మా ఊరికి రావొద్దు...

ABN , First Publish Date - 2020-03-25T12:48:24+05:30 IST

ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని పల్లెలన్నీ స్వీయ నిర్బంధం విధించుకున్నాయి. బయటి వారెవరూ తమ ఊరికి రాకుండా సరిహద్దుల్లో కంచెలను ఏర్పాటు చేస్తున్నారు. చెట్లను నరికి, అడ్డుగా వేస్తున్నారు. అడ్డుగా ట్రాక్టర్లను, బైక్‌లను పెట్టి మా ఊరికి ఎవరూ

మా ఊరికి రావొద్దు...

  • తేల్చిచెబుతున్న పల్లెవాసులు
  • గ్రామ సరిహద్దుల్లో కంచెలు, బారికేడ్ల ఏర్పాటు
  • ఇతరులెవరూ రాకుండా కట్టడి
  • పట్టణాలు, మండల కేంద్రాలతో కనెక్షన్‌ కట్‌
  • సిర్సనగండ్లలో బయటివారు వస్తే జరిమానా విధిస్తామని హెచ్చరిక


ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని పల్లెలన్నీ స్వీయ నిర్బంధం విధించుకున్నాయి. బయటి వారెవరూ తమ ఊరికి రాకుండా సరిహద్దుల్లో కంచెలను ఏర్పాటు చేస్తున్నారు. చెట్లను నరికి, అడ్డుగా వేస్తున్నారు. అడ్డుగా ట్రాక్టర్లను, బైక్‌లను పెట్టి మా ఊరికి ఎవరూ రావద్దంటూ నమస్కారం చేస్తున్నారు. కరోనా వైరస్‌ కట్టడికి ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించిన నేపథ్యంలో ఇలా ప్రతిఊరి జనం ఒక్కటై ఇలా కట్టుదిట్టంగా వ్యవహరిస్తున్నారు. 


(సిద్దిపేట జిల్లా నెట్‌వర్క్‌): సిద్దిపేట జిల్లాలో 499 గ్రామాలుండగా.. మంగళవారం సుమారు 100 గ్రామాల్లో ఆంక్షలు విధించారు. పొలిమేరల్లో ముళ్లకంచెలు, బారికేడ్లు  ఏర్పాటు చేశారు. గ్రామస్థులంతా ఏకమై విడతలవారీగా కాపలాకాస్తూ.. అధికారులు, అవసరమైన వారికి మాత్రమే అనుమతి ఇస్తున్నారు. కోహెడ మండలంలో కరీంనగర్‌ నుంచి వచ్చే ప్రధాన రహదారుల సరిహద్దులను ఆయా గ్రామాల సర్పంచులు మూసివేశారు. తంగళ్లపల్లి, శనిగరం,  తీగలకుంటపల్లి, వరుకోలు, చెంచల్‌ చెరువుపల్లి గ్రామాల్లో సర్పంచులే స్వయంగా గస్తీని పర్యవేక్షించారు. కరీంనగర్‌లో కరోనా ఎఫెక్ట్‌తో  వణికిపోయే పరిస్థితి ఏర్పడినందున ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వారు పేర్కొంటున్నారు. సీసీ పల్లె మీదుగా హుస్నాబాద్‌కు వెళ్లే ప్రధాన రహదారిని సైతం గ్రామస్థులు మూసివేశారు. హుస్నాబాద్‌, కరీంనగర్‌,  రాజీవ్‌ రహదారికి వెళ్లే  ప్రధాన రహదారులన్నింటినీ మూసివేయడంతో మండలం  అష్టదిగ్బంధనంలోకి  వెళ్లింది. గజ్వేల్‌ మండలం శ్రీగిరిపల్లిలో బయట వ్యక్తులు రాకుండా చెక్‌పోస్టును ఏర్పాటు చేసుకున్నారు. దౌల్తాబాద్‌ మండలంలోని పలు గ్రామాలకు కలిపే రహదారిని గాజులపల్లి గ్రామ ప్రజలు మూసివేశారు. దుబ్బాక మండలంలోని అన్ని గ్రామాల మధ్య కంచెలను ఏర్పాటు చేసి స్వీయ నిర్బంధాన్ని ఏర్పాటు చేసుకున్నారు. 


ఎక్కడికక్కడ ముళ్లపొదలు, ఇనుప కంచెలు, రాళ్లను అడ్డంపెట్టి రాకపోకలను స్తంభింపజేశారు. మిరుదొడ్డి మండలంలోని రుద్రారం, అందె, అక్బర్‌పేట, చెప్యాలలో కంచెలను ఏర్పాటు చేశారు. గ్రామ వలంటీర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులతోపాటు వివిధ ప్రజాప్రతినిధులు గ్రామంలో గస్తీ తిరిగారు. బెజ్జంకి మండల పరిధిలోని వీరాపూర్‌, దేవక్కపల్లి, గాగీల్లపూర్‌, దాచారం, గుండారం గ్రామాల్లో సర్పంచుల ఆధ్వర్యంలో ప్రధాన రహదారులపై ముళ్ల కంచెలు, బారికేడ్లు ఏర్పాటు చేశారు. మద్దూరు మండలంలోని వల్లంపట్ల, బైరాన్‌పల్లి, మర్మాముల గ్రామాల పొలిమేరల్లో సర్పంచ్‌ల ఆధ్వర్యంలో కంచెలను ఏర్పాటు చేసి కొత్త వ్యక్తుల రాకను అడ్డకున్నారు.  విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామస్థులకు నచ్చజెప్పి కంచెలను తొలగించారు. కొత్త వ్యక్తులు, ఇతర దేశాల  నుంచి వచ్చిన వారి సమాచారం తమకు అందజేస్తే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రాయపోల్‌ మండలంలో పలు గ్రామాల ప్రజలు గ్రామ రహదారులను మూసేశారు. అంకిరెడ్డిపల్లిలో గ్రామంలోకి వచ్చేవారు బ్లీచింగ్‌ పౌడర్‌ కలిపిన నీటితో చేతులు, కాళ్లను శుభ్రంగా కడుక్కొని రావాలని నిబంధన విధించారు. వర్గల్‌ మండలం నెంటూర్‌లో రాజీవ్‌ రహదారి నుంచి వచ్చే  రహదారిపై ముళ్లకంచె ఏర్పాటు చేశారు. అనంతగిరిపల్లికి వచ్చే ప్రధాన రహదారిని గ్రామస్థులు మూసివేశారు. నారాయణరావుపేట మండలంలోని మల్యాల, గోపులాపూర్‌, ఇబ్రహీంపుర్‌, బంజేరుపల్లి గ్రామాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి ఇతరులు రాకుండా అడ్డుకున్నారు.


చేర్యాల మండలం వీరన్నపేట గ్రామస్థులు శివార్లను మేసివేశారు. ప్రధాన రహదారులకు అడ్డంగా ముళ్లకంప, రాళ్లను ఉంచి మూసివేశారు. మా ఊరికి ఎవరూ రావద్దు.. మీ ఊరికి మేము రామని ప్రచారం చేశారు. నంగునూరు మండలంలోని వివిధ గ్రామాల వారు ఊరి సరిహద్దులలో చెక్‌ పోస్టులను ఏర్పాటు చేసుకున్నారు.  అత్యవసర పని ఉంటే తప్ప ఊర్లోకి రానివ్వలేదు. అక్కన్నపేట మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో ప్రజలు రెండో రోజూ లాక్‌డౌన్‌ పాటించారు. ఇతరులెవరూ ఊళ్లలోకి రాకుండా ముళ్ల కంచెలు, బారికేడ్లు ఏర్పాటుచేసి రహదారులను మూసివేశారు.


పలు గ్రామాల్లో వ్యవసాయ కూలీలు పనుల్లో నిమగ్నమయ్యారు. దౌల్తాబాద్‌ మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో ముళ్ల కంచెలు కొత్తవారి ప్రవేశాన్ని అడ్డుకున్నాయి. కొండపాక మండలం సిర్సనగండ్లలో ఉదయం 10 గంటల అనంతరం ఎవరైనా బయట కనిపిస్తే రూ.100 నుంచి రూ.500 వరకు జరిమానా విధిస్తామని దండోరా వేయించారు. 


మెదక్‌ జిల్లాలో..

కరోనా నివారణ నేపథ్యంలో మెదక్‌ జిల్లా  రహదారులు మూగబోయాయి. మంగళవారం పలు గ్రామాల్లో రహదారులను దిగ్బంధం చేశారు. తూప్రాన్‌ రూరల్‌ మండలంలోని నాగులపల్లి, వట్టూరు, ఇస్లాంపూర్‌, కిష్ట్టాపూర్‌, యావాపూర్‌, ఘనపూర్‌, వెంకటాయపల్లి, నర్సంపల్లి గ్రామాల రోడ్లపైన ముళ్లకంచెలు వేశారు. మంగళవారం తూప్రాన్‌లో జరగాల్సిన వారాంతపు సంతను బంద్‌ చేశారు. దీంతో ఉగాది పండుగ సామగ్రి కొనుగోలుకు ఇబ్బందులు పడ్డారు. మనోహరాబాద్‌ మండలంలోని అన్ని గ్రామాల పొలిమేరల్లో అధికారులు, ప్రజాప్రతినిధలు, నాయకులు బారీకేడ్లను ఏర్పాటు చేశారు. పారిశ్రామిక ప్రాంతమైన కాళ్లకల్‌ గ్రామానికి వచ్చే రహదారుల్లో బారికేడ్లను ఏర్పాటు చేశారు. మూసాపేట, జూకల్‌ గ్రామాల శివారులో ప్రజలు ముళ్ల కంచెలను ఏర్పాటుచేశారు. 161వ జాతీయ రహదారిపై జంబికుంట వద్ద పోలీసులు చెక్‌పోస్టును ఏర్పాటు చేసి వాహనాలను క్షుణ్ణంగా  పరిశీలించారు. నర్సాపూర్‌ మండలంలోని నారాయణపూర్‌, అచ్చంపేట, బ్రాహ్మణపల్లి, తుజాల్‌పూర్‌ గ్రామాల్లో మంగళవారం గ్రామ ప్రధాన రోడ్లపై కంచె ఏర్పాటు చేశారు. చేగుంట, నార్సింగి మండలాల్లో చేగుంట, రాంపూర్‌, చందాయిపేట, చిన్న శివునూర్‌, నార్సింగి మండలం శేర్‌పల్లి గ్రామాల్లో రోడ్లను మూసివేశారు.  అల్లాదుర్గం మండలంలోని సీతానగర్‌ గ్రామస్థులు స్వీయ నిర్భంధానికి నడుం బిగించారు. 


గ్రామ ప్రధాన రహదారిపై చెక్‌పోస్టును ఏర్పాటు చేసుకుని రాకపోకలపై నిఘా ఉంచారు. రేగోడు మండలంలోని జగిర్యాల, టి.లింగంపల్లి, రేగోడు పోచమ్మ వీధి రోడ్లను స్థానికులు మూసివేశారు. జగిర్యాలలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారి వివరాలను రెవెన్యూ, పోలీస్‌, వైద్యశాఖ అధికారులకు ఎప్పటికప్పుడు చేరవేస్తున్నారు. కౌడిపల్లి మండల పరిధిలోని తునికి నల్లపోచమ్మ ఆలయానికి భక్తులు రాకుండా గ్రామస్థులు, ఆలయ సిబ్బంది దారికి అడ్డంగా ముళ్ల కంచెను ఏర్పాటు చేశారు. సలావత్‌పూర్‌, మహ్మద్‌నగర్‌, వెల్మకన్న గ్రామాల్లో రహదారులపై ముళ్ల కంచెలను ఏర్పాటు చేశారు.  కొల్చారం మండలంలోని కోనాపూర్‌, పోతంశెట్టిపల్లి గ్రామాల్లో మంగళవారం రోడ్లపై బారికేడ్లను ఏర్పాటు చేశారు. చిల్‌పచెడ్‌ మండల పరిధిలోని గౌతాపూర్‌, చిట్కూల్‌, బండపోతుగల్‌, సోమక్కపేట, రాందాసుగూడ, సీలాంపల్లి గ్రామాల్లోకి ఇతరులు రాకుండా ముళ్ల కంచెలు ఏర్పాటు చేశారు. రాందాసుగూడలో రోడ్డును మూసేసిన గ్రామస్థులు తమ గ్రామంలోకి రావద్దంటూ దండంపెట్టి నిరసన తెలిపారు. గంగారం గ్రామంలో బ్లీచింగ్‌ చేశారు. అజ్జమర్రిలో ఇతర గ్రామాలవారు రాకుండా వీఆర్‌ఏలు కాపలాకాశారు. శివ్వంపేట మండలంలోని గ్రామాల్లో అన్ని రహదారులను మూసివేశారు. గోమారం గ్రామంలో తెరిచిఉంచిన హోటల్‌ను అధికారులు సీజ్‌ చేశారు. వెల్దుర్తి మండలంలోని నెల్లూరు, శంషారెడ్డిపల్లి తండాలకు ఇతరులు రాకుండా స్థానికులు కంచెలను ఏర్పాటు చేశారు. చిన్నశంకరంపేట మండలం మడూర్‌, చందంపేట, జంగరాయి గ్రామాల్లోకి వాహనాలు, కొత్తవారిని అనుమతించలేదు. జిల్లాకేంద్రమైన మెదక్‌ మున్సిపాలిటీ పరిధిలోని ఒకటో వార్డు ఔరంగాబాద్‌లోకి ఇతరులు రాకుండా కౌన్సిలర్‌ బీమరి కిషోర్‌ ఆధ్వర్యంలో ప్రధాన రోడ్డుపై బారికేడ్లు ఏర్పాటు చేశారు. చెక్‌పోస్టును ఏర్పాటు చేసి రాకపోకలపై నిఘా ఏర్పాటు చేశారు. కాలనీలోకి వచ్చేవారి వివరాలు సేకరించారు.


సంగారెడ్డి జిల్లాలో..

సంగారెడ్డి జిల్లావ్యాప్తంగా పలు గ్రామాలు కరోనాపై కట్టడి పాటిస్తున్నాయి. కర్ణాటక, మహరాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో ప్రజలు కొత్తవారు రాకుండా అడ్డుకున్నారు. ఝరాసంగం మండల కేంద్రంతో పాటు మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో ప్రజలు మంగళవారం ఇళ్లకే పరిమితమయ్యారు. కేతకీ సంగమేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి పూజలు, నివేదనల అనతరం తాళం వేశారు. మండల పరిధిలోని బర్దీపూర్‌లో ప్రధాన రహదారిపై ముళ్లకంచెను ఏర్పాటుచేసి రాకపోకలను అడ్డుకున్నారు. న్యాల్‌కల్‌, చీలపల్లి, రుక్మాపూర్‌, చీలపల్లి తాండాలకు జహీరాబాద్‌ పట్టణంతో సంబంఽధాలు తెగిపోయాయి. రాష్ట్ర సరిహద్దుల్లోని నాగల్‌గిద్ద మండలంలో కారముంగి, ఔదత్పూర్‌, పూసల్‌పాడ్‌, ముక్టాపూర్‌ తదితర గ్రామాల్లోకి ఇతరుల ప్రవేశాన్ని నిషేధించారు. గ్రామాలకు వచ్చే రహదారులను మూసివేసి ఇతరులకు ప్రవేశం లేదంటూ బోర్డులు ఏర్పాటు చేశారు. నారాయణఖేడ్‌ మండలం వెంకటాపూర్‌ గ్రామస్థులు మంగళవారం తమ గ్రామం మీదుగా ఇతర వెళ్లే రహదారులను స్తంభింపజేశారు. దీంతో దాదాపు పది గ్రామాలు, గిరిజన తండాలకు రాకపోకలు నిలిపోయాయి. 


పొలమేరల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి అత్యవసరమైన వారిని మాత్రమే చేతులు, కాళ్లను శుభ్రం చేయించి వెళ్లడానికి సహకరించారు. రాయికోడ్‌ మండల పరిధిలోని సంగాపూర్‌, ఔరంగ్‌ నగర్‌ సర్పంచుల ఆధ్వర్యంలో గ్రామస్థులు రోడ్లను దిగ్బంధం చేశారు. కొత్త వ్యక్తులు రాకుండా అడ్డుకున్నారు. కోహీర్‌ మండల కేంద్రంలోని భీమ్‌నగర్‌ కాలనీవాసులు ఇతరులు రాకుండా కంచెను ఏర్పాటుచేసి అడ్డుకున్నారు. అందోలు మండలంలోని రాంసాన్‌పల్లి గ్రామస్థులు తమ గ్రామంలోకి ఇతరులు రాకుండా అప్రోచ్‌ రోడ్డుకు అడ్డంగా కంచెను ఏర్పాటు చేశారు. హత్నూర మండలంలోని గుండ్లమాచునూర్‌, పన్యాల, చీక్‌మద్దూర్‌, పల్పనూర్‌, నాగారం గ్రామాల ప్రజలు తమ గ్రామాల్లోకి వచ్చే రహదారులను మూసివేసి ఇతరులు రాకుండా అడ్డుకున్నారు. గుమ్మడిదల మండలంలోని కానుకుంట, అనంతారం, మంబాపూర్‌ గ్రామాల్లో ప్రధాన రహదారులను మూసివేశారు. బయటివారు రాకుండా అడ్డుకున్నారు. ప్రజాప్రతినిధులు, నాయకులు రోడ్లపైకి వచ్చినవారికి దండంపెడుతూ ఇళ్లలోకి వెళ్లాలని వేడుకున్నారు. జిన్నారం మండలంలోని సోలక్‌పల్లి, శివానగర్‌, నల్తూరు గ్రామాల్లో ప్రధాన రహదారులను మూసివేశారు. గ్రామాల్లో జన జీవనం స్తంభించిపోయింది. పారిశ్రామికవాడల్లో ఫార్మా, బల్క్‌ డ్రగ్‌ పరిశ్రమల్లో కార్మికులు జాగ్రత్తలతో విధులకు హాజరయ్యారు.  

Read more