రెండో విడత ఇంకెన్నాళ్లకు?

ABN , First Publish Date - 2020-12-13T06:10:38+05:30 IST

రెండో విడత గొర్రెల పంపిణీ ఎప్పుడెప్పుడా.. అని గొర్రెల కాపరులు ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 2017లో గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రవేశపెట్టింది. కాగా ఈ పథకం అమలులో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని గొర్రె కాపరులు మండిపడుతున్నారు.

రెండో విడత ఇంకెన్నాళ్లకు?
మొదటి విడతలో పంపిణీ చేసిన గొర్రెలు (ఫైల్‌)

పత్తాలేని మలి విడత గొర్రెల పంపిణీ

డీడీలు చెల్లించి రెండేళ్లు

పథకం ఊసే ఎత్తని ప్రభుత్వం

వడ్డీలు పెరుగుతున్నాయని లబ్ధిదారుల ఆందోళన


గుమ్మడిదల, డిసెంబరు 12: రెండో విడత గొర్రెల పంపిణీ ఎప్పుడెప్పుడా.. అని గొర్రెల కాపరులు ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 2017లో గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రవేశపెట్టింది. కాగా ఈ పథకం అమలులో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని గొర్రె కాపరులు మండిపడుతున్నారు. మొదటి విడత గొర్రెలు అందజేసి రెండు సంవత్సరాలు గడుస్తున్నా.. రెండో విడత పంపిణీపై స్పందించకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది.


మొదటి విడతలో 412 మందికి పంపిణీ

2017లో ప్రభుత్వం మండలాల వారీగా గొల్ల, కురుమల సొసైటీలను ఏర్పాటు చేసింది. లాటరీ పద్ధతిన సోసైటీ సభ్యుల్లో సగం మందికి మొదటి విడతగా.. మిగిలిన సభ్యులకు రెండో విడతగా గొర్రెలను అందజేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. మండలంలో పలు గ్రామాల్లో మొత్తం 10 సొసైటీలను ఏర్పాటు చేసి అందులో వెయ్యి మందిని సొసైటీలో సభ్యులుగా చేర్చారు. మొదటి విడతలో దాదాపు 835మంది గొర్రెల కోసం దరఖాస్తు చేసుకోగా.. లాటరీ పద్ధతిలో 412 మందిని ఎంపిక చేసింది. 412 మందికి మొదటి విడతలో గొర్రెలను పంపిణీ చేశారు. యూనిట్ల వారీగా చూస్తే గుమ్మడిదల 175, బొంతపల్లి 63, మంబాపూర్‌ 8, కానుకుంట 102, అనంతారం 26, నల్లవల్లి 20, కొత్తపల్లి, నాగిరెడ్డిగూడెం 15, దోమడుగు 17 యూనిట్లను పంపిణీ చేశారు. 2018లో రాష్ట్ర ప్రభుత్వం రెండో విడత గొర్రెల పంపిణీ ప్రక్రియను ప్రారంభించి కేవలం బొంతపల్లి 30, నల్లవల్లి 19 యూనిట్లకు మాత్రమే పంపిణీ చేశారు. రెండో విడత 244మంది గొర్రెల కోసం దాదాపు రూ. 78,76,740 డీడీ ద్వారా ప్రభుత్వానికి ఇప్పటికే చెల్లించారు. కానీ రెండు ఏళ్లు గడుస్తున్నా.. ఇప్పటికీ గొర్రెలను పంపినీ చేయడం లేదని లబ్ధిదారులు ఆవేదన వ్యకం చేస్తున్నారు. తాము వడ్డీలకు తెచ్చి డీడీలు కట్టామని, ఇప్పటికీ వడ్డీలు కట్టలేక అప్పుల పాలవుతున్నట్లు వాపోయారు.


వడ్డీ కట్టలేక పోతున్నా

ప్రభుత్వం రెండో విడత గొర్రెల పంపిణీ చేస్తామని ప్రకటించడంతో ఎంతో ఆశతో తన వద్ద డబ్బు లేకున్నా వడ్డీకి తీసుకొచ్చి డీడీ కట్టాను. ఇప్పటికీ రెండేళ్లు కావస్తున్నా.. గొర్రెలు రాలేదు. ప్రతి నెలా తీసుకొచ్చిన అప్పుకు వడ్డీలు చెల్లించలేక అవస్థలు పడుతున్నాను.

-కొత్త రాజయ్య, గొర్రెల కాపరి, గుమ్మడిదల

Updated Date - 2020-12-13T06:10:38+05:30 IST