 8,370 ఇళ్లను నిర్మించాం
జిల్లాలో ఇప్పటివరకు 12,820 రెండు పడకల ఇళ్లు మంజూరు కాగా, అందులో 8,370 ఇళ్లు నిర్మాణం పూర్తిచేసుకున్నాయని, కొన్ని ఇళ్లను ఇప్పటికే లబ్ధిదారులకు అందించామన్నారు. కాగా భవన నిర్మాణ అనుమతులు సులువుగా పొందేందుకు టీఎస్ బీపాస్‌ను కొత్తగా రూపొందించినట్లు తెలిపారు. నూతన పంచాయతీరాజ్ చట్టం ద్వారా గ్రామాల రూపురేఖలు పూర్తిగా మరాయని, ఈ చట్టంతో గ్రామాలు స్వచ్ఛత వైపు అడుగులు వేస్తున్నాయన్నారు.
కొవిడ్-19 చికిత్స కోసం రెండు వందల పడకల వసతి గల ఆసుపత్రులను జిల్లాలోని సిద్దిపేట, ములుగులో ఏర్పాటు చేశామన్నారు. అంతేకాకుండా ఆర్టీపీసీఆర్ పరీక్షలు గజ్వేల్ ఏరియా ఆసుపత్రిలో, సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో, ములుగులోని ఆర్‌వీఎం వైద్య కళాశాలలో జరుగుతున్నాయన్నారు. జిల్లాలోని 33 ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో, 4 సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో, గజ్వేల్, సిద్దిపేటలో ప్రతినిత్యం ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలు చేస్తున్నట్లు తెలిపారు. కరోనా చికిత్సకు నిరంతరం పాటుపడుతున్న వైద్యుల సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంకట్రామారెడ్డి, ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్ రోజాశర్మ, ఎమ్మెల్సీ ఫారుఖ్ హుస్సేన్, పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్, అడిషనల్ కలెక్టర్లు పద్మాకర్, ముజమ్మీల్ ఖాన్, అధికారులు, పోలీసులు తదితరులు పాల్గొన్నారు.
మహనీయుల త్యాగం మరువలేనిది
సిద్దిపేట టౌన్: దేశానికి స్వాతంత్య్రం వచ్చిందంటే అది ఎంతో మంది మహనీయుల త్యాగ ఫలితమేనని, వారిని ఏటా స్మరించుకుంటూ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. శనివారం సిద్దిపేట పట్టణంలోని మంత్రి నివాసంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు.