సారొస్తారని..
ABN , First Publish Date - 2020-11-21T05:35:01+05:30 IST
సారొస్తారని..

ముస్తాబవుతున్న రాజీవ్ రహదారి
సీఎం కేసీఆర్ రాక కోసం ఏర్పాట్లు
డబుల్ ఇళ్లు, కలెక్టరేట్, సీపీ ఆఫీసుల ప్రారంభంపై కసరత్తు
తుది పనులపై చర్యలు వేగవంతం
24వ తేదీనా..? జీహెచ్‌ంఎసీ ఎన్నికలు ముగిశాకనా అన్నదానిపై స్పష్టత కరువు
ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సిద్దిపేట, నవంబరు 20 : ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు రాక కోసం సిద్దిపేట జిల్లాలో ఏర్పాట్లు ముమ్మరమయ్యాయి. ఆయన ఏ క్షణంలోనైనా వస్తున్నట్లు కబురంపినా అన్నీ సిద్ధంగా ఉండేలా అధికార యంత్రాంగం కసరత్తు మొదలుపెట్టింది. నాలుగైదు రోజుల్లో సీఎంతో కలెక్టరేట్, సీపీ కార్యాలయం, డబుల్‌బెడ్‌రూం ఇళ్లను ప్రారంభిస్తామని కలెక్టర్ ప్రకటించిన విషయం విధితమే. అయితే 24న ముహూర్తంగా నిర్ణయించినప్పటికీ తెరమీదకు జీహెచ్‌ఎంసీ ఎన్నికలు వచ్చాయి. అయితే ఆయన పర్యటన ఎప్పుడుంటుందో అధికారులకు కూడా స్పష్టత లేదు. అయినా తుది పనుల్లో నిమగ్నమయ్యారు.
2016 అక్టోబరు 11న ఆవిర్భవించిన సిద్దిపేట జిల్లాకు సీఎం కేసీఆర్ తాజా పర్యటన ఎంతో ప్రత్యేకమైనది. 2017లో స్వయంగా ఆయనే దుద్దెడ వద్ద నూతన కలెక్టరేట్, సీపీ కార్యాలయాలకు భూమిపూజ చేశారు. ప్రస్తుతం అవి పూర్తికావడంతో ప్రారంభించడానికి వస్తున్నారు. తన సొంత జిల్లా కావడం, తాను ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలోనే వీటి నిర్మాణం జరగడంతో అన్ని హంగులతో ఈ పరిపాలన సొబగులను తీర్చిదిద్దారు. దీనికి తోడు సిద్దిపేట పట్టణ శివారులో నిర్మించిన 2,460 డబుల్ బెడ్‌రూం ఇళ్లలో నిరుపేదల గృహప్రవేశాలకు హాజరవుతారు.
రాజీవ్ రహదారి ముస్తాబు
హైదరాబాద్ టూ కరీంనగర్ రాజీవ్ రహదారిని ఆనుకునే దుద్దెడ గ్రామ శివారులో నూతన కలెక్టరేట్, సీపీ కార్యాలయాలను నిర్మించారు. సీఎం కేసీఆర్ సైతం రోడ్డు మార్గంలో ఇక్కడకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందుకే రాజీవ్ రహదారిని మూడురోజులుగా ముస్తాబు చేస్తున్నారు. రోడ్డుకు ఇరువైపులా పిచ్చిమొక్కలు తొలగిస్తున్నారు. డివైడర్ నడుమ రకరకాల మొక్కలు నాటి పచ్చికను ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రజ్ఞాపూర్ శివారుదాకా డివైడర్లు, రోడ్డుకు ఇరువైపులా మొక్కలు ఆకర్షిస్తుంటాయి. అదే పద్ధతితో సిద్దిపేట పట్టణం వరకు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. డబుల్ బెడ్రూం ఇళ్ల ప్రారంభం కూడా రాజీవ్‌రహదారి పక్కనే ఉన్న నర్సాపూర్ శివారులోనే ఉంది. పలువురు కూలీలతో శరవేగంగా ఈ పనులు చేయిస్తున్నారు. కలెక్టరేట్, సీపీ కార్యాలయాల ఆవరణలోనూ పచ్చని మొక్కలు నాటుతున్నారు.
తుదిపనులపై కసరత్తు
ఒకవేళ సీఎం పర్యటన వాయిదా పడితే అధికారులకు మరింత సమయం లభిస్తుంది. అందుకే తుది పనులనూ పూర్తి చేయడానికి కసరత్తు ప్రారంభించారు. నూతన కలెక్టరేట్‌కు ఫర్నీచర్ కూడా వచ్చేస్తున్నది. కలెక్టర్‌తోపాటు అడిషనల్ కలెక్టర్లు, ఇతర జిల్లా శాఖల ముఖ్య అధికారుల ఛాంబర్లను సిద్దం చేస్తున్నారు. పోలీస్ కమిషనర్ కార్యాలయం పనులు ఇంకా పూర్తికాలేదు. అయినప్పటికీ ఒక సీపీ ఛాంబర్‌ను పూర్తిచేసేలా చర్యలను వేగిరం చేశారు. ఇక డబుల్‌బెడ్‌రూం ఇళ్లలోనూ కొన్ని పెండింగ్ పనులపై దృష్టి సారించారు. ఇప్పటికే 1,300 మంది నిరుపేదలకు ఇళ్లు కేటాయించారు. వీరికి సంబంధించిన ఇళ్లను శుభ్రం చేశారు. అక్కడక్కడా నెలకొన్న చిన్నపాటి సమస్యలను పరిష్కరిస్తున్నారు. వంట గ్యాస్ పైపులైన్ కనెక్షన్లనూ ప్రతీ ఇంటికీ అనుసంధానించారు. డబుల్ ఇళ్ల కాలనీ అంతా పచ్చగా కళకళలాడేలా మొక్కలతో తీర్చిదిద్దుతున్నారు. కలెక్టర్ వెంకట్రామారెడ్డి పర్యవేక్షణలో ఈ బాధ్యతలన్నీ ప్రత్యేకాధికారులకు అప్పగించారు.
కేసీఆర్ పర్యటనపై అస్పష్టత
సీఎం కేసీఆర్ ఈనెల 24వ తేదీన వస్తున్నట్లుగా ప్రచారం జరిగింది. నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి సంబంధించి శిలాఫలకం తయారీ నమూనా పత్రం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అంటే వచ్చే మంగళవారం సీఎం పర్యటన ఖరారైనట్లుగా ఓ అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనిపై అధికారుల్లోనూ స్పష్టత లేదు. ఇంతలోనే జీహెచ్‌ఎంసీ ఎన్నికలు రావడంతో అనుకున్న ముహూర్తం వాయిదా పడినట్లుగా తెలుస్తున్నది. మంత్రి హరీశ్‌రావు, ఎంపీలు, ఇతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ ఎన్నికల బిజీలో ఉన్నారు. ఈ సమయంలోనే ప్రారంభోత్సవాలు పెట్టుకుంటే ఎన్నికలపై ప్రభావం చూపించే అవకాశాలు కూడా లేకపోలేదు. పైగా ఇదే రోజు తెలంగాణలోనే మొట్టమొదటి సారిగా కొత్త జిల్లాల్లో నిర్మించిన టీఆర్‌ఎస్ భవన్‌ను కూడా ప్రారంభించనున్నారు. దీనికి టీఆర్‌ఎస్ శ్రేణులంతా ఉండాల్సిందే. ఇవన్నీ సాగాలంటే మంత్రి హరీశ్‌రావు, ఇతర నేతలు రెండు రోజుల సమయాన్ని వెచ్చించకతప్పదు. అందుకే జీహెచ్‌ఎంసీ ఎన్నికలు పూర్తికాగానే మరో మంచి ముహూర్తం నిర్ణయిస్తారనే చర్చ వినిపిస్తున్నది.